Advertisement
అంటే సుందరానికి రివ్యూ 3/5
Latest Movies Reviews Tollywood

అంటే సుందరానికి రివ్యూ 3/5

Advertisement
రివ్యూ : అంటే సుందరానికి
తారాగణం : నాని, నజ్రియా, నరేష్, నదియా, రోహిణి, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్
రచన, దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
రిలీజ్ డేట్ : 10.06.2022

రెండు కులాల మధ్య సమస్యల వల్ల కలిగే రక్తపాతం, హాస్యం నేపథ్యంలో అనేక ప్రేమకథలు వచ్చాయి. అయితే మతాల మధ్య అంతరాలు అనగానే ఎక్కువగా హిందూ ముస్లీమ్ ల మధ్య కనిపించాయి. అప్పుడెప్పుడో 80ల్లో భారతీరాజా తీసిన క్లాసిక్ మూవీ సీతాకోక చిలుక తర్వాత మళ్లీ హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి అనే నేపథ్యంలో సినిమాగా అంటే సుందరానికి వచ్చింది. మధ్యలో కొన్ని వచ్చినా.. ఇంత ఇంపాక్ట్ వేసినవి లేవు అనే చెప్పాలి. మరి ఆ క్లాసిక్ ను గుర్తుకు తెచ్చిన ఈ మూవీ ముందు నుంచీ ఆడియన్స్ లో మంచి అంచనాలు పెంచింది. మరి వాటిని అందుకుందా లేదా అనేది చూద్దాం..

కథ :
విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలియకుండా తెలుగు భాష పూర్తి కాదు. ఆయన ఫ్యామిలీకి చెందిన కుర్రాడు సుందర్ ప్రసాద్(నాని). సంప్రదాయాలను పాటించడంలో వీరికి వీరే సాటి. ఎంత అంటే ఇంకా విశ్వనాథవారి కాలంలోనే ఉంటారు. అందుకు సుందర్ కాస్త మినహాయింపు అయినా.. ఇతని తండ్రి(నరేష్) వంశ గౌరవం అంటూ సుందర్ కు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తుంటాడు. ఇంత సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సుందర్ తనకు చిన్నప్పటి తెలిసిన లీలా(నజ్రియా)ను ప్రేమిస్తాడు. లీల ఫ్యామిలీ మోడ్రన్ గా ఉన్నా.. తమ మతానికే అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులుగా కనిపిస్తారు. సుందర్ తన ప్రేమను గెలుచుకునేందుకు అమెరికా వెళ్లాలనుకుంటాడు సుందర్. కానీ అమెరికా వ్యవహారం అతని చిన్నతనంలోనే బెడిసి కొట్టి ఉండటంతో తండ్రి అడ్డు చెబుతాడు. దీంతో ఇద్దరూ కలిసి ‘‘వెయ్యి అబద్ధాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయాలి’’ అనే పెద్దలు చెప్పిన మాటను ఫాలో అవుతారు. దాని వల్ల వచ్చిన సమస్యలేంటీ.. ? వీరి పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయా లేదా.. చివరికి ఏమైంది అనేది మిగతా కథ..

