Advertisement
రివ్యూ : ఆర్ఆర్ఆర్
Bollywood Latest Movies Tollywood

రివ్యూ : ఆర్ఆర్ఆర్

Advertisement

తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవ్ గణ్, ఒలీవియా మోరిస్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్

సంగీతం : కీరవాణి

నిర్మాత : డివివి దానయ్య

దర్శకత్వం : రాజమౌళి

జానర్ : హిస్టారికల్ ఫిక్షన్

తెలిసిన కథలను తెలియనట్టుగా చెప్పడం.. జరిగిన కథలను.. ఇలా కాకుండా అలా జరిగి ఉంటే అనే ఊహను జోడించి మరో కొత్త కథగా మలచుకోవడం అనుకున్నంత సులువు కాదు. అలాగని అంత కష్టమూ కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఊహ నుంచి పుట్టింది అంటూ రాజమౌళి అనౌన్స్ చేసినప్పుడు ఆ ఊహ అందరికీ నచ్చింది. కానీ ఆ థాట్ ను కథగా ఎలా మలిచారు అనే ప్రశ్న కూడా చాలామందిలో ఉంది. మొత్తంగా అనే నెలల పాటు చిత్రీకరణ జరుపుకుని ఐదారుసార్లు విడుదల వాయిదా వేసుకున్న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఇన్ని రోజులుగా ప్రమోషన్స్ పేరుతో పెంచిన అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా అనేది చూద్దాం..

కథ : 1920ల కాలంలో సాగే ఈ కథలో.. అక్తర్(ఎన్టీఆర్)ఢిల్లీలో మెకానిక్ గా పనిచేస్తుంటాడు. అదే నగరంలో బ్రిటీష్ వారి కింద పోలీస్ అధికారిగా ఉంటాడు రాజు( రామ్ చరణ్). రాజు బ్రిటీష్ వారికి నమ్మిన బంటు. అక్తర్.. ఓ పని కోసం భీమ్ అనే తన పేరును మార్చుకుని బ్రిటీష్ కోటలోకి వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అక్కడ భీమ్ తెగకు చెందిన అమ్మాయిని బ్రిటీష్ వారు కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ పాపను తల్లి దగ్గర చేర్చాలనే ఆరాటంలో ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంటాడు. అతనెవరో తెలియకపోయినా.. బ్రిటీష్ గవర్నర్(పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి)ను చంపేందుకు ఒక గిరిజన నాయకుడు వచ్చాడని తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడానికి సరైన ఆఫీసర్ కోసం చూస్తోంటే.. నేను పట్టుకుంటానని ముందుకు వస్తాడు రాజు. కానీ అంతకు ముందే ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరి నిజ స్వరూపం మరొకరికి తెలియదు. మరి రాజు .. భీమ్ ను పట్టుకుని బ్రిటీష్ వారికి అప్పగించాడా..? అసలు రాజు బ్రిటీష్ వారి కొంద ఎందుకు పనిచేస్తున్నాడు..? వీరి స్నేహం వైరంగా ఎలా మారింది అనేది మిగతా కథ. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు.. ఈ ఇద్దరూ చారిత్రకంగా అందరికీ తెలుసు. ఇద్దరివీ వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు కాలాలకు చెందిన వారు. అలాంటి ఇద్దరినీ ఒకే వేదికపై తెచ్చేందుకు రాసుకున్న ఈ కథ..

ఆ చారిత్రక వ్యక్తుల గొప్పదనాన్ని విస్మరించింది. ఎంత ఫిక్షన్ అనుకున్నా.. అనౌన్స్ అయినప్పుడు చెప్పింది ఇదే కదా.. కానీ ఆ విషయంలో వారి వ్యక్తిత్వాలను కూడా తగ్గించేలా చిత్రీకరణ జరిగింది. నైజాం సర్కార్ ను గడగడలాడించిన భీమ్.. ఓ చిన్న పాప కోసం ఢిల్లీ వరకూ వెళ్లడం బానే ఉన్నా.. అక్కడ పడ్డ కుస్తీలన్నీ ఆ వ్యక్తి క్యారెక్టర్ ను తక్కువ చేసేవే. స్వాంతంత్ర్యం కోసం కుటుంబాన్ని, ప్రేమను త్యాగం చేసి గిరిజనులను అండగా నిలిచి అసులు బాసిన అల్లూరి లాంటి యోధుడిని పోలిన వ్యక్తి కథను బ్రిటీష్ వారి తొత్తుగా చూపించడం.. పైగా వారి కోసం ఎంతటి కర్కశత్వానికైనా ఒడిగట్టడం అనేది కూడా వ్యక్తిత్వాన్ని చంపేదే. అయితే రాజు పాత్ర బ్రిటీష్ వారికి తొత్తుగా పనిచేయడానికి ఓ కారణం ఉందని చెప్పారు. దానికి ఓ బలమైన కథ కూడా ఉంది. కానీ కథనంగా రాజు క్యారెక్టర్ ఆ దిశగా ఎక్కువగా పోరాటం చేయలేదు. కేవలం ప్రమోషన్ వస్తే తను అనుకున్నది సాధించవచ్చు అనే ధోరణిలో తను ఎవరి కోసం పోరాడాలనుకుంటున్నాడో.. వారినే విచక్షణారహితంగా కొట్టడం.. పాత్ర ఔచిత్యాన్ని పూర్తిగా దిగజార్చింది. ఇటు చదువు రాని భీమ్ .. బ్రిటీష్ అమ్మాయితో స్నేహం చేయడం.. ఆమె అతన్ని ప్రేమించడం.. వంటి వన్నీ కృతకంగానే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ మరీ దారుణంగా కనిపిస్తుంది. ఏ మాత్రం ఆసక్తి లేని కథనంతో విసిగిస్తుంది. ఈ పాత్రలతో ప్రేమలో పడాల్సిన ప్రేక్షకులు.. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి బోర్ ఫీలవుతారంటే అర్థం చేసుకోవచ్చు.

