సునామీకి ఎదురెళుతోన్న జెర్సీ..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన సినిమా జెర్సీ. నాని కెరీర్ లోనే ఓ బెస్ట్ మూవీస్ గా నిలిచిందీ మూవీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ మూవీ వారికి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చింది. అలాంటి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడం ఆశ్చర్యమేం కాదు. పైగా తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేసి అదే స్థాయి విజయాన్ని అక్కడా అందుకున్న షాహిద్ కపూర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు అంటే మరోసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే సితారతో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు కూడా జతకలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే బాగా ఆలస్యం అయింది. దీంతో ఎప్పుడో విడుదల కావాల్సిన హిందీ జెర్సీ చాలా ఆలస్యం అయింది. అయితే అయింది కాస్త మంచి టైమ్ చూసుకుని రావాల్సిన వీళ్లు ఈ సారి ఏకంగా సునామీకే ఎదురెళుతున్నారు.
ఈ నెల 14న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు కెజీఎఫ్ చాప్టర్2 విడుదల కాబోతోంది. ఈ మూవీపై సౌత్ కంటే ఎక్కువగా నార్త్ లోనే అంచనాలున్నాయి. ఆ మధ్య కూడా నార్త్ పీపుల్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సినిమా ఏంటీ అని ఓ సర్వే పెడితే చాలామంది ఆర్ఆర్ఆర్ ను కూడా కాదని కెజీఎఫ్ కు ఓటేశారు. వారి ఓటింగ్ లో అక్షయ్ కుమార్ మూవీ, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలు కూడ చాలా వెనకే ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఈ సర్వేలో అసలు జెర్సీ గురించిన ప్రస్తావన కూడా లేదు. అలాంటి చిత్రాన్ని కెజీఎఫ్ కు పోటీగా వేయడం అంటే సునామీకి ఎదురెళ్లడం లాంటిదే కదా..? మరి ఆ సునామీని ఈ చిత్రం తట్టకుని తన బ్యాట్ తో బాక్సాఫీస్ వద్ద సిక్స్ లు ఫోర్లు కొడతారా లేక ఫస్ట్ డే నే అవుట్ అయిపోతారా అనేది చూడాలి.
ఇక ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో చేసిన బాల నటుడే హిందీలోనూ యాక్ట్ చేశాడు. సంగీతం, ఎడిటింగ్ కూడా తెలుగులో చేసిన అనిరుధ్, నవీన్ నూలితో చేయించుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు కెజీఎఫ్ హవా బాగా ఉంది. ఈ హవాలో రావడం కంటే కాస్త గ్యాప్ తీసుకుంటే మంచిదేమో.. ఎలాగూ వీళ్లు సౌత్ లో విడుదల చేయరు కదా..?

Related Posts