నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

నటుడు డేనియల్ బాలాజీ (48) క‌న్నుమూశారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థ‌రాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన డేనియ‌ల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి కుటుంబ సభ్యులు త‌ర‌లించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్‌ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. బాలాజీ ఎక్కువగా ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనే నటించారు. తెలుగులో ‘ఘర్షణ’ సినిమాతో డేనియల్ కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘చిరుత, సాహసం శ్వాసగా సాగిపో, టక్‌ జగదీష్‌’ వంటి చిత్రాలు తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నాని హీరోగా 2021లో రిలీజైన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో మెయిన్ విల‌న్‌గా డానియ‌ల్ బాలాజీ క‌నిపించాడు. ఇదే బాలాజీ చివరి తెలుగు చిత్రం.

మొదటగా కమల్ హాసన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘మరుదనాయగం’ సెట్స్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా బాలాజీ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ‘పిన్ని’ సీరియల్ లో డేనియల్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచీ అతను డేనియల్ బాలాజీగా పాపులర్ అయ్యాడు. డేనియల్ బాలాజీ తండ్రి చిత్తూరుకి చెందిన వాడు కాగా.. తల్లి తమిళ మూలాలున్న వ్యక్తి.

48 ఏళ్ల వయసులోనే డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. చేసిన అన్ని భాషల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు డేనియల్ బాలాజీ.

Related Posts