బెల్లంకొండ ‘కిష్కిందపురి’ కోసం లక్కీ హీరోయిన్?

టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతోనే యాక్షన్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అదే ఇతనికి హిందీ సర్కిల్స్ లోనూ విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమాలు అనువాద రూపంలో హిందీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో.. డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమా చేశాడు. తెలుగులో ఘన విజయాన్ని సాధించిన ప్రభాస్ ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేశాడు. కానీ.. అక్కడ ఆశించిన విజయం సాధించలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు పక్కనపెట్టేసిన బెల్లంకొండ.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈకోవలోనే ‘టైసన్ నాయుడు, కిష్కిందపురి’ వంటి సినిమాలు చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ‘టైసన్ నాయుడు’ ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు ‘కిష్కిందపురి’ పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది.

‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కిష్కిందపురి’ ఇటీవలే కాన్సెప్ట్ పోస్టర్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందట. ఈకోవలోనే.. ఈ మూవీకోసం బెల్లంకొండకి జోడీగా లక్కీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారట. గతంలో ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ-అనుపమ హిట్ కొట్టారు. ఇప్పుడు ‘కిష్కిందపురి’తో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

Related Posts