బీస్ట్ మూవీ రివ్యూ

కొన్ని సినిమాలు వస్తున్నాయంటే భాషతో పనిలేకుండా ఎదురుచూసే ఆడియన్స్ ఉంటారు. అలా తెలుగువారిని ఈ మధ్యే ఆకట్టుకున్న తమిళ్ స్టార్ విజయ్. కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథలతో పాటు మన ఆడియన్స్ టేస్ట్ కూ అనుగుణమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు విజయ్. అందుకే మెల్లగా అతని మార్కెట్ పెరుగుతోంది ఇక్కడ. ఈ టైమ్ లో బీస్ట్ గా వస్తున్నాడు అనగానే మనోళ్లలోనూ ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. అంచనాలు పెరిగాయి. దీనికి కారణం కెజీఎఫ్ కు పోటీగా వేయడమే. మరి ఆ అంచనాలను ఈ బీస్ట్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..

కథ :
ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ‘రా’లో పవర్ ఫుల్ ఏజెంట్ వీర రాఘవ(విజయ్). ఓ అంతర్జాతీయ తీవ్రవాదిని పట్టుకునేందుకు ఓ భారీ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. తన టీమ్ చేసిన మిస్టేక్ వల్ల అతనో చిన్న పాప మరణానికి కారణం అవుతాడు. ఆ తీవ్రవాదిని భారత్ కు అప్పగించి.. పాపను చంపిన గిల్టీ ఫీలింగ్ తో రా ను వదిలేస్తాడు. కానీ ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుండగా.. డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అక్కడ పరిచయం అయిన.. ప్రీతి( పూజాహెగ్డే) తో ప్రేమ మొదలవుతుంది. తనే ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పిస్తుంది. ఆ సెక్యూరిటీ గురించి మాట్లాడేందుకు ఓ భారీ మాల్ కు వెళతారు. ఆ మాల్ లో అప్పటికే కొందరు తీవ్రవాదులు ఎంటర్ అయి ఉంటారు. వీర రాఘవ వెళ్లిన తర్వాత అందర్నీ బంధించి తన నాయకుడిని తిరిగి అప్పగించమంటారు. మరి అక్కడే ఉన్న వీర రాఘవ ఆ తీవ్రవాదులను ఎదురించాడా..? లేక ప్రభుత్వ ఒత్తిడికి తలొంచాడా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కథ గురించి ఇంత రాసినా ఇదో చిన్న పాయింట్ అని అర్థమౌతోంది కదా. యస్.. ఈ చిన్న పాయిట్ ను షాపింగ్ మాల్ కు చుట్టి రెండు గంటలకు పైగా సినిమాను అందులోనే నడిపించాడు దర్శకుడు నెల్సన్ దిలీప్. కానీ ఆ ప్లాట్ అంతా ఈ మధ్య కాలంలోనే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మనీ హెయిస్ట్ అనే వెబ్ సిరీస్ కు మక్కీకి మక్కీలా అనిపించడంతో చూస్తోన్న వారిలో చాలామంది నిట్టూరుస్తూనే ఉన్నారు. అది హై ఎండ్ లో ఉంటే.. ఇది లో ప్రొఫైల్ లో ఉంటుంది. కాకపోతే ఈ సారి తీవ్రవాదులు హైజాక్ చేసిన షాపింగ్ మాల్ లో మాజీ రా ఏజెంట్ అయిన హీరో ఉండటంతో వారిని ఎలా కాపాడతాడా అనేది ఆసక్తిగానే చూపించే అవకాశం ఉంది. ఈ విషయంలోనూ ఎక్కువ ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోలేకపోయారు. అయినా విజయ్ తనదైన శైలిలో ఆయా సన్నివేశాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. కథలో సీరియస్ నెస్ లేకపోవడంతో పాటు.. కథనం కూడా నీరసంగా సాగుతుంది. దీంతో ఓ రా ఏజెంట్ సినిమా ఇంత డల్ గా ఉంటుందా అనే భావన వస్తుంది. ఇదే విజయ్ నటించిన తుపాకి కూడా తీవ్రవాదుల నేపథ్యంలో సాగేదే. కానీ ఆ సినిమా ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. బీస్ట్ ఆ చిత్రానికి క్వైట్ అపోజిట్ అంటే నమ్మాల్సిందే.
ఫస్ట్ హాఫ్ ఏదో ఓకే అనుకుంటే సెకండ్ హాఫ్ మరీ కామెడీ అయిపోయింది. హీరో అత్యంత సీరియస్ గా హైజాకర్స్ ను చంపుతుంటే.. ఆ సీరియస్ నెస్ ఆడియన్స్ అస్సలు ఫీల్ కాలేదు. అంత పెద్ద హీరో విషయంలో ఇది పెద్ద మైనస్ గానే చెప్పాలి. అటు హైజాకర్స్ కూడా ఏ మాత్రం సీరియస్ గా కనిపించకపోవడం చూస్తే.. ఇదేదో కథ వినకుండా కమిట్ అయిన సినిమానా అనిపిస్తే అది చూసేవారి తప్పు కాదు. ఇక అయిపోయిందిలే అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా మన హీరో పాకిస్తాన్ కు తీవ్రవాదిగా శిక్షణ తీసుకోవడానికి వెళ్లి ఈ కారణంగానే విడుదల చేసిన నటోరియస్ టెర్రరిస్ట్ ను ఓ బ్యాగ్ లో తెచ్చినట్టుగా తీసుకురావడం చూస్తే పిల్లలు టివిల్లో చూసే కార్టూన్ ఛానల్స్ కాస్త బెటర్ అనిపిస్తాయి.
ఓవరాల్ గా విజయ్ అభిమానులు కూడా పూర్తిగా డిజప్పాయింట్ అయ్యే కంటెంట్ తో వచ్చాడు దర్శకుడు. ఓ స్టార్ హీరో, భారీ బడ్జెట్ ఉన్న నిర్మాత సినిమా అంటే కాస్త కథపై వర్క్ చేయాలన్న ఇంగితం దర్శకుడుకి లేకపోవడం విషాదమే.
ఇక టెక్నీకల్ గా అనిరుద్ సంగీతం సినిమా ఆసాంతం ఒకే ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇదో మైనస్. కేవలం ఫస్ట్ పాట మాత్రమే ఓకే. చివర్లో మరో గ్రూప్ సాంగ్ ఉంది. సో.. ఇక హీరోయిన్ కు ఏ ప్రాధాన్యతా లేదని అర్థమౌతోంది కదా..? మన దగ్గర ఆహా ఓహో అనుకుంటోన్న పూజాహెగ్డేను ఈ చిత్రంలో కరివేపాకు కంటే దారుణంగా తీసి పారేశారు. విశేషం ఏంటంటే.. ఇంత సీరియస్ సినిమా(అనే కదా వాళ్ల ఫీలింగ్)లో ఆ సీరియస్ నెస్ కంటే కామెడీ బాగా వర్కవుట్ అయింది.
సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్ సీక్వెన్స్ బిలో యావరేజ్. ఎడిటింగ్ చాలా వరకూ చేయొచ్చు ఇంకా. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

ఫైనల్ గా : బీస్ట్ .. టైమ్ వేస్ట్ మూవీ.

రేటింగ్ : 1.5/5

– యశ్వంత్ బాబు.

Related Posts