ఆ సీక్వెల్స్ పై క్రేజ్ మామూలుగా లేదు

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఒరవడిని ఫాలో అవుతున్నారు మేకర్స్. అయితే.. ఇప్పటికే ఒక సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన ప్రాజెక్ట్స్ విషయంలో.. వాటి సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎక్కువగా ప్రచారం లేకుండానే ఆ సినిమాలకు వస్తోన్న హైప్ అంతా ఇంతా కాదు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘పుష్ప 2’.

ఫస్ట్ పార్ట్ హిట్టైతే.. రెండో పార్ట్ అంతకుమించి హిట్టైన సందర్భాలను ‘బాహుబలి 2, కె.జి.ఎఫ్ 2’ విషయంలో చూశాము. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలోనూ అదే జరుగుతుందనే అంచనాలున్నాయి. అందుకే.. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే రెండు, మూడు రెట్లు భారీతనంతో తీర్చిదిద్దుతున్నాడట క్రియేటివ్ జీనియస్ సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చింది ‘పుష్ప’ క్యారెక్టర్. అలాగే ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని.. దశాబ్దాల తెలుగు హీరోల కలను కూడా నెరవేర్చాడు బన్నీ. ‘పుష్ప 2’ ఈ ఏడాది ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మళ్లీ రెబెలియస్ అవతార్ లో చూపించి.. రెబెల్ స్టార్ గా మార్చింది ‘సలార్’. కల్ట్ సెన్సేషనల్ హిట్టైన ‘సలార్’కి సెకండ్ పార్ట్ ఉంది. 2025లోనే ఈ సినిమాని తీసుకుచ్చే దిశగా సన్నాహాలు చేస్తోంది టీమ్. ‘సలార్ 1.. సీజ్ ఫైర్’కి మించిన రీతిలో ‘సలార్’ సెకండ్ పార్ట్ ఉండబోతుందనేది ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే విషయమే. అసలు కథంతగా సెకండ్ పార్ట్ లోనే ఉంది. ఇక.. ఇదే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి బోనస్ గా మరో సీక్వెల్ మూవీ ఉంది. అదే ‘కె.జి.యఫ్ 3’. ఆ చిత్రాన్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నాడట ప్రశాంత్ నీల్.

లేటెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ ‘హనుమాన్’కి కూడా 2025లోనే సీక్వెల్ వస్తోందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘జై హనుమాన్’ టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో శ్రీరాముడుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తాడనే ప్రచారం కూడా జరుగుతుంది. మొదటి పార్ట్ విషయంలో బడ్జెట్ సమస్యలున్నాయి. అయితే.. ఇప్పుడు ‘హనుమాన్’ సీక్వెల్ విషయంలో అలాంటి పట్టింపులు ఉండే అవకాశం లేదు. ఈసారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన క్రియేటివిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది. మొదటి భాగానికి మించిన రీతిలో హై విజువల్ ఫీస్ట్ అందించేలా ‘జై హనుమాన్’ని తీర్చిదిద్దుతాడనే ప్రచారం జరుగుతుంది.

కన్నడ నుంచి సంచలన విజయం సాధించిన ‘కాంతార’ చిత్రానికి కూడా ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందుతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ఏడు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈసారి ‘కాంతార’ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి.

ఇంకా.. తెలుగు నుంచి రాబోతున్న ‘గూఢచారి 2’ కూడా ఇలాంటి క్రేజీ సీక్వెల్స్ లో ఉంది. తమిళం నుంచి వచ్చే కమల్ హాసన్ ‘విక్రమ్ 2’, కార్తీ ‘ఖైదీ 2’ వంటి సీక్వెల్స్ పైనే క్రేజ్ మామూలుగా లేదు.

Related Posts