విశ్లేషణ :
తను ఏం చెప్పబోతున్నాడో ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేయడం తెలివైన దర్శకుడు చేసే పని. అది టైటిల్స్ నుంచీ చెప్పొచ్చు.. హీరో హీరోయిన్ల ఎంట్రీకి ముందే చెప్పొచ్చు.. వివేక్ ఆత్రేయ తెలివైన దర్శకుడే. అందుకే అతను హీరో హీరోయిన్లు చిన్నతనంలో వేసిన ఓ నాటకాన్నే తను కథగా చెప్పబోతున్నాడనే అర్థం వచ్చేలా ఆ స్టేజ్ ప్లే ను సెట్ చేసుకున్నాడు. అంటే నీతులు చెబితే వినడానికి బావుంటాయి తప్ప పాటించడానికి కాదు.. అలాగే మనవరకూ వస్తే మాత్రం అసలవి నీతులే కాదు అనే సమాజపు పోకడకు అద్దం పట్టేలా తను సినిమా తీశాననేందుకే స్కూల్ లో చిల్డ్రన్ స్టేజ్ ప్లేతో కథ మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే కథనం కనిపిస్తుంది. అన్ని మతాల సారం ఒక్కటే.. మనుషులంతా ఒక్కటే అని చిన్నప్పుడు నాటికలో చెబితే చప్పట్లు కొట్టిన పెద్దలు.. అవి తమ ఇళ్ల వరకూ వస్తే కాదంటారు. ఈ పాయింట్ నే తనదైన శైలిలో సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ.. ఎక్కడా గందరగోళం లేకుండా కథనం నడిపించాడు దర్శకుడు వివేక్.
వివేక్ సినిమాల్లో పెద్ద కథ కనిపించదు. కానీ స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ ను ఎమోషన్ ను ఎక్కడ ఎంత వరకూ వాడాలో తెలిసినవాడు. అందుకే మెంటల్ మదిలో లాంటి క్లిష్టమైన కథను కూడా ఇష్టంగా చూసేలా చేశాడు. ఓ చిన్న కిడ్నాప్ డ్రామాను గొప్ప స్క్రీన్ ప్లే టెక్నిక్ తో బ్రోచెవారెవరురా చిత్రంతో మెప్పించాడు. అంటే సుందరానికి కూడా అంతే. రెండు మతాలకు చెందిన వారు ప్రేమించుకుంటే వారి ఇళ్లల్లో ఎలా రియాక్ట్ అవుతారు అనే పాయింట్ కు తనదైన హ్యూమర్ యాడ్ చేశాడు. సీరియస్ గా అనిపించే సీన్స్ ను కూడా హిలేరియస్ గా రాసుకున్నాడు. దీంతో ఫస్ట్ హాఫ్ లో కొన్ని మైనస్ లు ఉన్నా.. పాసైపోయాడు. ఇక సెకండ్ హాఫ్ ఈ సినిమాకు మెయిన్ స్ట్రెంత్. అయితే ఆ స్ట్రెంత్ ను కొన్నిసార్లు వదిలేశాడు. తను రాసుకున్నదంతా చూపించాలనే తాపత్రయంలో కొన్నిసార్లు ప్రేక్షకులను ఇబ్బందుల్లోకి ‘ల్యాగాడు’. దీంతో ఈ సినిమా ఏ సెంటర్స్ మూవీలా అనిపిస్తుంది తప్ప.. బిసి సెంటర్స్ లో ఇదే స్థాయిలో ఆకట్టుకుంటుందా అనే డౌట్ తో ముగుస్తుంది..

సుందరం పాత్రలో నాని జస్ట్ బిహేవ్ చేశాడంతే. ఆ పాత్రలోకి వెళ్లిపోయాడు. ఏ ఆర్టిస్ట్ అయినా తన పాత్రను ప్రేమిస్తే ఇలాగే చేస్తాడు. నజ్రియా బాగా చేసింది. ఇతర పాత్రల్లో నరేష్ నటన మరోసారి ఆకట్టుకుంటుంది. అటు లీలా పేరెంట్స్ తో పాటు రోహిణి, నదియా తమకు అలవాటైన పాత్రలే అయినా వారి ఇంపాక్ట్ ను చూపించగలిగారు. హర్షవర్ధన్, రాహుల్ రోల్స్ నవ్వించేస్తాయి.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. గతంలో తన పాటలతో సినిమాలను నిలబెట్టిన వివేక్ ఆత్రేయ ఈ సారి ఆ పని చేయలేకపోయాడు. నేపథ్య సంగీతం బావున్నా.. పాటల్లో ఇంపాక్ట్ కనిపించదు. ఇలాంటి కథలకు మంచి పాటలు తోడైతే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఓల్డ్ మూవీ సీతాకోక చిలుక ఓ గొప్ప ఉదాహరణ. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. దర్శకుడుగా వివేక్ ఆత్రేయ హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పొచ్చు. కానీ కొన్ని వీక్ పాయింట్స్ ను వదిలించుకోవాల్సిందే. అప్పుడే నెక్ట్స్ లీగ్ లోకి ఎంటర్ అవుతాడు. అతని కలం బలం కూడా చాలా బాగా పనిచేసిందీ చిత్రానికి. కొన్ని మాటలు వెంటాడేలా ఉన్నాయి. మొత్తంగా కొన్ని ల్యాగులు వదిలేసుకుని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే సుందరం మరింత నచ్చి ఉండేవాడు..

ఫైనల్ గా : అంటే సుందరాన్ని చూసేయొచ్చు..

రేటింగ్ : 3/5
యశ్వంత్
Advertisement