‘వ్యూహం’ తర్వాత ‘యాత్ర 2’ వంతొచ్చింది!

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేపథ్య సినిమాల జోరు ఉంటూనే ఉంటుంది. ఈకోవలోనే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇతివృత్తంతో ఒకేసారి రెండు సినిమాలు రూపొందాయి. వాటిలో ఒకటి ‘వ్యూహం’ అయితే.. మరొకటి ‘యాత్ర 2’. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినా.. హైకోర్టు ఆ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. ఇప్పుడు ‘యాత్ర 2’ వంతొచ్చింది.

‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర 2’ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి వి రాఘవ్. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.యస్.ఆర్.పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఈ సినిమాను తీశారని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ ఆరోపిస్తూ.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్, సీఈఓ, హైదరాబాద్ రీజినల్ సెన్సార్ ఆఫీసర్ కు లెటర్ రాశారు.

తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధినేత సోనియాగాంధీకి వ్యతిరేకంగా ‘యాత్ర 2’ని తీయడంతో పాటు వారి పాత్రలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ఈ చిత్రంలో చిత్రీకరించారని నట్టికుమార్ తన లెటర్ వివరించారు. తెలుగు రాజకీయ కథా చిత్రం ‘యాత్ర-2’ సెన్సార్ ను లోక్ సభ ఎన్నికల తర్వాతే చేయాలన్న అభిప్రాయాన్ని నట్టి కుమార్ వ్యక్తంచేశారు. ఆమధ్య ‘వ్యూహం’ సినిమా సెన్సార్ విషయంలో నట్టికుమార్ ఇలాగే లెటర్ రాశారు. ఇప్పుడు ‘యాత్ర 2’ సెన్సార్ ని ఆపాలని లెటర్ రాయడం విశేషం.

Related Posts