వెండితెరపై భోళా శంకరుడిగా మెప్పించిన తారలు

ఓం నమ:శ్శివాయ అనే పంచాక్షరి మంత్రం ఇహలోకంలో కోరిన కోరికలు తీర్చి.. పరంలో శివసాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి, పురుషుడు అని పార్వతీపరమేశ్వరులనే అంటాం. ఆదిదంపతులు కూడా వారే. శివుడు తేలిగ్గా వరాలిచ్చే దేవుడని ప్రతీతి. ఇక.. వెండితెరపై పరమశివుడిగా మహాదేవుని వేషంతో మన కథానాయకులు మెప్పించారు. అలా భోళాశంకరుడిగా కనిపించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

శివుని పాత్రలోనూ ఎన్టీఆర్ విశ్వరూపం
శివుని పాత్రను వెండితెరపై పరిపుష్టి చేసిన నటులెందరో ఉన్నారు. ఎన్టీఆర్, బాలయ్య, శోభన్‌బాబు, నాగభూషణం వంటి ఎందరెందరో శివుని పాత్రను వెండితెరపై పోషించి మన్ననలు అందుకున్నారు. ఇక.. ఎన్టీఆర్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కృష్ణుడు, రాముడు మాత్రమే. కానీ నటరత్న శివుడిగా కనిపించి మెప్పించారు కూడా. ‘దక్షయజ్ఞం,ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ సినిమాల్లో శివుడి వేషంలో నటించారు నందమూరి తారక రామారావు.

శివుని పాత్రలో అక్కినేని
శివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడు. కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోళాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్త్వం మాత్రం మాహాద్భుతం. ఇక.. అక్కినేని ఎక్కువ సాంఘిక చిత్రాలు చేసినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘మూగ మనసులు’ సినిమాలోని గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించారు.

శివుడిగా శోభన్ బాబు, కృష్ణంరాజు
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శోభన్ బాబు శివుడి పాత్రలో నటించి మెప్పించారు. పౌరాణిక బ్రహ్మ కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినాయక విజయం’ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు శివుని వేషంలో కనిపించి అలరించారు. ఇక.. విలక్షణమైన నటుడుగా పేరు తెచ్చుకున్న రావుగోపాల్ రావు కూడా శివుడి వేషంలో కనిపించారు.. ‘మావూళ్లో మహాశివుడు’ సినిమాలో అయన మహాశివుడుగా మెప్పించగా.. రాజనాల, నాగ భూషణం, బాలయ్య వంటి నటులు కూడా వెండితెరపై శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు.

శివుని పాత్రపై చిరంజీవి మమకారం
అర్జున్, సౌందర్య హీరోహీరోయిన్లుగా కె..రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మంజునాథ’ సినిమాలో చిరంజీవి శివుడి వేషంలో కనిపించారు. ఈ చిత్రంలో శివుడిగా అత్యద్భుత నటన కనబర్చారు మెగాస్టార్. ఇక.. ‘మంజునాథ’ కంటే ముందే కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపద్భాందవుడు’ సినిమాలోని ఓ పాటలో శివుడిగా కనిపించారు చిరంజీవి.

ఎన్టీఆర్ బాటలోనే బాలకృష్ణ
తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటసింహ బాలకృష్ణ పలు పౌరాణిక పాత్రలతో వెండితెరపై మెప్పించారు. ఈకోవలోనే.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా రామకళ్యాణం’ సినిమాలో ‘ఎంత నేర్చినా ఎంత చూసినా’ పాటలో శివుడిగా కాసేపు కనిపించారు.

భోళా శంకరుడి పాత్రలో నాగార్జున, జగపతిబాబు
భోళాశంకరుడి పాత్రలో నాగార్జున, జగపతిబాబు సైతం నటించారు. భారవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగద్గురు ఆది శంకర’ చిత్రంలో అక్కినేని నాగార్జున శివుడి పాత్రలో కనిపించగా.. మదన్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లైనకొత్తలో..’ సినిమాలో జగపతిబాబు ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు. ఇక వీరు మాత్రమే కాకుండా సుమన్, ప్రకాష్ రాజ్, కమెడియన్ మల్లిఖార్జున రావు వంటి వారు కూడా శివుడి పాత్రలో కనిపించి మురిపించారు.

Related Posts