పవన్ తో స్నేహం త్రివిక్రమ్ కు శాపం కాబోతోందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా రచయితగా తిరుగులేని ముద్రవేసినవాడు. పంచ్ డైలాగ్ లను పరిచయం చేసి ఆ తర్వాత అంతా తననే ఫాలోఅయ్యేలా చేసిన ప్రతిభావంతుడు. నిగూఢమైన భావాలను కూడా సింపుల్ గా చెప్పడం.. సింపుల్ గా చెప్పే చోట పంచ్ లతో కొట్టడం త్రివిక్రమ్ పెన్ కు మాత్రమే ఉన్న కెపాసిటీ. ఆ కెపాసిటీయే అతన్ని అతి తొందరగానే దర్శకుడుగా మార్చింది. నువ్వే నువ్వే సినిమా బానే అనిపించినా.. డైలాగ్స్ ఎక్కువగా వినిపించాయి అన్న విమర్శ వచ్చింది. తనలోని రైటర్ డైరెక్టర్ ను డామినేట్ చేయడం వల్ల వచ్చిన విమర్శ అది. అటుపై కొంత గ్యాప్ తీసుకున్నా.. మహేష్ బాబుతో చేసిన అతడు దర్శకుడుగా, రచయితగా అతడి పొటెన్సియల్ ను చూపించింది. మాటలతో మంత్రముగ్దులను చేస్తాడు కాబట్టే అతన్ని మాటల మాంత్రికుడు అనేసుకుంది తెలుగు సినిమా. ఇక పవన్ కళ్యాణ్ పరిచయం త్రివిక్రమ్ లైఫ్ ను చాలా మార్చిందనే చెప్పాలి. జల్సాతో మొదలైన వీరి బంధం ఆ తర్వాత స్నేహంగా మారింది. ఆ స్నేహాన్ని కొనసాగిస్తూనే వరుస సినిమాలతో టాప్ డైరెక్టర్ గా మారాడు.

పవన్ తోనే చేసిన అత్తారింటికి దారేదీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అటు పవన్ కు పొలిటికల్ గానూ చాలా హెల్ప్ అయ్యారన్న మాటలూ వినిపించాయి. ఇవన్నీ పక్కన బెడితే ఆయన చాలాకాలంగా ఒకే నిర్మాణ సంస్థకు స్టిక్ ఆన్ అయ్యారు. త్రివిక్రమ్ సినిమా అంటే కేవలం హారిక హాసిని బ్యానర్ లో మాత్రమే వస్తుంది. అంత ప్రతిభావంతుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యమే అయినా.. ఆ బ్యానర్ కూడా మంచి వలువలున్న చిత్రాలు నిర్మిస్తోంది కాబట్టి.. చాలా వరకూ మంచిదే. అయితే పవన్ కళ్యాణ్ తో స్నేహం వల్ల త్రివిక్రమ్ ఇతర హీరోలకు కాస్త దూరమవుతున్నాడు అనే మాటలు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. అంటే వేరేవారితో సినిమాలు చేస్తున్నా.. పవన్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటాడు. ఈ కారణంగానే కొన్నాళ్లుగా కథల విషయంలోనూ తడబడుతున్నాడు. ప్రతిసారీ మాటలతో నెట్టుకు రావడం కుదరదు. ఎన్టీఆర్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన అరవింద సమేత ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కాలేదు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అయినా.. ఆడియో బ్లాక్ బస్టర్ గానే ఎక్కువగా ఫేమ్ అయింది. ఇక తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం కథ నచ్చలేదు అన్నారు. రైటర్ గా టాప్ అనిపించుకున్న త్రివిక్రమ్ నుంచి కథ బాలేదు.. హీరోకు నచ్చలేదు అన్న టాక్ రావడం ఆశ్చర్యమే. ఇదే కారణం అని చెప్పలేం కానీ.. ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

ఇక తర్వాత మహేష్ బాబుతో మూడో సినిమా ప్రారంభించారు. ఓపెనింగ్ కూడా జరుపుకున్న ఈ చిత్ర కథ విషయంలోనూ అదే వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు చెప్పిన కథలోనే మార్పులు చేసి మహేష్ కు చెప్పాడట. కానీ అప్పుడు పూర్తి స్క్రిప్ట్ వినిపించలేదని టాక్. నిజానికి అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ కు కరోనా కారణంగా చాలా టైమ్ దొరికింది. అయినా దాన్ని ఇతర కథల కంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ కేటాయించాడని చెప్పుకుంటారు. అలాగే మహేష్ తో ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత కూడా దీనికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆ చిత్రం చూసిన ఎవరికైనా చాలా వరకూ త్రివిక్రమే డైరెక్ట్ చేశాడని అర్థం అవుతుంది. ఆ స్నేహం కోసం అవి చేసుకోవచ్చు. కానీ కేవలం అవి మాత్రమే చేస్తూ ఇతర హీరోల కథల విషయంలో ఆ రేంజ్ లో కాన్ సెంట్రేట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్లు దూరం అవుతారు. ఇప్పటికే మహేష్ కు పూర్తి స్క్రిప్ట్ నచ్చలేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే మరో టాప్ హీరో త్రివిక్రమ్ తో చేయడానికి వెనకాడతాడు. పైగా ఇప్పుడు దక్షిణ దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియన్ ఫీవర్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ కథలకు ప్యాన్ ఇండియా స్థాయి ఉంటుందని చెప్పలేం. సో.. కేవలం పవన్ కళ్యాణ్ కే కాదు.. ఇతర ప్రాజెక్ట్స్ కూ టైమ్ ఇచ్చుకుంటే మంచిది లేదంటే ఆ స్నేహమే ఈయనకు శాపంగా మారుతుందని టాలీవుడ్ అంతా గుసగుసలు పోతోంది.

Related Posts