HERO NANI :- “అంటే సుందరానికీ” లైన్ ఇదేనట

నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంటే సుందరానికీ. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. నజ్రియా నజిం నాయికగా నటిస్తోంది. సెకండ్ వేవ్ టైమ్ లో నాని శ్యామ్ సింగరాయ్ లో బిజీగా ఉండటం, అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయిన అంటే సుందరానికీ సినిమా అసలుంటుందా లేదా అనే సందేహాలు కలిగాయి. అయితే సైలెంట్ గా పని చేసుకుంటూ పోయింది టీమ్. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆ వీడియోను టీమ్ మెంబర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

అంటే సుందరానికీ టైటిల్, ఈ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ లో సినిమా ఎలా ఉండబోతుంది అనేది కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఓ బ్రాహ్మణ యువకుడు, మరో మతం అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది సినిమా స్టోరీ లైన్ అని ఫిల్మ్ నగర్ టాక్. ఆచారాలు, సంప్రదాయాలను నిక్కచ్చిగా, నిష్టగా పాటించే బ్రాహ్మణ యువకుడు అమెరికా వెళ్లడం, అక్కడి మోడరన్ కల్చర్ కు ఎలా ఇబ్బందులు పడ్డాడు అనేది ఎంటర్ టైనింగ్ గా చూపించబోతున్నారట. దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో చేసిన బ్రోచేవారెవరురా సినిమా మంచి హిట్ అవడమే కాదు ఇన్నోవేటివ్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. కథల విషయంలో జాగ్రత్తగా ఉంటాడనే పేరున్న నాని అంటే సుందరానికీ కథలో ఉన్న వినోదానికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మన దగ్గర బ్రాహ్మణ హీరో కథలు కొత్త కాదు. ఈ క్యారెక్టర్లతో ఎన్నో కామెడీ యాక్షన్ సినిమాలు తెరకెక్కాయి. కొన్ని మరీ హద్దులు దాటి విమర్శలకు దారి తీశాయి. ఒక టైమ్ లో టాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ట్రెండ్ గా మారిపోయాయి. మధ్యలో బ్రాహ్మణ హీరో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాని అంటే సుందరానికీతో మళ్లీ ఆ ట్రెండ్ ను గుర్తు చేయబోతున్నారు. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని లైనప్ చేసిన చిత్రమిదే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిగిన్ చేయనున్నారు. రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా టీమ్ ఓ క్లారిటీకి రాలేదు.

Related Posts