జ‌గ‌న్ తో మీటింగ్ కి నాగార్జున, ఎన్టీఆర్ వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.

ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ ప్ర‌ముఖులు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. మీటింగ్ అనంత‌రం మ‌హేశ్ బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. మొద‌ట‌గా చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని అన్నారు.

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటారు. వారం/ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంది. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ గార్కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అని మ‌హేష్ బాబు అన్నారు. ఇక టికెట్ ధ‌రల వివాధానికి శుభంకార్డు ప‌డింద‌ని భావిస్తున్నామ‌ని చిరంజీవి చెప్పారు. ఏపీ సీఎం నిర్ణ‌యం అంద‌రినీ సంతోష‌ప‌ర్చింద‌ని చెప్పారు. అలాగే చిన్న సినిమాల‌కు ఐదో షోకు అనుమ‌తించ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని… చిన్న సినిమాల నిర్మాత‌ల‌కు మంచి వెసులుబాటు ఇచ్చార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జ‌రుగుతోంద‌ని చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాజ‌మౌళి, కొర‌టాల‌, ఆర్.నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్, పేర్ని, నానిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేశారు.

అయితే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ కీల‌క‌మైన ఈ మీటింగ్ కి హాజ‌రు కాక‌పోవ‌డం ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ నాగార్జున ఈ మీటింగ్ కి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటంటే.. నాగార్జున స‌తీమ‌ణి అమ‌లకు కోవిడ్ అని.. దీంతో నాగార్జున ఐసోలేష‌న్లో ఉన్నార‌ని.. అందుక‌నే ఈ మీటింగ్ కి వెళ్ల‌లేద‌ని స‌మాచారం. ఇక ఎన్టీఆర్ ఎందుకు వెళ్ల‌లేదంటే.. జ‌గ‌న్ తో మీటింగ్ కి వెళ్లొద్ద‌ని అభిమానుల నుంచి.. పార్టీ వ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని అందుక‌నే ఎన్టీఆర్ వెళ్ల‌లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. పర్స‌న‌ల్ వ‌ర్క్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌నే ఎన్టీఆర్ ఈ మీటింగ్ కి వెళ్ల‌లేద‌ని తెలిసింది.

Related Posts