థాంక్యూ మూవీ రివ్యూ..

రివ్యూ :- థ్యాంక్యూ
తారాగణం :- నాగ చైతన్య, రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్‌ రాజ్, సాయి సుశాంత్ రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు
సినిమాటోగ్రఫీ :- పిసి శ్రీరామ్
సంగతం :- తమన్
ఎడిటింగ్ :- నవీన్ నూలి
నిర్మాత :- దిల్ రాజు
దర్శకత్వం :- విక్రమ్ కుమార్

కొన్ని సినిమాలపై అంచనాలు సులువుగా పెరుగుతాయి. కొన్నిసార్లు అంతకు ముందు ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అందుకు కారణం. మరికొన్నిసార్లు వీళ్ల ప్రమోషనల్ స్ట్రాటజీ. ఈ రెండు అంశాలూ కలిసి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేసిన సినిమా థ్యాంక్యూ. నాగచైతన్య హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ముందు నుంచీ పాజిటివ్ వైబ్స్ తోనే కనిపించిన థ్యాంక్యూ ఆ ఫ్రైడే రిలీజ్ అయింది. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్, ప్రకాష్‌ రాజ్, సాయి సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..
స్పాట్ :-
వాయిస్ :-
అభిరామ్(నాగచైతన్య..) అమెరికాలో అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. ఒక ఉద్యోగం కోసమని అమెరికా వెళ్లిన అతను తన కన్సల్టెంట్, తన మేలు కోరే రావు(ప్రకాష్‌ రాజ్) మాట కాదని సొంతంగా ఓ వెబ్ యాప్ డెవలప్ చేస్తాడు. ఇందుకోసం అప్పటికే అతన్ని ప్రేమించిన ప్రియ(రాశిఖన్నా) సాయం చేస్తుంది. అనూహ్యంగా అది ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో అతి తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించి అక్కడే రిచ్ గా సెటిల్ అవుతాడు. డబ్బు వచ్చాక అభి ప్రవర్తనలో మార్పు మొదలవుతుంది. ఇదంతా తన వల్లే అనే అహం పెరుగుతుంది. దీంతో ఎవరి ద్వారా తను ఎదిగాడో వారందరినీ వెళ్లగొడతాడు. తీవ్రమైన కష్టాల్లో ఉండి సాయం కోసం వచ్చిన రావును కూడా అవమానిస్తాడు. ఆ తర్వాత రావు చనిపోతాడు. దీనికి తనే కారణమా అనే గిల్టీ నెస్ నుంచి అభి లైఫ్‌ కొత్త మలుపులు తిరుగుతుంది. అవేంటీ..? అసలు అభి నేపథ్యం ఏంటీ..? ఎందుకు అలా మారాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :-
కొన్ని కథలు వింటున్నప్పుడో లేక చూస్తున్నప్పుడో ఆల్రెడీ చూసిన మరికొన్ని కథలు గుర్తుకు రావొచ్చు. కానీ కథనం కొత్తగా ఉంటే పాత కథైనా కొత్తగానే మెప్పిస్తుంది. థ్యాంక్యూ సినిమా విషయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ చేసిన ప్రయత్నం ఇలాంటిదే. టీనేజ్, యంగ్ ఏజ్ ఆ తర్వాత 35యేళ్ల వయసుల్లో ఒక వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
ఒక ఎమోషన్ ను బలంగా చెప్పాలనుకోవడం అన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది. ఆ ఎమోషన్ లోని భిన్న కోణాలు ఆవిష్కరించే సందర్భాలు అరుదుగా ఉంటాయి. ఈ చిత్రంలో ఆ ప్రయత్నం కనిపిస్తుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అభి.. తల్లితో కలిసి చదువుకుంటూ ఉండగా.. టీనేజ్ లో ఏర్పడిన ప్రేమ.. అతన్ని ఆ ఊరి నుంచే వెళ్లిపోయేలా చేస్తుంది. తండ్రి ఆశయమైన హాకీ నేషనల్స్ లో ఆడాలనే కోరికతో ఆ ఊరి నుంచి మరో ఊరికి వెళ్లిన అభి ప్రయాణం.. అక్కడా కొందరు సంపన్న కుర్రాళ్ల వల్ల ఆశయం సంగతి అటుంచితే.. అసలు ప్రాణాలకే ఎసరు వస్తుంది. అక్కడి నుంచి మరో కొత్త ఆశయంతో అమెరికా వరకూ వెళ్లిన అభి చివరికి తను అనుకున్నది సాధిస్తాడు. సాధించిన తర్వాత ఇప్పటి వరకూ తన జీవితంలోకి వచ్చిన వాళ్లంతా స్వార్థపరులే అన్న కోణంల ఆలోచిస్తాడు. అది తప్పని.. అతని అంతరాత్మ హెచ్చరించే సరికి.. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు తిరిగి బాల్యం వైపు ప్రయాణం సాగిస్తాడు. అలా తను ఇంత వరకూ రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన వారందరికీ థ్యాంక్యూ చెబుతూ గత స్మృతులను గ్నాపకం చేసుకుంటూ స్వార్థ లేని జీవితం కోసం ప్రయత్నం మొదలుపెడతాడ. స్థూలంగా ఇదీ థ్యాంక్యూ సినిమా పూర్తి కథ.