విశేషం ఏంటంటే ఇన్ని మైనస్ లు ఉన్నా.. ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కారణం.. హీరోల ఎలివేషన్ సీన్స్.. యాక్షన్ ఎపిసోడ్స్.. ఈ రెండు అంశాల్లో పెట్టిన శ్రద్ధ.. కథ, కథనాలపై పెట్టలేదు రాజమౌళి. పైగా అతని సినిమాల్లో ఎప్పుడూ బలమైన కథలు లేవు. కానీ ఏదో ఒక ఎమోషన్ కథనాన్ని డ్రైవ్ చేస్తూ.. ప్రేక్షకులు కథను పట్టించుకోకుండా చేస్తాయి. ఈ సారి ఆ ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది. అందుకే ఆర్ఆర్ఆర్ మిస్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే అర్థగంట ఎపిసోడ్ సినిమాకే హైలెట్. అక్కడ ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఇద్దరు మాస్ హీరోల మధ్య ఫైట్ అనేది అరిగిపోయిన ఫార్ములా. అయినా అద్భుతంగా ఈ ఫైట్ ను కంపోజ్ చేశారు. భీమ్ ను తమ్ముడులా భావించిన రాజు.. అందరి ముందు అతన్ని చితకబాదడం కృతకంగా అనిపించినా.. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ నటన, పాట హృదయాలను బరువెక్కేలా చేస్తుంది. ఆపై తప్పు తెలుసుకున్న రాజు.. భీమ్ తో పాటు మల్లినీ కాపాడి తను బ్రిటీష్ ప్రభుత్వానికి దొరికిపోతాడు. ఆ తర్వాత అంతా ఊహించేట్టుగానే.. భీమ్ వెళ్లి రాజును కాపాడటం.. తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటీష్ అధికారులను మట్టుపెట్టడం.. ఈ ప్రహసనం అంతా 80, 90ల నాటి సినిమాలను తలపించడం జరిగిపోతూ ఉంటుంది. రాజు ఎమోషన్ అంతా తండ్రి ఆశయంకోసం. కానీ ఆయుధాలు సాధించాలన్న అతని ఆశయాన్ని భీమ్ పాత్ర నెరవేర్చడంతో ఇతని ఎమోషన్ కు అర్థం లేకుండా పోయింది. ఎలా చూసినా చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ కే కాస్త ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్టుగా ఎవరికైనా అర్థం అవుతుంది. నటన పరంగా ఇద్దరూ కెరీర్ బెస్ట్ అనేలా ఇచ్చారు. ఇద్దరి నటనా సమానంగా ఉన్నా.. ఎన్టీఆర్ నటన కాస్త ఎక్కువ సమానం అన్నట్టుగా ఉంటుంది. అలియాభట్ పాత్ర కరివేపాకులా మారింది. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా తక్కువ స్థాయి పాత్ర అది. అజయ్ దేవ్ గణ్ సైతం ఏమంత ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. సముద్రఖని సైతం జూనియర్ ఆర్టిస్ట్ లా కనిపిస్తాడు. మిగతా పాత్రల్లో బ్రిటీష్ గవర్నర్ గా నటించిన అతను బాగా చేశాడు. ఎన్టీఆర్ జోడీ ఒలీవియా కూడా బాగా నటించింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటే.. కీరవాణి సంగీతం ఈ సారి మైనస్ గా మారింది. పాటలు అస్సలు బాలేదు అనుకుంటే నేపథ్య సంగీతం నీరసంగానూ.. ఇప్పటికే అనేక సార్లు విన్నట్టుగా అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నా.. చాలా వరకూ అన్నీ సి.జి షాట్స్ అన్న విషయం అర్థమవుతుంది. ఇది రాజమౌళి లోపంగానే చెప్పాలి. ఓవరాల్ గా 3గంటల 5 నిమిషాల సినిమాలో సులువుగా 10నిమిషాలకు పైనే లేపేయొచ్చు. అలా చేయకపోవడంతో లాగ్ అయిన భావన వచ్చింది. మొత్తంగా బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది పక్కన బెడితే కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకు ప్రధాన కారణం హీరోల ఇమేజ్, సినిమాలో వారి ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లే. ఏదేమైనా ఏమాత్రం లాజిక్ లేని.. చారిత్రక వక్రీకరణ(ఫిక్షన్ అయినా ఇమేజ్ గా ఉన్నది వాళ్లే కదా)లు, సిల్లీ నెరేషన్.. అనేక లాజిక్ లెస్ సీన్స్ తో మొదటిసారిగా రాజమౌళి భారీ బడ్జెట్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి.

 రివ్యూ By – యశ్వంత్ బాబు.

రేటింగ్ 3/5

Advertisement