అతిథిదేవోభ‌వ – రివ్యూ

ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి జంట‌గా న‌టించిన చిత్రం అతిథిదేవోభ‌వ‌. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ విభిన్న క‌థా చిత్రం ఈరోజు విడుద‌లైంది. ఆర్ఆర్ఆర్ రావాల్సిన డేట్ కి అతిథిదేవోభ‌వ వ‌చ్చింది. మ‌రి.. ఆదికి ఈ సినిమా విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

క‌థ

అభయ్ (ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే మోనో ఫోబియా అనే సమస్య వస్తోంది. మోనో ఫోబియా అంటే ఒంటరితనం భరించలేరు. ప్ర‌తి క్ష‌ణం ఎవ‌రో ఒక‌రు తోడుగా ఉండాల్సిందే. ఓంట‌రిత‌నాన్ని భ‌రించ‌లేని అభ‌య్ ఓసారి చనిపోవడానికి కూడా సిద్ధపడతాడు. అలాంటి అభ‌య్ వైష్ణ‌వి (నువేక్ష‌) చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. వైష్ణ‌వి కూడా అభ‌య్ ని ప్రేమిస్తుంది. అయితే.. వీరిద్ద‌రి ప్రేమ‌కు ఈ మోనో ఫోబియా పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. వైష్ణ‌వికి చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆమెకు ఏమీ చెప్ప‌డు. చివ‌రికి వైష్ణ‌వ్ కి అభయ్ త‌న స‌మ‌స్య గురించి చెప్పాడా..? లేదా..? త‌నే తెలుసుకుందా..? అస‌లు విష‌యం తెలిసి వైష్ణ‌వ్ ఎలా రియాక్ట్ అయ్యింది? చివ‌ర‌కు ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

బ‌ల‌హీన‌మైన క‌థ‌
ప‌ట్టులేని క‌థ‌నం

విశ్లేష‌ణ

ఆది సాయికుమార్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా బాగానే న‌టించాడు. పాత్ర‌లో వేరియేష‌న్స్ ఉండ‌డంతో ఆది చాలా ఫ్రెష్ గా క‌నిపించాడు. ముఖ్యంగా భ‌యంతో వ‌ణికిపోయే సీన్స్ లో ప‌ర్ ఫెక్ట్ అనేలా న‌టించాడు. నువేక్ష‌ చాలా చక్కగా నటించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించింది. అలాగే తల్లిగా నటించిన రోహిణి, మరో కీలక పాత్రలో నటించిన స‌ప్త‌గిరి ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పాత్ర‌ల ప‌రిథి మేర‌కు న‌టించారు.

ఈ చిత్రానికి వేణుగోపాల్ కథను అందించగా, రజనీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకర్చారు. సంభాషణలు సహజంగా ఉన్నాయి. అమర్ నాథ్‌ బొమ్మిరెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. అలానే శేఖర్ చంద్ర సంగీతం కూడా బాగుంది. పాయింట్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ద‌ర్శ‌కుడు ప‌ట్టుస‌డ‌ల‌ని క‌థ‌నం రాసుకోక‌పోవ‌డం మైన‌స్ అని చెప్ప‌చ్చు. సినిమా చూస్తుంటే.. అలా వెళ్లిపోతుంది త‌ప్పా.. ఎక్క‌డా కూడా నెక్ట్స్ సీన్ లో ఏం జ‌రుగుతుందో అనే ఆస‌క్తిని క‌లిగించ‌లేక‌పోయాడు.

నిడివి కాస్త త‌గ్గించి.. మ‌రి కాస్త క‌థ పై క‌స‌ర‌త్తు చేసుంటే.. బాగుండేది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అతిథిదేవోభ‌వ‌.. టైమ్ పాస్ చేయాలంటే చూడ‌చ్చు.

రేటింగ్ 2.5/5

Related Posts