సంక్రాంతి వార్.. తగ్గేదే లే అంటోన్న తమిళ చిత్రాలు

తెలుగు వారికి సంక్రాంతి పండగ ఎలాగో.. తమిళ వారికి పొంగల్ అలాంటిది. అందుకే పొంగల్ పోరులో తమ సినిమాలను పోటీకి దింపేందుకు కోలీవుడ్ స్టార్స్ అంతా ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. పనిలో పనిగా అనువాద రూపంలో తమ సినిమాలను తెలుగులోనూ సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సమయంలో జరుగుతున్న తంతే ఇది. అయితే.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

తెలుగులోనే ఐదు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈనేపథ్యంలో తమిళం నుంచి వచ్చే అనువాద సినిమాలు ‘కెప్టెన్ మిల్లర్, అయలాన్‘లకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అయినా.. ఈ రెండు సినిమాలు ప్రచారంలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. లేటెస్ట్ గా ‘కెప్టెన్ మిల్లర్‘ నుంచి ‘ఘోరా హరా‘ అంటూ సాగే గీతం విడుదలైంది. ఈ పాటలో ధనుష్ తో పాటు.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు. జి.వి.ప్రకాష్ సంగీతాన్నందించిన ఈ గీతం ఆకట్టుకుంటుంది.

మరోవైపు ఇప్పటికే టీజర్ తో తెలుగులోనూ మంచి క్యూరియాసిటీ ఏర్పరచుకుంది శివ కార్తికేయన్ ‘అయలాన్‘. ఏలియన్ కాన్సెప్ట్ తో వైవిధ్యంగా రాబోతున్న ఈ మూవీకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం మరో ప్లస్ అని చెప్పాలి. ‘అయలాన్‘ ట్రైలర్ ను జనవరి 5న విడుదల చేయబోతున్నారు. మొత్తంమీద.. తెలుగు సినిమాల ధాటికి తమిళ అనువాదాలు సంక్రాంతి నుంచి తప్పుకుంటాయనే ప్రచారం జరిగింది. కానీ.. ఈ సినిమాల ప్రచార జోరు చూస్తే అలాంటిది ఏమీ లేనట్టు అర్థమవుతోంది.

Related Posts