జంతువులతో మన హీరోల పోరాటాలు

మన కథానాయకులు ఈమధ్య పులులతో ఎక్కువగా తలపడుతున్నారు. క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్‘ కోసం దర్శకధీరుడు రాజమౌళి పులితో తీర్చిదిద్దిన ఎన్టీఆర్ ఇంట్రో సీన్ ఎలాంటి అప్లాజ్ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ట్రిపుల్ ఆర్‘ సినిమాలోని ఇంట్రో సీన్ లోనూ.. ఇంటర్వెల్ లోనూ పులులతో చెలరేగిపోయాడు తారక్. ఇదే స్ఫూర్తితో ‘పుష్ప‘ సినిమాకోసం బన్నీ కూడా అలాంటి ఫీటే చేయబోతున్నాడు. ‘పుష్ప2‘ నుంచి ఇప్పటికే రిలీజైన ‘వేర్ ఈజ్ పుష్ప‘ ఎపిసోడ్ లో టైగర్ సీన్ కి వచ్చిన అప్లాజ్ అంతా ఇంతా కాదు.

అలాగే.. నటసింహం బాలకృష్ణ బిరుదులోనే సింహం ఉంది. అలాంటి బాలయ్య సింహంతో తలపడితే ఎలా ఉంటుంది?. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకోసం అలాంటి ఫీట్ చేయబోతున్నాడట నటసింహం. ఏకంగా ఓ సింహంతోనే తలపడబోతున్నాడట. బాలయ్య-బాబీ సినిమాకే ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎంతో హైలైట్ అవుతుందనే టాక్ ఆమధ్య ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొట్టింది.

లేటెస్ట్ గా విలక్షణ నటుడు సూర్య.. ‘కంగువ‘ సినిమాకోసం ఓ మొసలితో పోరాటం చేయబోతున్నాడట. శివ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘కంగువ‘ రూపొందుతోంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో కలిసి యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న ఈ మూవీలో ఓ మొసలితో సూర్య చేసే పోరాటం సినిమాకే హైలైట్ అవ్వబోతున్నట్టు తమిళ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా దిశా పఠాని నటిస్తుంటే.. బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నాడు. 38 భాషల్లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘కంగువ‘ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts