దర్శకుడిగానూ, నటుడిగానూ అదే వైవిధ్యం

చిత్ర పరిశ్రమలో ఒక శాఖకు సంబంధించిన వ్యక్తులు.. మరో శాఖలో పనిచేయడం సాధారణంగా జరిగే విషయమే. ఈకోవలోనే.. నటులు దర్శకులుగా మారి సూపర్ హిట్స్ అందించిన సందర్భాలున్నాయి. అలాగే.. దర్శకులు నటులుగానూ రాణించిన వారున్నారు. ఈ లిస్టులో విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఉన్నాడు.

2001లో ‘చెలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ మీనన్.. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ తీయడంలో స్పెషలిస్ట్. అయితే.. గత కొన్నేళ్లుగా గౌతమ్ కి అసలు సిసలు హిట్ లభించలేదు. ‘సాహసం స్వాసగా సాగిపో’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గౌతమ్ తీసిన ‘తూటా’ కూడా ఆడియెన్స్ ని అలరించలేకపోయింది. ఇక.. విక్రమ్ తో తీసిన ‘ధృవ నక్షత్రం‘ చాలా ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో నిర్మాతగానూ బాగా ఇబ్బందులు పడ్డాడు. ఒకవిధంగా ‘ధృవ నక్షత్రం‘ సినిమా పెట్టుబడి కోసమే తాను నటుడిగానూ మారానని ఆమధ్య ఇంటర్యూలలో చెప్పాడు.

నటన విషయానికొస్తే.. మలయాళం చిత్రం ‘ట్రాన్స్‘ గౌతమ్ కి యాక్టర్ గా టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ఆ తర్వాత ‘కనులు కనులను దోచాయంటే’ మూవీ గౌతమ్ నటనలోని మరో యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఏకంగా పలు భాషల్లో పది సినిమాల వరకూ నటించాడు. ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు గౌతమ్ మీనన్. ఈరోజు (ఫిబ్రవరి 25) గౌతమ్ మీనన్ పుట్టినరోజు. మరి.. మునుముందు గౌతమ్ మీనన్ నటుడిగానే కాకుండా.. దర్శకుడిగానూ తన విలక్షణతను చూపాలని ఆశిద్దాం.

Related Posts