‘వ్యూహం‘ రిలీజ్ డేట్ ప్రకటించిన వర్మ

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన ‘వ్యూహం‘ సినిమా రిలీజ్ ను కూడా ఎవరూ అడ్డుకోలేరని అప్పట్లో మీడియా ముందుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత ‘వ్యూహం‘ సినిమా సెన్సార్ చిక్కులను ఎదుర్కోవడం.. విడుదల ఆగిపోవడం జరిగింది. లేటెస్ట్ గా తన ‘వ్యూహం‘కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని.. ఫిబ్రవరి 23న విడుదలకు ముస్తాబవుతుందంటూ ‘ఎక్స్‘ వేదికగా ప్రకటించాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

అంతే కాదు.. ‘వ్యూహం‘ రిలీజ్ ను సెలెబ్రేట్ చేసుకుంటున్నామని ఓ అమ్మాయితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక.. తన ట్వీట్స్ లో ‘వ్యూహం‘ రిలీజ్ గురించి ప్రస్తావిస్తూనే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను కూడా ట్యాగ్ చేసి.. డ్రింక్ టి.డి.పి, ఈట్ జనసేన పార్టీ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలతో ‘వ్యూహం‘ చిత్రాన్ని తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. అయితే.. ఈ సినిమాలో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడాలి.. ఈసారైనా ‘వ్యూహం‘ విడుదల విషయంలో వర్మ సఫలీకృతుడవుతాడేమో.

Related Posts