చిరంజీవి అలా చేయ‌డం బాధేసింది. త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్ ను చిరంజీవి, ఆర్.నారాయ‌ణ‌మూర్తి, ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌దిత‌రులు క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోర‌డం.. సీఎం జ‌గ‌న్ సానుకూలంగా స్పందించ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత సినీ పెద్ద‌లు సానుకూలంగా స్పందించిన సీఎం జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. అయితే… సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన వీడియోను రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఆ వీడియోనే ఇప్పుడు వివాద‌స్ప‌దం అయ్యింది.

ఈ వీడియోలో సీఎం జగన్ ను ప్రాధేయపడినట్టుగా చిరంజీవి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇది మెగా బెగ్గింగ్ అంటూ వ‌రుస‌గా ట్వీట్స్ వేయడం వివాద‌స్ప‌దం అయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కూడా చిరంజీవి తన స్థాయిని మరిచి అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్దగా తాము భావిస్తున్నామని… ఆయనకు కూడా ఓ ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు.
సీఎంతో చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసినప్పుడు తనకు చాలా బాధేసిందని తమ్మారెడ్డి అన్నారు. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి యాచించనట్టుగా ఉందని, ఆయన అలా అడగడం చూసి మనం ఇలాంటి దారుణమైన స్టేజ్ లో ఉన్నామా? అని బాధేసిందని చెప్పారు. ఈ భేటీలో కేవలం సినిమా టికెట్ ధరల గురించే తప్ప ఇతర సమస్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు అనిపించడం లేదని అన్నారు. వైజాగ్ లో స్థలాలు ఇస్తామని, ఇండస్ట్రీని అక్కడ అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారని… ఆయన ఇతర సమస్యల పై కూడా స్పందించి ఉంటే అందరం సంతోషించేవాళ్లమని చెప్పారు.

చిరంజీవి వంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అడగడం బాధగా ఉందని చెప్పారు. మనం శాసించే వాళ్లం కాకపోయినా, ట్యాక్సులు కడుతున్నవారమని… మన గౌరవాన్ని కాపాడుకుంటూనే మనం మాట్లాడాలన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఇలా.. త‌మ్మారెడ్డి స్పందించ‌డంతో వివాద‌స్పదం అవుతోంది. మ‌రి… ఈ వివాదం పై సినీ పెద్ద‌లు ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి.

Related Posts