‘పుష్ప’ డేట్ కోసం భారీ డిమాండ్

భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో జాప్యం జరుగుతూనే ఉంటుంది. వందలాది మంది టెక్నీషియన్స్, వేలాది మంది జూనియర్స్ తో షూటింగ్ చేయడం అంటే కత్తిమీద సామే. వాతావరణం సహకరించకపోయినా, నటీనటులకు ఆరోగ్యం సరిగా లేకపోయినా.. షూటింగ్ ని వాయిదా వేయక తప్పదు. ఇటీవల ‘దేవర’ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

ఆగస్టు 15న విడుదల తేదీ ప్రకటించడంతో.. వాయువేగంతో చిత్రీకరణను పూర్తిచేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. రెండు, మూడు యూనిట్లతో షూటింగ్ ను కొనసాగిస్తున్నాడట. అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవ్వకపోతే వాయిదా తప్పదు. ఒకవేళ ‘పుష్ప 2’ అనుకున్న సమయానికి రాలేకపోతే.. ఆ తేదీని తాము ప్రకటించాలనుకునే చిత్రాల సంఖ్య పెరుగుతుంది.

‘పుష్ప 2’ వాయిదా పడితే.. అదే డేట్ కి రావాలనుకుంటున్నాడట నేచురల్ స్టార్ నాని. తన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట. అలాగే.. నాగచైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ కోసం కూడా ఆగస్టు 15నే అనుకుంటున్నారట. పాకిస్తాన్ లో చిక్కుకున్న జాలరు కథ కావడంతో.. దేశభక్తి ముడిపడిన ఈ సినిమాకోసం ఆగస్టు 15 అయితే బాగుంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచన.

Related Posts