‘రాబిన్ హుడ్’గా బాక్సాఫీస్ ను కొల్లగొడతానంటోన్న నితిన్

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ ఫిక్సయ్యింది. టైటిల్ తో పాటు.. ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది..
రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే.. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చుపెడతానంటది..అన్నట్టే చేసింది’.. అంటూ ఆసక్తికరమైన డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ మొదలైంది.
రాబిన్ హుడ్ అంటేనే డబ్బున్నోళ్ల దగ్గర దోచుకుని పేదోళ్లకు పంచిపెడుతుంటాడు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలాగే ఉండబోతున్నట్టు గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది.

ఇక.. ‘దేశమంత కుటుంబం నాది.. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కచెల్లెళ్లు.. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే.. ఫ్యామిలీ మెంబర్ ని అని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు..’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ తో సరికొత్తగా ‘రాబిన్ హుడ్’ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో తొలుత రష్మిక కథానాయికగా ఎంపికైనా.. డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే.. శ్రీలీల నాయికగా నటిస్తుందనే ప్రచారం ఉన్నా.. ఈ గ్లింప్స్ లో హీరోయిన్ పై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంమీద.. ‘భీష్మ’ వంటి హిట్ తర్వాత రాబోతున్న నితిన్-వెంకీ కుడుముల ‘రాబిన్ హుడ్’ ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Related Posts