‘ప్రేమలు’ సినిమా రివ్యూ

నటీనటులు: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు
సినిమాటోగ్రఫి: అజ్మల్ సాంబు
సంగీతం: విష్ణు విజయ్
ఎడిటింగ్‌: ఆకాష్ జోసెఫ్, వర్గీస్
నిర్మాతలు: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
దర్శకత్వం: గిరీష్ ఎ.డి
విడుదల తేదీ: 08-03-2024

ప్రేమకథా చిత్రాలకు బాషతో సంబంధం లేదు. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ఏ భాషా ప్రేమికులైనా ఆదరిస్తారు. ఇక.. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ‘ప్రేమసాగరం, ప్రేమదేశం, ప్రేమిస్తే’ వంటి అనువాద చిత్రాలు తెలుగులో అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే ప్రేమ టైటిల్ తో వచ్చింది ‘ప్రేమలు’.

ఇప్పటికే మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’ ఈరోజు (మార్చి 8) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశాడు. మరి.. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందా? ఈ సినిమా కథేంటి? వంటి విశేషాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ
సచిన్ (నస్లెన్ కె. గఫూర్) ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కాలేజీలో ప్రేమలో విఫలమైన కుర్రాడు. ఆ తర్వాత యూకే వెళ్లాలనుకుంటాడు. వీసా రిజెక్ట్ అవ్వడంతో అదీ ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్‌ అంటూ హైదరాబాద్ వస్తాడు. జీవితంలో ఎప్పుడూ లవ్‌ లో సక్సెస్ అవ్వని కుర్రాడు (సచిన్).. లైఫ్‌ పై పుల్ క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి రీనూ (మమితా బైజు)తో ప్రేమలో పడతాడు. రీనూ హైదరాబాద్‌‌‌లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ – రీనూ ఎలా కలిశారు ? రీనూ కోరుకున్న అంశాలు ఏవీ సచిన్ లో లేకపోయినా అతన్ని ఆమె ఎందుకు ప్రాణంగా ప్రేమిస్తోంది ? వీరి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది ? వంటివి మిగతా కథ.

విశ్లేషణ
ఈ సినిమా డబ్బింగ్ మూవీ అయినా.. సినిమాలో ఎక్కడా ఆ వాసనలు కనిపించలేదు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ హైదరాబాద్. అలాగే.. ఈ మూవీకి తెలుగు డైలాగ్స్ అందించింది #90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్. గతంలో చూసిన కాన్సెప్టే అయినా.. రెండున్నర గంటల సేపు ఆడియన్స్‌ ను ఎంగేజ్‌ చేస్తాడు దర్శకుడు గిరీశ్‌ ఎడి. ఇక హీరోహీరోయిన్లు నస్లేన్ కే గఫూర్, మమిత బైజు అనే కాదు.. ఈ చిత్రంలోని మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరంతా మనకు పరిచయమైన ముఖాలు కాకపోయినా.. వారి పాత్రలతో మనము కనెక్ట్ అయిపోతాం.

సినిమా అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది. హీరో లైఫ్ చూస్తుంటే మన లైఫ్ మనం చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమించిన అమ్మాయి తన లవ్‌ ని కాదన్నప్పుడు సగటు కుర్రాళ్లు పడే బాధ, ఆవేదనని ఫన్నీగా, ఎమోషనల్‌గా చూపిస్తూ రెండింటినీ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. హైదరాబాద్ అందాలకు తెలుగు వాళ్లు ఫిదా అయిపోతారు. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, ట్యాంక్ బండ్, చార్మినార్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్‌లో ఉన్న చాలా ప్రదేశాల్ని అందంగా చూపించారు. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల్లోనూ ఈ ప్రదేశాలను ఇంతందంగా చూపించలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
హీరో నస్లెన్ కె.గఫూర్ తన అమాయకమైన పేస్ తో ఆకట్టుకున్నాడు. తన యాక్టింగ్ అండ్ సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. హీరోయిన్ గా నటించిన మమితా బైజు తన లుక్స్ తో కుర్రకారును కట్టి పడేస్తుంది అని చెప్పొచ్చు. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్‌గా చేసిన సంగీత్ ప్రతాప్‌ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆది పాత్రలో శ్యామ్‌ మోహన్‌ ఆద్యంతం నవ్వులు పూయించాడు.

ఇలాంటి రొమాంటిక్ డ్రామాలకు సంగీతం ఎంతో ప్రధానం. విష్ణు విజయ్‌ వినసొంపైన, హృదయాన్ని టచ్‌ చేసే సంగీతాన్నందించాడు. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అజ్మల్‌ సాబు విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కువమందే అయినా.. మన తెలుగు వారికీ బాగా నచ్చిన నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించడం విశేషం. ప్రతీ ఫ్రేములోనూ నిర్మాణ విలువలు, అతని అభిరుచి కనిపిస్తాయి. అందరికంటే ముందు బాగా ప్రశంసించాల్సిన వ్యక్తి దర్శకుడు గిరీష్ ఎ.డి. ఇతనే డైరెక్టర్, ఇతనే రైటర్. యూనివర్శల్ పాయింట్ తీసుకుని అన్ని భాషా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ‘ప్రేమలు’ని అందంగా మలిచాడు డైరెక్టర్ గిరీష్.

చివరగా
చివరగా ‘ప్రేమలు’ చిత్రం ప్రేక్షకుల్ని ప్రేమమైకంలో ముంచెత్తే పర్ఫెక్ట్ మూవీ. ‘ప్రేమలు’ యూత్ కి బాగా నచ్చే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్ : 2.5/5

Related Posts