జనగణమన లాంటి సినిమాను మనం ఎందుకు తీయాలి..?

జనగణమన.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తోన్న పేరు. ఇది కొత్తగా ఎందుకు వినిపిస్తోందీ అంటే.. ఈ టైటిల్ తో మళయాలంలో ఓ సినిమా వచ్చింది. అది అనేక సామాజిక సమస్యలను చర్చిస్తూ, వ్యవస్థపై సెటైర్ వేస్తూ.. అర్థవంతమైన తీర్పులు చెబుతూ.. పేదవారికో న్యాయం, పెద్దవారికో న్యాయం ఈ దేశంలో ఎలా కనిపిస్తుందీ అనేది కూలంకషంగా చర్చిస్తూ సాగిన సినిమా కావడమే. ఇది ఓ గొప్ప సినిమా అనేందుకు ఎటువంటి సందేహం లేదు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాటిక్ లిబర్టీస్ నూ తక్కువగా ఏం తీసుకోలేదు. అయినా ఇప్పటి వరకూ ఈ కోణంలో ఇన్ని సమస్యలను ఇంత ప్రతిభావంతంగా మరెవరూ వెండితెరపై చెప్పలేదు కాబట్టి.. దర్శకుడు డిజో జోష్ ఆంటోనీ, నిర్మాత హీరో అయిన పృథ్వీరాజ్ ను మెచ్చుకుని తీరాల్సిందే. ఇంకా చెబితే ఈ తరహాలో బలమైన సోషల్ ఇష్యూస్ ను టచ్ చేస్తూ ఇప్పటి వరకూ బెంగాలీ తర్వాత మళయాలంలోనే అన్ని సినిమాలు వచ్చాయి. మళయాలంలో 70 -80 కాలంలో వచ్చిన మూవీస్ ను చూస్తే ఇంక మనవాళ్లు ఏమైపోతారో కానీ.. ఇప్పుడు ఓటిటిల పుణ్యమా అని మాలీవుడ్ దమ్మేంటో ప్రపంచానికి తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. నిస్సందేహంగా జనగణమన గొప్ప సినిమానే.. కానీ ఆ సినిమాను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమాను చిన్న బుచ్చడం.. యస్.. ఈ మధ్య కొందరు ఇదే పనిగా తెలుగు సినిమాపై బురద జల్లడం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కాస్త ఆక్షేపణ కనిపిస్తుంది.
తెలుగు సినిమాలోనూ అనేక గొప్ప సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. గతంలో ఆ సినిమాలు ఎక్కువ ఆదరణకు నోచుకున్నాయి. మరి ఇప్పుడు వస్తోన్న సినిమాలన ఎవరు పట్టించుకుంటున్నారు. నిజంగా ఈ స్థాయిలో చూస్తున్నారా..? విమర్శకుల ప్రశంసలు తప్ప ప్రజల నుంచి రెస్పాన్స్ ఉందా ..? లేదు కదా.. ఇంకా చెబితే ఇప్పుడు జనగణమనను అడ్డు పెట్టుకుని తెలుగు సినిమాను విమర్శిస్తోన్న సోకాల్డ్ మేధాలు కూడా తెలుగులో వచ్చిన ఇలాంటి సినిమాల గురించి ఒక్క ముక్క రాయలేదు.. రాయరు కూడా. కానీ తెలుగు సినిమా అంటే వారికి ఎందుకో చాలా కోపం.
నిజమే.. తెలుగు వాళ్లు అలాంటి సినిమాలు తీయలేరు అనుకుందాం.. మరి మళయాలం వాల్లను ఓ మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి జనరంజకమైన(కథాబలం ఉన్నవి అని చెప్పడం లేదు.. జనరంజకం మాత్రమే) సినిమాలు తీయమనండి. ఖచ్చితంగా చెబితే ఈ రెండు పరిశ్రమల మధ్య మేధో పరమైనది మాత్రమే కాక సాంస్కృతిక, ఆర్థికపరమైన, అక్షరాస్యతకు సంబంధించిన అంతరాలున్నాయి. అవి ఇప్పుడప్పుడే తొలిగిపోవు. కానీ ఈ దేశంలో కేరళ రాష్ట్రం ముందు నుంచీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రోగ్రెసివ్ గానే ఉంది. ప్రోగ్రెసివ్ థింకింగ్ తోనే ఆ రాష్ట్రం చాలా యేళ్ల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. అందుకే