ఈ తమిళ్ స్టార్స్ కు ఏమైంది.. మరీ ఇంత దారుణమా..?

ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళితే.. దక్షిణ భారతంలోని సినిమా పరిశ్రమల్లో ది బెస్ట్ ఏదీ అంటే అన్ని పరిశ్రమలూ కోలీవుడ్ వైపే చూపించారు. అప్పట్లో మళయాలం నుంచి మరీ ఇంత గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు రాలేదనే చెప్పాలి. అందుకే కోలీవుడ్ చిత్రాలపై చాలామంది ఎక్కువ మక్కువ చూపించారు. అదే టైమ్ లో తెలుగులో మాత్రం అయితే ఫ్యాక్షన్ లేదంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్.. కాదంటే కంప్లీట్ యాక్షన్ మూవీస్ అంటూ రొటీన్ రొడ్డకొట్టుడు చిత్రాలే వచ్చాయి. వీటిలో సక్సెస్ కంటే ఫ్లాపులు, డిజాస్టర్లే ఎక్కువ. దీంతో కోలీవుడ్ చిత్రాలు తెలుగులో వరుసగా డబ్ అయ్యి ఇక్కడ మన సినిమాలకంటే ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ గా నిలిచేవి. ఆ కాలంలో వచ్చిన సినిమాలతోనే విక్రమ్, సూర్య వంటి వారు మన దగ్గర పెద్ద మార్కెట్ సెట్ చేసుకున్నారు. అలాంటి కోలీవుడ్ కొన్నాళ్లుగా పూర్తిగా టచ్ కోల్పోయిందనే చెప్పాలి.

కాస్త ఇబ్బందిగా ఉన్నా.. ఒకప్పుడు వైవిధ్యమైన కథలు, కంటెంట్ తో ఆకట్టుకున్న కోలీవుడ్ ఇప్పుడు 80,90ల్లో వచ్చిన కథలతో ఇరిటేట్ చేస్తోంది. విశేషమో, విచిత్రమో కానీ.. ఇప్పుడీ కథా బలం లేని సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ సినిమాలన్నీ విమర్శకులకు అస్సలు నచ్చడం లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. చాలా వెనక్కి కూడా అక్కర్లేదు. ఈ మధ్య కాలంలోనే వచ్చిన.. విజయ్ సినిమాలు చూస్తే విజిల్ రొటీన్ కథే. కానీ 200 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన మాస్టర్ అయితే మరీ స్లో నెరేషన్ తో హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ ను సాధారణంగా చూపించింది. అయినా మాస్టర్ బ్లాక్ బస్టర్ అక్కడ.
ఇక మన దగ్గర డిజాస్టర్స్ అనిపించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట, దర్బార్ సినిమాలు వంద కోట్లు కొల్లగొట్టాయి. చాలామందికి ఆశ్చర్యం కలిగించినా అస్సలే మాత్రం కంటెంట్ లేని ఈ చిత్రాలు కలెక్షన్స్ సాధించడమేంటనేది విశ్లేషకులకూ అర్థం కావడం లేదు. దారుణం ఏంటంటే.. ఎప్పుడో 80ల నాటి కథాంశంతో వచ్చిన అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) మరీ దారుణం అనిపించుకుంది. అయినా ఈ మూవీకీ కలెక్షన్స్ కురిపించడం అంతుబట్టడం లేదు.
రీసెంట్ గానే వచ్చిన అజిత్ నటించిన వలిమైకి మనోళ్లు ఒకటి, ఒకటిన్నర రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఈ చిత్రం అక్కడ ఏకంగా 230కోట్లు కలెక్ట్ చేసింది. యస్ తెలుగులో చూసిన వారికి కేవలం తమిళ్ లోనే ఈ చిత్రం ఆ కలెక్షన్స్ సాధించిందంటే.. నమ్మశక్యం కాదు. ఒకవేళ వాళ్లు అబద్ధం చెబుతున్నారన్నా.. ఓ యాభై కోట్లు తగ్గించినా భారీ కలెక్షన్స్ అన్నట్టే కదా..
ఇక ఇప్పుడు విడుదలైన బీస్ట్ దీ అదే పరిస్థితి. విమర్శకులంతా ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో తిడుతున్నారు. అయినా ఈజీగా 150కోట్ల మార్క్ ను చేరుతుందంటున్నారు. అది కూడా కెజీఎఫ్ దాడిని దాటుకుని అంటున్నారు. ఇక ఇప్పటి వరకూ చెప్పుకున్న రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు సాధించిన కలెక్షన్స్ చూస్తే ఈ ఫిగర్ నిజమైనా ఆశ్చర్యం లేదు.
మొత్తంగా తమిళ్ ప్రేక్షకుల టేస్ట్ కు ఏమైందీ..? అంటూ సౌత్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. కాకపోతే మధ్యలో కొన్ని చిన్న సినిమాలు మెప్పిస్తున్నాయి. కానీ స్టార్ హీరోలు కథా బలం లేని సినిమాలతో రావడం.. అవి కమర్షియల్ గా విజయాలు సాధించడం చూస్తే తమిళ్ ప్రేక్షకుల టేస్ట్ దారుణంగా పడిపోయిందనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. సో.. త్వరలోనే వాళ్లు ఒకప్పుడు మనలాగా తెలుగులో వస్తోన్న మంచి సినిమాలు అక్కడ డబ్ చేసుకుంటారేమో..

Related Posts