ధనుష్ సెకండ్ డైరెక్టోరియల్ ‘రాయన్’

వెర్సటైల్ యాక్టర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ఈతరం యువ కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత అతని సొంతం. కేవలం కథానాయకుడుగానే కాకుండా నిర్మాతగానూ 16 సినిమాలను నిర్మించాడు ధనుష్. వీటిలో చాలా వరకూ విజయాలు సాధించినవే. ఇక.. ఈ జనరేషన్ హీరోలెవరూ సాహసించని రీతిలో దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటుకుంటున్నాడు.

తన డైరెక్షన్ లోని డెబ్యూ మూవీ ‘పవర్ పాండి’తో భారీ విజయాన్నందుకున్నాడు ధనుష్. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను తన దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. వీటిలో ధనుష్ ప్రెస్టేజియస్ 50వ సినిమా ఒకటి. ఈ చిత్రానికి ‘రాయన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలాడు ధనుష్. ఈ పోస్టర్ లో చేతిలో పదునైన ఆయుధంతో రక్తంతో తడిచిన చెఫ్‌ డ్రెస్‌ లో సీరియస్‌ గా కనిపిస్తున్నాడు ధనుష్. ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్‌ జయరామ్‌, ఎస్.జె.సూర్య, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఈ చిత్రం నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందట. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ‘రాయన్’ రాబోతుంది. ఈ సినిమాతో పాటు ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’ అనే రొమాంటిక్ డ్రామాను సైతం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడిగా మాత్రమే ధనుష్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ‘డి.ఎన్.ఎస్’ మూవీలోనూ ధనుష్ నటిస్తున్నాడు.

Related Posts