వాళ్లకు నిజాలు, అబద్ధాల మధ్య గీతలు తెలుసు.. మనుషుల మధ్య అంతరాలను తొలగించునేందుకు కాస్తైనా ముందుకు రావడం తెలుసు. మరి మన దగ్గర.. ముందు నుంచీ పరిశ్రమ ఒకటీ రెండు వర్గాల చేతుల్లోనే ఉంది. దీంతో ఆ వర్గం భావజాలం లేదా.. ఆ వర్గం ఆశించిన సినిమాలే ఎక్కువగా వచ్చాయి. అయినా అప్పుడప్పుడూ.. చాలా చాలా గొప్ప సినిమాలు మన దగ్గరా వచ్చాయి. కాలమాన, భావజాల పరిస్థితులను బట్టే ఆయా పరిశ్రమల్లో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. ఈ విషయంలో కేరళ ఎప్పుడూ ముందే ఉంది. కానీ ఇప్పుడు మాత్రమే ముందు ఉంద అనే భ్రమలో కొందరు.. మనం కూడా అలాగే ఉండాలనుకోవడం అంత గొప్ప తర్కం అనిపించుకోదు.
ఇక సినిమా ఆరంభంలో ఇలాంటి అనేక సామాజిక సమస్యలను అద్భుతంగా సృజించి, సృష్టించిన బెంగాలీ పరిశ్రమ ఇప్పుడు ఏ పరిస్థితులో అందరికీ తెలుసు. అలాగే ఆర్టిస్టిక్ మూవీస్ తో అద్భుతాలు చేసిన మరాఠీ వాళ్లు ఇప్పుడు మాకూ కొన్ని థియేటర్స్ కావాలని బాలీవుడ్ ను దేబిరిస్తున్నారు. ఇక కన్నడ పరిశ్రమలోనూ 70-80ల కాలంలో కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ కన్నడలో కేరళ లాగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న సినిమాలు కాస్త తక్కువే. కేవలం సంప్రదాయాలను బద్ధలు కొట్టొద్దు అని శాసించిన సినిమాలే కన్నడలో ఎక్కువగా వచ్చాయి. తమిళ్ లో ఈ రెండూ మిక్స్ అవడంతో పాటు కంప్లీట్ కమర్షియల్ సినిమా ఎదిగింది. ఇప్పుడు అదే పరిశ్రమను శాశిస్తోంది. అయినా తమిళ్ లో గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు వాళ్లు ఆదరిస్తారు. మరి మనం.. ?
ముందే చెప్పినట్టు.. తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని వర్గాల చేతుల్లో ఉంది. ఆ వర్గం తమకు నష్టం రాని సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చుకుంటుంది. అందుకే అసురణ్ ను నారప్పగా తెలుగులో రీమేక్ చేసినప్పుడు దాని ఆత్మను చంపేస్తారు. జై భీమ్ తెలుగులో వస్తే.. టైటిల్ ను బట్టే కులాన్ని ఆపాదించిన కురుచ బుద్ధులు మన దగ్గర మేధస్సులుగా వెలుగుతున్నాయి. ఈవెన్ జనగణమన టైటిల్ ను కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వాడలేకపోయారు. సో.. ఇక్కడ అలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు అని అదే పనిగా విమర్శలు చేయడం కంటే ఆ తరహా భావజాలం ఉన్నవాళ్లు ముందుకు రావాలి. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఆ రావడం పెరగాలి. అప్పటి వరకూ అవతలి భాషవాళ్లు ఇలాంటి సినిమాలు చేస్తే ఆనందంగా చూడాలి.. ఆదరించాలి. అంతే. అలాగే.. ఆ తరహా ప్రోగ్రెసివ్ మూవీస్ మన దగ్గరా రావాలి అని ఆశించడంలో తప్పులేదు.. అంతే కానీ రావాల్సిందే అని శాశించలేం కదా.. ఏదేమైనా జనగణమన లాంటి సినిమాను ఆదరించడం ఓ కొత్త మార్పుకు నాందిగా మారతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.

– యశ్వంత్..

Related Posts