నాని కిట్టీలో నాలుగు సినిమాలు

కథల కోసం అన్వేషణలో వేట సాగిస్తూనే.. కథానాయకులంతా తమ కాలాన్ని గడిపేస్తుంటారు. కానీ.. నేచురల్ స్టార్ నాని మాత్రం అందుకు భిన్నం. కథలే అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడం అంటే నానికి ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తవ్వగానే మరో చిత్రం రెడీగా ఉంటుంది. నాని తన 30వ చిత్రంగా ‘హాయ్ నాన్న‘ చేశాడు. ప్రస్తుతం 31గా ‘సరిపోదా శనివారం‘ వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే లేటెస్ట్ గా తన 32వ చిత్రాన్ని ప్రకటించాడు.

సరిపోదా శనివారం‘ సినిమాని నిర్మిస్తోన్న డివివి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలోనే నాని 32 కూడా ఉండబోతుంది. ‘సాహో‘ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఆలస్యమవుతుండడంతో ఈలోపులో నాని చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్లాన్ రెడీ చేశాడట సుజీత్. నాని బర్త్ డే స్పెషల్ గా సుజీత్ మూవీ నుంచి అనౌన్స్ మెంట్ వీడియో రిలీజైంది.

సుజీత్ చిత్రం తర్వాత కమెడియన్ వేణు డైరెక్షన్ లో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. ఇటీవల నాని పుట్టినరోజుకి డైరెక్టర్ వేణు తో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ కూడా నేచురల్ స్టార్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ ఇతివృత్తంతో ఓ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాకోసం ‘ఎల్లమ్మ’ విభిన్నమైన టైటిల్ పరిశీలనలో ఉంది.

ఈ సినిమాలే కాదు ‘దసరా‘ తర్వాత మరోసారి శ్రీకాంత్ ఓదెలతోనూ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. నానిలోని రస్టిక్ యాంగిల్ ను ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. ఈసారి నానిని మరో కొత్త అవతారంలో చూపించడానికి రెడీ అవుతున్నాడట. త్వరలోనే నాని-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. మొత్తంమీద.. ‘సరిపోదా శనివారం’తో పాటుగా నాలుగు సినిమాలను నాని కిట్టీలో ఉన్నాయన్న మాట.

Related Posts