మరోసారి మురిపించబోతున్న హిట్ కాంబినేషన్స్

హిట్టైన కాంబినేషన్స్ ను రిపీట్ చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు నిర్మాతలు. అలాగే.. హిట్టైన కాంబినేషన్స్ లో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటివే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ‘దేవర’ చిత్రం గురించి.

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. ఒకటి కాదు రెండు భాగాలుగా ‘దేవర’ ఆడియన్స్ ముందుకు రానుంది. గతంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేసిన ఎన్టీఆర్-కొరటాల కాంబో ‘దేవర’ని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ కనువిందు చేయనున్నాడు. దసరా కానుకగా ‘దేవర’ పార్ట్ 1 విడుదలకు ముస్తాబవుతోంది.

ఒకటి కాదు.. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో రిపీట్ కాంబినేషన్స్ లో సూపర్ హిట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన ఘనత పొందాడు సుక్కూ. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలు ‘ఆర్య, ఆర్య 2, పుష్ప 1’ తర్వాత ఇప్పుడు నాల్గవ చిత్రంగా ‘పుష్ప 2’ రాబోతుంది. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ‘పుష్ప 2’ విడుదలకు ముస్తాబవుతోంది.

అల్లు అర్జున్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఫక్తు పల్లెటూరి కథాంశంతో రూపొందిన ‘రంగస్థలం’ చరణ్ కెరీర్ లోనే ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సరికొత్త కథాంశంతో ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నారు. వీరి కాంబోలో రూపొందే ‘ఆర్.సి.17’ త్వరలోనే అఫీషియల్ గా ముహూర్తాన్ని జరుపుకోనుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ క్రేజీ కాంబోని రిపీట్ చేస్తున్నాడు. అదే హరీష్ శంకర్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయాన్ని సాధించింది. అప్పటివరకూ కాస్త డల్ ఫేజ్ లో ఉన్న పవర్ స్టార్ ని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చిన పవర్ ఫుల్ మూవీ ‘గబ్బర్ సింగ్’. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ మళ్లీ ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే.. పవన్ పోలీస్ పవర్ తో పాటు ఆయనలోని హ్యూమర్ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

ఇక ప్రెజెంట్ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే వంద కోట్లు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘గీత గోవిందం’. డైరెక్టర్ పరశురామ్ ని ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ మళ్లీ కలిసి పనిచేసిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

మీడియం రేంజ్ హీరోస్ లో కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తున్న వారిలో యూత్ స్టార్ నితిన్ కూడా ఉన్నాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ‘రాబిన్ హుడ్’ చిత్రం రూపొందుతోంది. అయితే.. విజయ్-పరశురామ్ కాంబినేషన్ ‘ఫ్యామిలీ స్టార్’ కోసం గీతా ఆర్ట్స్ ప్లేసులో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సెట్ అయినట్టే.. ‘రాబిన్ హుడ్’కి సితార బదులు మైత్రీ మూవీ మేకర్స్ లైన్లోకి వచ్చింది.

రిపీట్ కాంబినేషన్స్ గురించి చెప్తే ప్రభాస్ ‘సలార్’ గురించి కూడా చెప్పాలి. ఒకవిధంగా ఇది సీక్వెల్ మూవీ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ‘సలార్ 2’ త్వరలోనే పట్టాలెక్కనుంది. మరి.. ‘సలార్’తో సెన్సేషనల్ హిట్ సాధించిన ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్ 2’తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Related Posts