త్రివిక్రమ్ వల్ల మహేష్ కు వచ్చే కొత్త ఉపయోగం ఏం లేదు..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తిరుగులేని క్రేజ్ ఉంది. అదే రేంజ్ లో ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పటి టాప్ హీరోలెవరికీ లేని విధంగా లేడీస్ లోనూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందీ రాజకుమారుడికి. అయితే మాస్ హీరోగా అప్పుడప్పుడూ మాత్రమే బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. మిగతావన్నీ క్లాస్ హిట్సే అవుతున్నాయనే అసంతృప్తి అభిమానుల్లో కూడా ఉంది. ఈ కారణంగానే మహేష్ బాబు ఇతర హీరోల్లా తెలుగు భాషను దాటి పెద్దగా మార్కెట్ పెంచుకోలేకపోయాడు అనేది నిజం. ఈ విషయంలో అభిమానులకు కోపం రావొచ్చుగాక.. కానీ కాస్త కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. పైగా ఈ మధ్య నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా ప్యాన్ ఇండియన్ మార్కెట్ అంటూ గెంతులు వేస్తున్నారు. మహేష్ బాబు రెమ్యూనరేషన్ అంత మార్కెట్ కూడా లేని నాని కూడా ప్యాన్ ఇండియన్ సినిమా అంటూ శ్యామ్ సింగరాయ్ ని ప్రమోట్ చేశాడు. అలాగని ప్యాన్ ఇండియన్ రేంజ్ లో మహేష్ బాబుకు పాపులారిటీ లేదా అంటే ఉంది. కాకపోతే అది కేవలం ఎండార్స్ మెంట్స్ కే పరమితం. సినిమాలకు, మార్కెటింగ్ మెళకువలకు కాదు.
ఎంత కాదనుకున్నా.. అన్ని భాషల్లోని టాప్ స్టార్స్ అంతా ఇప్పుడు తమ మార్కెట్ ను సొంత భాషను దాటి విస్తరించుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఇందుకోసం రాజమౌళి కరెక్ట్ అని అందరికీ తెలుసు. కాస్త ఆలస్యం అయినా అతనితో సినిమా చేస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ఏం ఖర్మ.. వాల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ కూడా వస్తుంది. కానీ ఈ సూపర్ స్టార్ ఏం చేస్తున్నాడు. మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా అంటున్నాడు. త్రివిక్రమ్ కు ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేంత రేంజ్ లేదు అనేది వాస్తవం. రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో కేవలం ఆల్బమ్ హిట్ అవడం వల్లే కాస్త ఎక్కువమందికి తెలిసింది. పైగా బన్నీ ఉన్నాడు కదా..? బట్ ఆ కథలో అంత రేంజ్ లేదు అని అందరికీ తెలుసు. మరి అలాంటి త్రివిక్రమ్ తో మళ్లీ సినిమా అంటే మహేష్ కు మహా అయితే తెలుగులో మరో బ్లాక్ బస్టర్ పడుతుంది. అదీ అన్నీ కలిసొస్తే.
ఇక ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలేమీ బాక్సాఫీస్ హిట్స్ కూడా కాదు. కాకపోతే అప్పుడు త్రివిక్రమ్ రేంజ్ చిన్నది. ఇప్పుడు పెరిగింది. ఆ పెరగడం టాలీవుడ్ వరకే ఆగడం వల్ల.. ఈ కాంబోలో వచ్చే సినిమా మరో తెలుగు సూపర్ హిట్ మూవీ అవుతుంది తప్ప.. మహేష్ బాబుకు కొత్తగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో వచ్చే ఉపయోగం ఏం ఉండదు అనుకోవచ్చు.

Related Posts