ఒక సినిమాను ఎలా తీయాలో నేర్పే సినిమాలున్నట్టే.. ఎలా తీయకూడదో చెప్పే సినిమాలు కూడా ఉంటాయి. అందుకే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు ప్రతి సినిమానూ చూడాలి. ఇది ఫస్ట్ రూల్. దీన్ని పట్టించుకోకపోతే ఇదుగో.. ఈ మధ్య కాలంలోనే వచ్చిన సినిమాలనే మళ్లీ మరొకరు తీస్తుంటారు. థ్యాంక్యూ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపూ మహర్షి సినిమా గుర్తొస్తుంది. పూర్తిగా కాకపోతే స్పష్టంగా అలాగే ఉందా అనిపిస్తుంది. అలాగే రాశిఖన్నా ఎపిసోడ్ అంతా ఆ మధ్య వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ లోనిదే. కేవలం మేల్ లీడ్ లో చైతన్య వచ్చాడు అంతే. నథింగ్ న్యూ. మాళవిక నాయర్ ఎపిసోడ్ తెలుగు సినిమాల్లో అరిగిపోయిన ఫార్ములా. ఇదంతా నా ఆటోగ్రాఫ్‌ స్వీట్ మెమరీస్ ను గుర్తుకు తెస్తుంది. ఇలాంటి గుర్తులు థ్యాంక్యూలో చాలానే కనిపిస్తాయి. అందుకే ఎంత కాదనుకున్నా.. పోలికలు కనిపిస్తూ.. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేస్తాయి. పైగా ఈ పోలికలున్న సినిమాలన్నీ ఈ మధ్య కాలంలోనే వచ్చినవి కావడంతో దర్శకుడి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది.
అసలు ఈ సినిమా ద్వారా విక్రమ్ కుమార్ ఏం చెప్పాలనుకున్నాడు అని చూస్తే.. ఏ వ్యక్తైనా తనే సర్వస్వం అనే అహం పెంచుకుంటే అతని జీవితంలో ప్రేమ మిగలదు. అలా కాకుండా తన ఎదుగుదలకు కారణమైన వారందరినీ గుర్తు పెట్టుకుని కుదిరితే ఒక థ్యాంక్స్ చెప్పడం వల్ల అందరి మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఈగోను వదులుకోవాలి. మనస్సాక్షి చెప్పినట్టూ నడుచుకోవాలి అనే పాయింట్ ను ఎలివేట్ చేసింది థ్యాంక్యూ సినిమా. బట్ దీన్ని స్ట్రెయిట్ గా చెప్పడంలో డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనుకుని ఓల్డ్ ఫార్మాట్ లో వెళ్లి కొత్తగా బోల్తా పడ్డాడు.

అభిరామ్ గా మూడు భిన్న కోణాల్లో నాగ చైతన్య నటన చాలా బావుంది. ముఖ్యంగా తన ఈగోస్ ను ఎలివేట్ చేసే సందర్భంగా అతనిపై ప్రేక్షకులకు కోపం వస్తుంది. అంత బాగా నటించాడు. తర్వాత రాశిఖన్నా పాత్ర ఇంతకు ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ పాత్రలా కనిపిస్తుంది. మాళవిక నాయర్ ఎపిసోడ్ ఆద్యంతం ఫ్రెష్‌ గా, ఇప్పటి వరకూ వచ్చిన టీనేజ్ చిత్రాలకు భిన్నమైన మెచ్యూరిటీ కనిపిస్తుంది. అవికా గోర్ సిస్టర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. ప్రకాష్‌ రాజ్ ది చిన్న పాత్రే. కానీ ఆ పాత్రతో అభిరామ్ కు ఉన్న కనెక్షన్ ఏంటనేది దర్శకుడు చెప్పలేదు. అలాగే ఈశ్వరీరావు పాత్రా ఎటూ కాకుండా కనిపిస్తుంది.

థ్యాంక్యూకుకు ప్రధాన బలం.. సినిమాటోగ్రఫీ, తమన్ నేపథ్య సంగీతం. ఈ రెండూ అద్భుతంగా కుదిరాయి. చాలా మైనస్ లను ఈ రెండు క్రాఫ్ట్స్ కవర్ చేశాయంటే అతిశయోక్తి కాదు. ఎడిటింగ్ లోపంగా ప్రకాష్‌ రాజ్ ఎపిసోడ్ కనిపిస్తుంది. రెండు గంటల 9 నిమిషాల సినిమానే అయినా చాలా సేపు చూస్తున్న భావనా కలుగుతుంది. ఆర్ట్ వర్క్ బావుంది. కాస్ట్యూమ్స్ ఆయా ఏజ్ గ్రూపుల్లో క్లాస్ గా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా విక్రమ్ కుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పలేం. ఈ కథను ఇంతకంటే బెటర్ గా చెప్పి ఉండొచ్చు అనిపిస్తుంది. అతనిదైన టేకింగ్ స్టైల్ ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు కూడా. మొత్తంగా అహంకారానికి, ఆత్మసాక్షికి మధ్య జరిగిన వాదనగా థ్యాంక్యూ సినిమాను చెప్పొచ్చు.

ఫైనల్ గా :- థ్యాంక్యూ కాదు.. సారీ

రేటింగ్:- 2.25/5

– యశ్వంత్ బాబు. కె

Related Posts