38 ఏళ్ల స్వాతిముత్యం

తెలుగు సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వాలంటే.. స్టైలిష్ హీరో, గ్లామర్‌ హీరోయిన్‌, థ్రిల్లింగ్ ఫైట్స్, ఊర్రూతలూగించే పాటలు, ఊపుతెచ్చే ఐటమ్‌ నెంబర్‌ ఇలా ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అంతే గానీ.. మానసికంగా ఎదగని హీరో, పెళ్లయి పిల్లవాడున్న విధవరాలు హీరోయిన్‌.. పంచ్ డైలాగులు లేకుండా, కిక్కిచ్చే డాన్సులు, ఫైట్స్ లేకుండా.. ఎమోషన్స్ మీదే సినిమా తీయడం అది బ్లాక్‌బస్టర్‌ అవడం దగ్గరదగ్గర నాలుగు దశాబ్ధాలు కావొస్తున్నా గొప్పగా చెప్పుకోగలిగేంత హిట్‌ కావడం అనేది జరుగుతుందా.. ? చాలా వరకు అసాధ్యమనే చెప్తారు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సినిమా ‘స్వాతిముత్యం’. ఆ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్‌.


కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్‌ రూపొందించగా , ఏడిద నాగేశ్వరరావు పూర్నోదయా పతాకంపై నిర్మించిన ద్రుశ్య కావ్యం ‘స్వాతిముత్యం’.
భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్‌ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్‌ కే మొగ్గారు.


మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తంటికొండ , పట్టిసీమ ప్రాంతాల్లో షూట్‌ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్‌ ప్రాణంపోశాయి.ఈ సినిమాలో పాటలన్నీ ఎవర్‌గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.
ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్‌ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్‌ చేయడానికి విశ్వనాథ్‌ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని…’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్‌ కోసం మార్గమధ్యంలో ఏదిద , కమలహాసన్ లు ఆ పాటకు ట్యూన్‌ కట్టగా , కమలహాసన్ , పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్‌ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు.
వందరోజుల వేళ…స్వాతిముత్యం’ ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్‌ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్‌ షేర్‌ వసూలు చేసిన బ్లాక్‌ బస్టర్‌ కూడా ఇదే! ఈ చిత్ర శతదినోత్సవానికి అప్పటి సీఎం ఎన్టీఆర్‌, ప్రముఖ నటులు రాజ్‌కపూర్, మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు.


ఆస్కార్స్‌కు ఇండియన్‌ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్‌ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్‌ హాంక్స్‌ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్‌ లాంటి వాళ్ళు చెప్పారు.


లీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్‌ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది.
తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్‌ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

Related Posts