ఈగల్‌ మూవీ రివ్యూ

రవితేజ ఈగల్ మొదలైనప్పటినుంచి చాలా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. రవితేజ కూడా ఇంటర్వ్యూలలో తన గెటప్‌ గురించి, ఔట్‌ పుట్‌ గురించి పుల్‌ శాటిస్ఫైడ్‌ అని చెప్పుకొచ్చారు. టీజర్‌ , ట్రైలర్‌లు ఇంటర్నేషనల్ రేంజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని తలపించాయి. విధ్వంసం సృష్టించే విస్ఫోటనం అంటూ ప్రచారం చేసారు. దాంతో ఈగల్‌ పై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి ఆ అంచనాలను ఈగల్‌ అందుకుందా లేదా.. ఈ రివ్యూలో చూద్దాం.

కథ : నళిని ( అనుపమా పరమేశ్వరన్‌) ఓ జర్నలిస్ట్‌. తాను చూసి తెలుసుకున్న ఓ కాటన్ క్లోత్ గురించి.. ఆ పత్తి పండే ప్రదేశం గురించి, ఇండియాలో కన్నా విదేశాల్లో ఆ చేనేత బట్టలకున్న డిమాండ్ గురించి న్యూస్ ఆర్టికల్ రాస్తుంది. చిన్న ఐటమ్‌గా ఫిల్లర్ బాక్స్‌లో పడిన ఆ న్యూస్‌ పిఎంఓ ఆఫీస్‌ నుంచి ఫోన్‌లు, రా ఏజెన్సీ నుంచి అధికారులు, సీఐడీ రంగంలోకి దిగి ఇంటరాగేషన్‌ చేసేంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ న్యూస్‌ ద్వారా ఇంత న్యూసెన్స్‌ క్రియేట్ చేసిందనే కారణంతో అనుపమను ఉద్యోగంలోనుంచి తీసేస్తారు. ఇంత సీన్‌ క్రియేట్ చేసింది పత్తి కాదని.. అది పండించి చేనేత నేసే ఓ వ్యక్తి గురించని తెలుసుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో ఉన్న సహదేవ్‌ వర్మ ( రవితేజ) ఆ వ్యక్తి అని తెలుసుకుంటుంది. అతని కోసం ఇండియన్‌ సీక్రెట్ ఏజెన్సీ ‘రా’ కూడా వెతికేంతగా ఏం చేసేవాడు.? మరోవైపు తీవ్రవాదులు, మావోయిస్టులు కూడా అతనిపై దాడి చేయడానికి వస్తారు. ఎందుకోసం వీళ్లంత సహదేవ్‌ను టార్గెట్ చేసారు.. ? అతని జీవితంలో రచన ( కావ్య థాపర్‌) ఎవరు ? ముప్పేట దాడిలో సహదేవ్‌ ఏమయ్యాడు.. అతను అనుకున్న లక్ష్యం ఏంటి ? ఆ లక్ష్యాన్ని సాధించాడా ? అనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ : ఓ మంచి సందేశం.. దానికి యాక్షన్ ఎలిమెంట్స్‌.. ఆ యాక్షన్‌ హాలీవుడ్‌ స్టైల్‌లో కొరియోగ్రఫీ చేసిన ప్రజెంటేషన్‌.. ఈ మధ్యలో క్యూట్‌ లవ్‌స్టోరీ.. ఇదంతా తెలుసుకోవడానికి ప్రయత్నించే ఓ జర్నలిస్ట్‌ ఇన్విస్టిగేషన్‌.. ఇదీ ఓవరాల్‌గా ఈగల్‌ సినిమా. నాలుగు కిలోమీటర్ల పైన ప్రయాణించే ఈగల్‌ భూమి మీదున్న రాబిట్‌ని స్పష్టంగా చూడగలదు.. ఇదే సూత్రం వర్తించేలా హీరో క్యారెక్టరైజేషన్‌ని డిజైన్‌ చేసాడు డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని. తనను ఎవరు ఫాలో అవుతున్నారు.. ఎందుకోసం వస్తున్నారు.. ఎవరు ఎటాక్ చేయబోతున్నారు.. అనేది హీరోకి ఇట్టే తెలిసిపోతుంది. తను సెట్‌ చేసుకున్న టెక్నికల్ సపోర్ట్ అలాంటిది. దీంతో అటు టెర్రిరిస్ట్‌లు ఇటు మావోయస్ట్‌లు.. మరోవైపు ఇంటిలిజెన్స్‌ అధికారులు, ఆర్మీ సోల్జర్స్‌ ఇలా ఎవరు వచ్చినా .. ఫామ్‌ హౌజ్‌ ముందు సహదేవ్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి చేసే ప్రయత్నం.. స్టేడియంలో ఫ్లడ్‌లైట్స్ వేసుకుని దాగుడుమూతలు ఆడుతున్న చందంగా మారుతుంది.
ఫస్టాఫ్ అంతా.. నళిని క్యారెక్టర్ ఈ సహదేవ్‌ ఎవరు ఇంతమందికి మోస్ట్ వాంటెడ్‌గా మారడానికి కారణం వెతికే క్రమంలో సహదేవ్‌ ఎంత పవర్‌ఫుల్లో తెలిపే ఎలివేషన్ సీన్స్‌, యాక్షన్‌ ఘట్టాలతో నిండిపోతుంది. సెకండాఫ్‌ నుంచి ఎందుకు సహదేవ్‌.. చేతులు మారుతున్న ఆయుధాలను దారిమళ్లించి తన ఫామ్‌హౌజ్‌ కు ఎందుకు మళ్లిస్తున్నాడు.. అసలు కాంట్రాక్టర్‌ కిల్లర్‌ కాస్తా చేనేత ఇండస్ట్రీ ఓనర్‌గా.. ఎందుకు మారాడు ? తన గోడౌన్‌లో దాచిన ఆయుధాలతో సహదేవ్ ఏం చేయబోతున్నాడనేది రివీల్ చేసే ప్రతీ సీన్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఆయుధం పట్టిన చేతికి కారణం కనిపిస్తేనే గురి కుదురుతుంది.. లాంటి డైలాగ్స్‌ చాలా బావున్నాయి.
కావ్యాథాపర్‌తో రవితేజ లవ్‌స్టోరీ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. కనిపించకుండా గన్‌ సౌండ్‌తోనే నడిచే ఆ లవ్‌ ఎపిసోడ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ లో కాస్త ల్యాగ్‌ అనిపించేలా సాగినా.. యాక్షన్ ఎపిసోడ్స్ ఆ లోపాన్ని కప్పిపుచ్చుతుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు సినిమా యాక్షన్‌ రైడ్‌లా ఉంటుంది. గన్‌ గోడౌన్‌లో రవితేజ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేయడంతో పాటు థ్రిల్‌ చేస్తాయి.

