ఒకవైపు థియేటర్లు మరోవైపు ఓటీటీ.. ఈ వారం సినిమాల జాతర

వారం వారం కొత్త సినిమాలకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినీ ప్రియులకు.. ఈ వారం సినిమాల జాతర మామూలుగా లేదు. ఇటు థియేటర్లతో పాటు.. అటు ఓటీటీలలోనూ ఏకంగా 10 సినిమాల వరకూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి.

థియేటర్లలో సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో సందడి చేస్తోన్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. ముందుగా ‘యాత్ర 2‘ విడుదలైంది. థియేటర్లలో ప్రతీ శుక్రవారం సినిమాల విడుదలలు ఉంటాయి. అయితే.. గతంలో ‘యాత్ర 1‘ 2019, ఫిబ్రవరి 8న విడుదలవ్వడంతో.. అదే సెంటిమెంట్ తో ఈ గురువారం (ఫిబ్రవరి 8)న ‘యాత్ర 2‘ని రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ‘యాత్ర 2‘కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

ఈరోజు (ఫిబ్రవరి 9న) రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే.. రవితేజ ‘ఈగల్‘, రజనీకాంత్ ‘లాల్ సలామ్‘. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలవ్వాల్సినవే. అనివార్య కారణాలతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రాల ఫైనల్ రిపోర్ట్ మరికొద్ది గంటల్లో రానుంది.

ఈ వారం తమిళం నుంచి తెలుగులోకి అనువాదమవుతోన్న చిత్రాలలో ‘లాల్ సలామ్‘ తర్వాత మరొకటి ‘ట్రూ లవర్‘. ఈ చిత్రం రేపు (ఫిబ్రవరి 10)న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘జై భీమ్, గుడ్ నైట్‘ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మణికందన్ ఈ మూవీలో హీరో. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. ప్రేమికులరోజు వారం కావడంతో.. అది తమ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ట్రూ లవర్‘కి కలిసొస్తుందని భావిస్తోంది టీమ్.

ఓటీటీలో కొత్త చిత్రాలు
ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కూడా భారీగానే ఉంది. సంక్రాంతి బరిలో సందడి చేసిన మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ ‘గుంటూరు కారం‘ ఈరోజు (ఫిబ్రవరి 9) నుంచే నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ‘గుంటూరు కారం‘ టాక్ తో సంబంధం లేకుండా మహేష్ ఒన్ మ్యాన్ షో తో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఓటీటీలో ‘గుంటూరు కారం‘కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

తమిళనాట పొంగల్ రేసులో ఉన్న ‘కెప్టెన్ మిల్లర్, అయలాన్‘ సినిమాలు కూడా ఈరోజు (ఫిబ్రవరి 9) నుంచే డిజిటల్ దునియాలోకి వచ్చేశాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్‘ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటే.. శివకార్తికేయన్ ఏలియన్ యాక్షన్ ‘అయలాన్‘ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా.. కన్నడలో దర్శన్ నటించిన ‘కాటేరా‘ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. జీ5 వేదికగా ‘కాటేరా‘ స్ట్రీమింగ్ అవుతోంది.

Related Posts