తెలుగు సినిమాని సుసంపన్నం చేసిన నటులు

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో హాస్యనటులు ఉన్నారు. ప్రతి దశాబ్ధంలోనూ కొత్తగా ఎంతోమంది వచ్చారు.. వస్తున్నారు. అలాంటి హాస్యనటుల్లో అగ్ర గణ్యులు ఏవియస్, ఆహుతి ప్రసాద్. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే అర్థాంతరంగా తనువు చాలించిన ఈ ఇద్దరు హాస్యనటులు ఒకేరోజు పుట్టడం విశేషం. ఈరోజు (జనవరి 2) ఏవియస్, ఆహుతి ప్రసాద్ ల జయంతి.

ఏవియస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం.. షార్ట్ కట్ లో కూడా అందంగా కుదిరిన పేరది. పుట్టింది తెనాలిలో. చదువు తర్వాత జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగంతో పాటు వేదికలపై హాస్యవల్లరి, నాటకాలు అంటూ అదనంగా నవ్వించేవారు. అదే ఆయన్ని వెండితెరకు పరిచయం చేసింది. దర్శకుడు బాపు కోసం హైదరాబాద్ పంపబడిన ఆ జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం.. ఆనక ‘మిస్టర్ పెళ్లాం‘తో ఏవియస్ గా ఎన్నో నవ్వులకు చిరునామాలా మారారు.

ఏవియస్ కు ఉన్న స్పెషాలిటీ.. మేనరిజమ్స్. తను చూసిన.. సమాజంలో కనిపించిన కొన్ని పాత్రలను సులువుగా ఇమిటేట్ చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగా ఏ పాత్రలోకైనా ఇట్టే ఇమిడిపోయేవారు. అప్పుడప్పుడూ విలనీ చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇదీ ఓ కారణంగా చెప్పొచ్చు. ఇక ‘మిస్టర్ పెళ్లాం‘ కమెడియన్ గా గుర్తింపు తెస్తే శుభలగ్నంలో మీ ఇంట్లో పిల్లి ఉందా.. ఆడదా మగదా.. అంటూ కురిపించిన ప్రశ్నల పరంపర పాత్ర ఏవియస్ ను స్టార్ కమెడియన్ గా మార్చింది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఏవియస్ లాంటి హాస్య నటులు అత్యంత అరుదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకాల నుంచి మొదలై జర్నలిస్ట్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, రాజకీయాల్లోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమా నటుడుగా ఓ రేంజ్ కు వెళ్లారు. దర్శక నిర్మాతగానూ తన ప్రతిభను చూపించారు. ఏదేమైనా ఆయన లేకున్నా ఆయన పంచిన నవ్వులు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి.

ఇక ఆహుతి ప్రసాద్ గా మాత్రమే జనానికి తెలిసిన అడుసుమిల్లి జనార్ధన ప్రసాద్ ది కృష్ణాజిల్లా కోడూరు. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. తొలి చిత్రంతోనే ఆడియన్స్ మీద ఇంపాక్ట్ వేసిన ఆర్టిసులనే ఆ అదృష్టం వరిస్తుంది. ఆహుతి ప్రసాద్ కూడా ఈ కేటగిరీలోకి వచ్చిన నటుడే. ఎంట్రీ ఇచ్చింది విలన్ గానే అయినా…కారక్టర్ ఆర్టిస్టుగా తను వేసిన ముద్ర చాలా పెద్దది. ఆయన వేసిన కారక్టర్లలో అత్యధికం హీరోయిన్ ఫాదర్ రోల్సే.

‘ఆహుతి‘ సినిమాలో ప్రసాద్ పెర్ఫామెన్స్ చూసిన ఇండస్ట్రీ ఓ బలమైన విలన్ దొరికాడనుకుని సంబరపడింది. సరిగ్గా అలాంటి సయమంలో దొరికిందే ‘నిన్నే పెళ్లాడతా‘లో టబు తండ్రి పాత్ర. ఇక ఆ తర్వాత వరుసగా తండ్రి పాత్రలు క్యూ కట్టేశాయి. దీంతో పాటు పోలీసు పాత్రలు కూడా ఆహుతి ప్రసాద్ ను బిజీ చేసేశాయి. తెలుగు సినిమా చరిత్రలో కానిస్టేబుల్ నుంచి ఐ.జి వరకు అన్ని రకాల పోలీసు పాత్రలూ చేసింది బహుశా ఆహుతి ప్రసాదేనేమో.

‘చందమామ‘లో ఆహుతి ప్రసాద్ చేసిన క్యారక్టర్ తను తప్ప ఇంకెవరేసినా ఆ రేంజ్ లో పండేది కాదు. విలాసాల కోసం.. యావదాస్తినీ నాశనం చేసేసిన షోకిల్లా రాయుడిగా గొప్పగా నటించేశారు. గోదావరి జిల్లా భాషే కాదు.. అక్కడ కనిపించే కొన్ని టిపికల్ లక్షణాలు ఆహుతి ప్రసాద్ లో అద్భుతంగా పలుకుతాయి. భోళాగా ఉండడం.. మా ఇంటికొస్తే.. భోంచేయకుండా వదుల్తామేంటనే టైప్ కారక్టర్ తో ‘బెండు అప్పారావు‘ మూవీలో ప్రసాద్ జీవించేశారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ తో మరణించారు ఆహుతి ప్రసాద్.

Related Posts