నటీనటులు : రవితేజ అనగానే యాక్షన్‌తో పాటు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. దానికి భిన్నంగా కంప్లీట్ సీరియెస్‌ మోడ్‌లో సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు యాక్షన్‌లో విజృంభించాడు. ఫైట్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపమే చూపించాడు. రవితేజకు సపోర్టింగ్‌లో రోల్‌ జై గా నవదీప్‌ చక్కగా నటించాడు. లండన్‌లో సహదేవ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ గురించి చెప్పే సీన్‌లో నవదీప్‌ మెచ్యూర్డ్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. జర్నలిస్ట్ నళినిగా అనుపమ జీవించేసింది. రా ఛీఫ్‌గా మధుబాల, రా ఏజెంట్‌ గా అవసరాల శ్రీనివాస్‌ పరిధిమేరకు నటించారు. ఈ మూవీ మొత్తంలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్ర పోషించింది అజయ్‌ఘోష్ పోషించిన ఎంఎల్‌ఏ పాత్రే. అతని అసిస్టెంట్‌గా శ్రీనివాసరెడ్డి కూడా ఆకట్టుకుంటాడు. కావ్యా థాపర్‌ ఉన్నది కాసేపే అయినా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే పాప చాలా క్యూట్‌ గా ఉంది.

టెక్నిషియన్స్ : కార్తీక్‌ఘట్టమనేని డైరెక్టర్‌ గా , విజువల్‌ పరంగా, డైలాగ్స్ పరంగా సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. ఎంచుకున్న కథలో చాలా డెప్త్ ఉంది. అధముల చేతికి ఆయుధం చిక్కకూడదనే పాయింట్‌.. ఎందుకు ఆ పాయింట్ తీసుకున్నాడని చెప్పే సీన్‌లో వచ్చే డైలాగ్స్ మనసును కదిలిస్తాయి. ఇక రవితేజ రూపంలో యాక్షన్‌ విధ్వంసాన్ని క్యాప్చర్‌ చేయడంలో కార్తీక్‌తో పాటు పనిచేసిన కరం చావ్లా , కామిల్ ప్లోకి అద్భుతంగా సక్సెస్‌ అయ్యారు. యాక్షన్‌ కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ప్రతీ సన్నివేశాన్ని బలంగా ఎలివేట్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన ప్రతీ రూపాయి.. స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంత రిచ్‌గా, అంతే క్వాలిటీగా సినిమాను నిర్మించారు టి.జి విశ్వప్రసాద్‌.

బోటమ్‌ లైన్‌ : ఈగల్‌ .. యాక్షన్‌ విస్ఫోటనం

Related Posts