టైమ్ ట్రావెల్ చేస్తోన్న మన కథానాయకులు

టైమును మన కంట్రోల్ లో పెట్టుకుని.. స్విఛ్ నొక్కితే చాలు మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎలాగుంటోంది? అలాంటి అనుభూతినే అందిస్తాయి టైమ్ ట్రావెలింగ్ మూవీస్. మన టాలీవుడ్ స్టార్స్ అప్పుడప్పుడూ టైమ్ ట్రావెల్ చేసిన వారే. నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369‘ సినిమాతోనే తెలుగులో టైమ్ ట్రావెల్ స్టోరీస్ మొదలయ్యాయి.

బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. టైమ్‌ మెషీన్ బ్యాక్‌ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా 1991లో విడుదలై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు బాలయ్య. ప్రయోగాత్మక కథాంశాలకు పెట్టింది పేరైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఈ సినిమాలో అటు 14వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యాన్ని.. అలాగే 2504వ సంవత్సరంలోని ఫ్యూచర్ వరల్డ్ ని సరికొత్తగా ఆవిష్కరించారు.

బాబాయ్ బాలకృష్ణ బాటలోనే అబ్బాయ్ కళ్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ మూవీ ‘బింబిసార’. క్రీస్తు పూర్వానికి.. ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. శర్వానంద్ హీరోగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ కూడా టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతోంది. సైన్స్ కి, విధికి మధ్య జరిగే పోరులో చివరికి ఏది గెలుస్తుంది అనే కథాంశంతో వైవిధ్యభరిత టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఎడి’. ఈ సినిమా టైటిల్ లోనే ఈ చిత్రం ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా అర్థమవుతోంది. అయితే.. ఈ సినిమాలో కేవలం ఫ్యూచర్ మాత్రమే కాదు.. మన పురాణాలతో లింక్ పెడుతూ పాస్ట్ ని కూడా చూపించబోతున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మహాభారతాన్ని కూడా ఆవిష్కరించనున్నాడట. ఈ మూవీలో ప్రభాస్ కొంతసేపు కర్ణుడుగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఆ కర్ణుడి నే ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కల్కి గా ప్రయోగిస్తారని.. అదే ‘కల్కి 2898 ఎడి’ కథ అంటూ ఓ కథనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ విధంగా చూస్తే.. ‘కల్కి 2898 ఎ.డి’ రెండు కాలాలలో ప్రయాణం చేసే సినిమా అవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ప్రభాస్ ‘కల్కి‘ మూవీ ట్రైలర్ ను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు.

Related Posts