తెలుగు సంగీతంపై తమిళుల దండయాత్ర

సినిమాలకు సంబంధించి భాషా బేధాలు తొలగిపోతున్నాయి.. చాలా రోజులుగా వింటున్నాం ఈ మాట. ఇది సినిమాలకే కాదు.. టెక్నీషియన్స్ కు కూడా వర్తిస్తోంది. యస్.. ఒకప్పుడు తెలుగులో ఇతర భాషల సంగీత దర్శకులు హవా చేశారు. ఆ ట్రెండ్ మారి మనవాళ్లు దుమ్మురేపుతోన్న టైమ్ లో కూడా ప్రస్తుతం టాలీవుడ్ వరుసగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను రంగంలోకి దించుతోంది. అంటే మనదగ్గర ఆ టాలెంట్ లేకనా.. లేక కొత్తదనం కోసమా లేదా.. మార్కెట్ కోసమా..?
ముందు నుంచీ తమిళ్ లో సంగీత దర్శకులు ఎక్కువ. అక్కడ నాణ్యమైన సంగీతం బాగా వినిపించింది. పాతతరం సంగీత దర్శకుల తర్వాత ఎనభైల్లో కూడా తెలుగులో తమిళ్ మ్యూజీషియన్స్ దే ఎక్కువ హవా నడిచింది. 90ల తర్వాత ఈ మనవాళ్లు మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడి వాళ్లు అక్కిడికి, అక్కిడి వాళ్లు ఇక్కడ సంగీతం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా మనోళ్లే దంచేస్తున్నారు. అయినా ఇప్పుడు సడెన్ గా మళ్లీ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకుంటున్నారు తెలుగు మేకర్స్. రీసెంట్ గా ప్రారంభం అయిన టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ ను తీసుకున్నారు. మొదట సంగీత దర్శకుడగా మొదలై.. తర్వాత హీరోగానూ మారాడు జీవి ప్రకాష్ కుమార్. ఇతను ఏఆర్ రెహ్మాన్ కు మేనల్లుడు కావడం విశేషం. ఇంతకు ముందు కూడా తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, డార్లింగ్ వంటి సినిమాలకు మంచి పాటలు అందించాడు. కొంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో మళ్లీ తెలుగులోకి ఎంటర్ అవుతున్నాడు. మరి ఈ టైగర్ ఆ తమిళ తంబిఎంత హెల్ప్ అవుతాడో చూడాలి.
ప్రకాష్ కుమార్ తో పాటు హారిస్ జయరాజ్ కూడా మళ్లీ తెలుగులో మొదలుపెడుతున్నాడు. నితిన్, వక్కంతం వంశీ కాంబోలో వస్తోన్న చిత్రానికి హారిస్ జయరాజ్ ను సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. హారిస్ గతంలో వాసు, సైనికుడు, మున్నా, ఆరెంజ్, స్పైడర్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. స్పైడర్ తర్వాత ఇప్పుడు మళ్లీ నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ రకంగా హారిస్ హవా తమిళ్ లో చాలా తగ్గిందిప్పుడు. అయినా తీసుకున్నారంటే ఖచ్చితంగా సత్తా చాటే అవకాశం ఇచ్చినట్టే.
ఇప్పటి వరకూ తెలుగులో పెద్దగా తెలియని మరో సంగీత దర్శకుడు సంతోష్ నారాయనణ్. రా గా ఉండే చిత్రాలకు అతను అద్భుతమైన సంగీతాన్నిస్తాడు. పాటలూ బావుంటాయి. అతని వర్క్ తెలియాలంటే తెలుగులో డబ్ అయిన పిజ్జా, కబాలి, కాలా వంటి చిత్రాలు చాలు. అలాంటి సంగీత దర్శకుడు ఇప్పుడు నాని హీరోగా నటిస్తోన్న దసరా చిత్రానికి పనిచేస్తున్నాడు. ఇది కూడా రా గా ఉండే చిత్రమే అని తెలుస్తోంది. దసరా విజయంలో కీలక పాత్ర పోషిస్తే సంతోష్ కు తెలుగులో కూడా మరిన్ని ఆఫర్స్ వస్తాయని చెప్పొచ్చు.
అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ అంటూ మూడు సినిమాలకే సంగీతం చేసిన మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. తెలుగులో సంగీతం చేయకపోయినా అప్పుడప్పుడూ పాటలు పాడుతున్నాడు. రీసెంట్ గా కూడా డిజే టిల్లు చిత్రంలో పటాస్ పిల్లా, రాధేశ్యామ్ లో సంచారి అనే పాటలతో ఆకట్టుకున్నాడు.
వీరితో పాటు గతంలో యువన్ శంకర్ రాజా కూడా తెలుగులో బానే హవా చేశాడు. అతను ఈ మధ్య తెలుగు వైపు దృష్టి పెట్టడం లేదో లేక మనవాళ్లు పట్టించుకోవడం లేదో కానీ.. ప్రస్తుతం తెలుగులో తమిళ్ సంగీత దర్శకులు మళ్లీ దూకుడు పెంచారు. ఒకేసారి ముగ్గురు వచ్చారంటే రాబోయే రోజుల్లో మరింత కొత్త మ్యూజిక్ ను మనం చూడబోతున్నాం అనుకోవచ్చు. మరి ఈ ట్రెండ్ ను మనవాళ్లు బ్రేకులు వేసి వీళ్లూ సత్తా చాటతారా లేక.. మళ్లీ పాత ట్రెండే కంటిన్యూ కాబోతోందా అనేది చూడాలి.

Related Posts