2023 సంక్రాంతి కోసం గిల్డ్ నిర్మాతల భారీ కుట్ర

తెలుగు సినిమాకు సంక్రాంతి ఎంత పెద్ద సీజన్ అనేది అందరికీ తెలుసు. ఆ టైమ్ లో వచ్చిన యావరేజ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. ఏ మాత్రం బావుంది అన్న టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటాయి. ఇదుగో ఈ మాట కోసమే తెలుగు నిర్మాతల గిల్డ్ లోని కొందరు నిర్మాతలు ఓ భారీ స్కెచ్ వేశారు. ఈ స్కెచ్ ను అమలు చేసేందుకు.. సినిమాల్లో విలన్స్ కూడా ఊహించినంత భారీ కుట్రకు తెరలేపారు. ఆ కుట్రలో భాగమే ఇప్పుడు సినిమా పరిశ్రమలో జరుగుతోన్న షూటింగ్ లు బంద్, నిర్మాతలకు కాస్ట్ కంట్రోల్ ఉండాలి.. ఆర్టిస్టులు రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలి అంటూ సాగుతోన్న తతంగం అంతా. ఈ హడావిడీ మాటున ఓ పన్నాగం ఉంది. అది మామూలుది కాదు. యస్.. తెలిస్తే ఆశ్చర్యపోవడం కాదు షాక్ అవుతారు. ఎందుకంటే ఇది మామూలు కుట్ర కాదు. నైతికంగా ఎంతో దిగజారితే తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనలు రావు అంటూ ఇతర నిర్మాతలు వాపోతున్నారు. ఇంతకీ వీళ్లు చేసిన కుట్ర ఏంటీ.. వేసిన స్కెచ్ ఏంటీ.. అసలు వారి ప్లాన్ ఏంటీ ..?
సంక్రాంతి టైమ్ లో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదు.. అని ఇంతకు ముందు ఇదే తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోని కొందరు నిర్మాతలు ఓ తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకు గతంలో తెలుగులో సూపర్ మార్కెట్ ఉన్న రజినీకాంత్ సినిమాను కూడా సంక్రాంతికి రాకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. అంటే తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న తపన అప్పట్లో కనిపించింది. కానీ అదే ఇప్పుడు రివర్స్ అయింది.
ఈ గిల్డ్ లోని కొందరు నిర్మాతలు ఇప్పుడు వేర్వేరు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆ హీరోలేమో మా సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి అని చెప్పుకుంటున్నారు. ఈ నిర్మాతలేమో మాది బై లింగ్వుల్ అంటున్నారు. ఏదైనా హీరో అవతలి వాడు కాబట్టి అది డబ్బింగ్ సినిమాగానే చూడాలి. మరి సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు ఉండకూడదు అని కదా వీళ్లు తీర్మానం చేసుకున్నారు. అంటే తమ సినిమాలు ఆ టైమ్ లో విడుదల చేయకూడదు. చేయకపోతే అంత పెద్ద సీజన్ అడ్వాంటేజ్ ను వదులుకోవాల్సి వస్తుంది కదా..? ఇదుగో ఈ పాయింట్ ను దాటి అడ్డదారిలో సంక్రాంతికి రావాలనే షూటింగ్ లు బంద్ అనే కొత్త నాటకం మొదలుపెట్టారు.
నిజానికి సంక్రాంతి బరిలో టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు మరికొందరు హీరోల సినిమాలు విడుదల చేయాలనుకున్నారు. ఈ హీరోలకు సంక్రాంతి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. వీరిని గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఆపలేరు కదా.. అందుకే షూటింగ్ లు ఆపేస్తున్నారు. వీళ్లే కాదు.. ఆ టైమ్ కు రావాలనుకున్న చాలా సినిమాలను ఇలా షూటింగ్ లు ఆపేసి తామేదో పరిశ్రమను ఉద్దరిస్తున్నాం అని చెప్పుకుంటున్నా.. అసలు కారణం ఏంటంటే.. కొన్నాళ్ల పాటు చిత్రీకరణలు ఆగిపోతే.. వీళ్లు సంక్రాంతి టైమ్ కు అందుబాటులో ఉండరు. షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా రిలీజ్ కూడా లేట్ అవుతుంది. అప్పుడు పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి.. సదరు గిల్డ్ ప్రొడ్యూసర్స్ తమ డబ్బింగ్ సినిమాలను సంక్రాంతికి వేస్తారు. అదీ విషయం.
కేవలం సంక్రాంతి మార్కెట్ ను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు కొంతమంది గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఆడుతోన్న నాటకమే ఈ షూటింగ్ లు బంద్ అనే వ్యవహారం. నిజానికి షూటింగ్ లు బంద్ చేయడం వల్ల కొద్దిమంది కార్మికులకు మాత్రమే నష్టం తప్ప సామాన్య జనానికి వచ్చిన సమస్యేం లేదు. అంటే అంతర్గతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తమ స్వలాభం కోసం కపట నాటకం ఆడుతూ.. జరుగుతోన్న షూటింగ్ లను ఆపేసి.. వారిని సంక్రాంతి బరి నుంచి లేపేసే భారీ కుట్ర అన్నమాట ఇది. ఏదేమైనా గిల్డ్ లోని కొందరు నిర్మాతలు తమ లాభం కోసం ఎంతకైనా తెగిస్తారు అనేందుకు ఇది మరో ఉదాహరణ.
మరి ఇలా చేయడం వల్ల ఇతర నిర్మాతలు నష్టపోతారు.. తద్వారా పరిశ్రమకే నష్టం కదా..? అంటే గిల్డ్ వారికి కావాల్సింది స్వలాభమే తప్ప పరిశ్రమ లాభం కాదు. ఈ పరిశ్రమ ఏమైనా ఫర్వాలేదు అంటూ తమ బాధను వెల్లగక్కుతున్నారు చిన్న, మధ్య తరహా సినిమాలు తీస్తోన్న నిర్మాతలు. మరి గిల్డ్ లోని ఆ కొందరు నిర్మాతల కపట నాటకానికి తెరదించేది ఎవరో కానీ.. ఇది పరిశ్రమ మనుగడకే గొడ్డలిపెట్టు లాంటిది అని చెప్పొచ్చు.

Related Posts