ఒకప్పటి బ్లాక్ బస్టర్ అభినందనలో ఫస్ట్ హీరో హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

అభినందన.. 1988లో విడుదలైన సినిమా. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ చిత్రం. కార్తీక్, శోభన జంటగా శరత్ బాబు, రాజ్యలక్ష్మి, జెవి సోమయాజులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులున్నారు. సినిమాటోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో సత్తా చాటిన అశోక్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అభినందన. దర్శకుడుగా ఆయనకు ఇది మూడో సినిమా. కథగా చెబితే సింపుల్ గా కార్తీక్, శోభన ప్రేమించుకుంటారు. శోభనకు ఓ అక్క ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. వీరి ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా శోభన సిస్టర్ చనిపోతుంది. ఆ పిల్లల కోసం ఆమె బావనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ప్రేయసి దూరమైన కార్తీక్ తన ప్రొఫెషన్(పెయింటింగ్, సింగింగ్)ను వదిలేసి పిచ్చోడైపోతాడు. శరత్ బాబుకు ఓ ఆడియో రికార్డింగ్ కంపెనీ ఉంటుంది. ఓ సారి విరహంతో పాడుతోన్న కార్తీక్ ను చూసి తన ఇంటికి తీసుకువెళ్లి అతనితో పాటలు రికార్డింగ్ చేయించాలనుకుంటాడు. అక్కడికి వెళ్లాక అది తన ప్రేయసి ఇల్లే అని తెలుస్తుంది. కొంతకాలం తర్వాత శరత్ బాబుకు వీరు గతంలో ప్రేమించుకుని ఉన్నారని అర్థమౌతుంది. దీంతో ఆ ఇద్దరినీ కలిపేందుకు తను ప్రాణ త్యాగం చేస్తాడు. ఇదీ కథ. కానీ కథనం ఆకట్టుకుంటుంది. అంతకు మించి ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్ కు సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. మరి ఇలాంటి ప్యూర్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీలో మొదట అనుకున్న జంట ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి.. యస్.. అభినందన సినిమాలో ముందుగా అనుకున్నది చిరంజీవి, శ్రీదేవిలనే. అప్పటి వరకూ మాస్ మసాలా సినిమాలు చేస్తూ వెళుతోన్న చిరంజీవికి ఈ కథ గురించి తెలిసింది. అశోక్ కుమార్ ను పిలిపించి కథ విన్నాడు. బాగా నచ్చింది. కానీ అప్పుడు తను చాలా అంటే చాలా బిజీ. ఆ బిజీలో ఈ మూవీకి డేట్స్ ఇవ్వడానికి కొంత టైమ్ అడిగాడు. నిర్మాత ఆర్వీ రమణమూర్తి ఓకే అన్నాడు. అలాగే ఆ కథను శ్రీదేవికీ చెప్పి ఒప్పించారు. చిరంజీవి సరసన అనేసరికి తనూ వెంటనే యస్ చెప్పింది. కానీ ఇద్దరూ చాలా బిజీగా ఉండటంతో అనుకున్న టైమ్ కంటే యేడాది ఆలస్యం అయింది. యేడాది తర్వాత కూడా చిరంజీవి మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ చేసే స్థితిలో లేడు. అటు శ్రీదేవి ఓకే. కానీ చిరంజీవితో అయితేనే చేస్తాను అంటోంది తను. దీంతో ఇక మరీ ఎక్కువ కాలం ఆగడం మంచిది కాదని.. నిర్మాత కొత్తవారికోసం ప్రయత్నించాడు. దర్శకుడు తమిళ్ లో సినిమాటోగ్రాఫర్ గా ఎక్కువ సినిమా చేసి ఉండటంతో అప్పుప్పుడే తనదైన ముద్ర వేస్తోన్న కార్తీక్ గురించి చెప్పాడు. అతను నటించిన కొన్ని సినిమాలు చూసిన తర్వాత నిర్మాత ఓకే చెప్పాడు. అటు మళయాలంలో నటిగా ప్రూవ్ చేసుకుంటోన్న శోభనను ఓకే అనుకున్నారు. ఈ ఇద్దరూ కొత్తవాళ్లే. పైగా వేరే భాషలో సినిమా కాబట్టి వెంటనే యస్ అన్నారు. దీనికి తోడు ఇద్దరి జంటగా అద్భుతంగా కుదిరింది. అలా అభినందన కథలోకి అసలు ఎవరూ ఊహించని కార్తీక్, శోభన వచ్చి చేరారు.
ఈ విషయం చిరంజీవికి తెలిసి కొన్నాళ్లు ఆగమన్నా నిర్మాత ఆగలేదు. మొత్తంగా మాస్ మూవీ నుంచి ఓ రిలీఫ్ లా ఈ ప్రేమకథ చేయాలనుకున్న మెగాస్టార్ కు కోరిక తీరలేదు. అటు కథ నచ్చినా చిరంజీవితో మాత్రమే అనే కండీషన్ పెట్టుకున్న శ్రీదేవి కూడా ఓ అద్భుతమైన సినిమాను మిస్ అయింది. అదీ మేటర్. అలా చిరంజీవి, శ్రీదేవి చేయాల్సిన అభినందన.. కార్తీక్ శోభన చేసినా.. కథలో ఉన్న కొత్తదనం వల్ల ప్రేక్షకుల అభినందనలూ అందుకుని అద్భుత విజయం సాధించిందన్నమాట.

Related Posts