Featured

స్వరఝరీ… సుమధుర వాణి కీరవాణి

కీరవాణి .. పేరులోనే రాగాన్ని ఇముడ్చుకున్న స్వరఝరీ. భద్రగిరి రామయ్య పాదాలు కడిగి.. ప్రతి శ్రోత మదినీ తడిమి..తనదైన మధుర బాణీల్లో ఓలలాడిస్తోన్న సుమధుర వాణి కీరవాణి. రాగాలతో సరాగాలాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం కీరవాణికి కీ బోర్డ్ తో పెట్టిన విద్య. అన్నమయ్యను మరిపించి.. రామదాసులా రాముణ్నే రంజింపజేసి.. రాఘవేంద్రుని రసభరిత సినిమాలకు సప్తస్వరాలను అద్ది.. ప్రస్తుతం రాజమౌళితో సురాగయానం సాగిస్తూ అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ ను అందుకుని భారతీయుల హృదయాల్లో పులకింతలు పెట్టిన కీరవాణి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా కీరవాణికి బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన సినీ స్వర ప్రస్థానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..


కీరవాణి స్వరరచనకు మురిసిపోయిన సాహిత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇళయరాజా హవా నడుస్తోన్న టైమ్ లో అడుగుపెట్టి.. ఆ హవాను తనవైపు తిప్పుకున్న ప్రతిభాశాలి కీరవాణి. కె వి మహదేవన్, ఇళయరాజా వంటి వారితో సంగీతం చేయించుకున్న కె విశ్వనాథ్ కూడా కీరవాణి బాణీలకు ముగ్దుడైపోయాడంటే ఇంక చెప్పేదేముందీ. ఆర్ద్రత నుంచి అల్లరి వరకూ.. రక్తి నుంచి భక్తి వరకూ తెలుగు సినిమాకు అన్ని రకాల బాణీలను అద్ది ఎందరో రచయితల సాహిత్యాన్ని ఎవర్ గ్రీన్ చేసిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. కీరవాణి సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టేనాటికి అప్పటి వరకూ చిత్రపరిశ్రమను ఏలిన కెవి మహదేవన్ లాంటి వారు నిష్ర్కమణ దశలో ఉన్నారు. ఇళయరాజా పీక్స్ లో ఉన్నాడు.. దీంతో ఒక సాలూరిలా, ఒక చక్రవర్తిలా మనదైన సంగీతం అందించేందుకు మనవాళ్లెవరూ లేరే అన్న ఫీలింగ్ చాలామందిలో ఉన్న టైమ్ అది. అఫ్ కోర్స్ అప్పటికి రాజ్ కోటి ఉన్నారు. అయినా ఏదో లోటు. ఆ సమయంలోనే నేనున్నానంటూ వచ్చాడు కీరవాణి. చాలా తక్కువ టైమ్ లోనే తన ముద్రను చూపిస్తూ.. తెలుగు సినిమా పాటకు దిక్సూచిగా మారాడు కీరవాణి..


1987లో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పటి మాస్ సినిమాల సంగీత సంచలనం చక్రవర్తి వద్ద శిష్యరికం మొదలు పెట్టాడు కీరవాణి. మూడేళ్ల తర్వాత 1990లో కల్కి అనే సినిమాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు.. ఆ తర్వాత దర్శకుడు మౌళి ఆఫర్ ఇచ్చాడు. ఉషాకిరణ్ బ్యానర్ లో రూపొందిన మనసు మమతతో కీరవాణి స్వర ప్రయాణం ప్రారంభమైంది.. ఆ ప్రయాణం ఎన్నో బ్లాక్ బస్టర్ మజిలీలతో నేటికీ కొనసాగుతూనే ఉంది. ఏ ప్రతిభావంతుడికైనా అవకాశం రావడం ప్రధానం. దాన్ని అందరూ అదృష్టం అంటారు. ఆ అదృష్టం రాగానే తన ప్రతిభతో ప్రేక్షకులను పాటల తోటలో విహరింప చేశాడు కీరవాణి. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన యేడాదే ఐదు సినిమాలు చేశాడు. వీటిలో అతని కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజికల్ హిట్స్ లో ఒకటిగా చెప్పుకునే సీతారామయ్యగారి మనవరాలూ ఉంది.. సీతారామయ్యగారి మనవరాలు కీరవాణికి పెద్ద బ్రేక్ ఇచ్చింది.. ఈ సినిమాతో అతను తెలుగు సినిమా సంగీతంపై తనదైన ముద్రను బలంగా వేశాడనే చెప్పాలి.


రెండేళ్లలోనే అచ్చ తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.. కానీ బంపర్ హిట్స్ అంటూ పెద్దగా లేవనే చెప్పాలి. పైగా అటువైపు ఇళయరాజా దూకుడుమీదున్నాడు.. మరోవైపు రాజ్ కోటి ఆకట్టుకుంటూనే ఉన్నారు. మొత్తంగా అప్పటికి మంచి పేరు వచ్చింది కానీ, అనుకున్నంత కాదు. ఆ టైమ్ లో రాఘవేంద్రరావు పరిచయం కీరవాణి స్వరఝరీని మార్చివేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వలో చేసిన ఘరానామొగుడు కీరవాణికి తిరుగులేని ఇమేజ్ నిచ్చింది.

ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన సంగీతాన్నందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 1992లో మొత్తంగా 14 సినిమాలకు సంగీతం అందించాడు కీరవాణి.. వీటిలో మూడోది ఘరానామొగుడు.. ఘరానా మొగుడు తర్వాతే ఆ మిగతా సినిమాలన్నీ రావడం విశేషం.. సుందరకాండ, అల్లరి మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం… చిన్నఅల్లుడు, రౌడీ మొగుడు.. ఇలా చేసిన సినిమాలన్నీ ఇటు మ్యూజికల్ గానూ అటు కమర్షియల్ గానూ సూపర్ హిట్స్ గా నిలిచాయి.. ముఖ్యంగా రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ బంపర్ హిట్ అయింది..

అయితే ఇదే యేడాది చేసిన మరో ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ మూవీ ఆపద్బాంధవుడు.. అప్పటి వరకూ తన సినిమాలకు కెవి మహదేవన్ తో మాత్రమే సంగీతం చేయించుకున్న విశ్వనాథ్ తొలిసారిగా కీరవాణిని తీసుకున్నాడు.. ఆ సెలక్షన్ ఏ మాత్రం తప్పు కాదని.. మనం ఇప్పుడు వింటున్నా మైమరచిపోయేలా కంపోజ్ చేసిన ఆ పాటలే నిదర్శనం..


ఇక అప్పటి నుంచి కీరవాణి కొట్టిందల్లా హిట్ అయింది. ఇళయరాజా తర్వాత మెలోడీకి కొత్తబాణీలేస్తూ పోయాడు.. కీరవాణి వేగానికి అప్పటి వరకూ మాస్ సాంగ్స్ తో టాలీవుడ్ ను ఊపేస్తోన్న రాజ్ కోటిల ద్వయం కూడా వెనకబడక తప్పలేదు.. అదే ఊపులో మాతృదేవోభవ సినిమాకు ఆయనే పాడిన పాటకు ఉత్తమ గేయరచయితగా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు..ఘరానామొగుడు తర్వాత దాదాపు దశాబ్ధం పాటు కీరవాణి తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడు.. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో చేసిన సినిమాలన్నీ ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ గానే నిలిచాయి.. ఇదే టైమ్ లో మరోసారి విశ్వనాథ్ డైరెక్షన్ లో శుభసంకల్పం సినిమాతో రెచ్చిపోయాడు.. ఇందులోని అన్ని పాటలూ సూపర్ హిట్టే..


కీరవాణి కెరీర్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు లెక్కేలేదు.. అయినా రాఘవేంద్రరావుతో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అనేలా 1997లో వచ్చిన అన్నమయ్య నిరూపించింది. అప్పటి వరకూ అన్ని రకాల సినిమాలు చేసినా డివోషనల్ విషయంలో కీరవాణి ప్రతిభేంటో పెద్దగా తెలియదు.. అన్నమయ్య తర్వాత కీరవాణి సంగీతంపై ఎంతో మందికి గౌరవమూ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.. ఇందులో కొన్ని అన్నమయ్య కీర్తనలున్నా.. వాటికీ తనశైలిలో అద్భుతమైన రాగాలు కూర్చాడు. వాటిని కన్నుల విందుగా తెరకెక్కించాడు రాఘవేంద్రుడు.. అన్నమయ్యకు కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డూ అందుకున్నాడు.. అన్నమయ్య కంటే ముందు వీరి కాంబినేషన్ లో పెళ్లిసందడి, సాహసవీరుడు సాగరకన్య, బొంబాయి ప్రియుడు లాంటి మ్యూజికల్ హిట్స్ చాలానే ఉన్నాయి.. కీరవాణి మధురబాణీలకు అటు రాఘవేంద్రరావు తనశైలిలో రసకందాయంగా చిత్రీకరించాడు.. కానీ అన్నమయ్య లో అలా కాదు.. కాస్త శృంగార రసం ఉన్నా రాఘవేంద్రరావుకూ అందకుండా తన సంగీతంతో భక్తిభావాన్ని తెరంతా నింపేశాడు కీరవాణి..


2000ల తర్వాత తెలుగు తెరపై కొత్త సంగీత కెరటాలు చాలానే లేచాయి.. అయినా వారిలో ఎవ్వరూ కీరవాణిని అందుకోలేకపోయారనేది సత్యం.. ఇటు కీరవాణి కూడా కాస్త స్పీడ్ తగ్గించాడు.. అయినా అతనికి రాఘవేంద్రరావు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రాజమౌళి రూపంలో మరో అస్త్రం తోడైంది.. ఇద్దరూ బంధువులు కూడా కావడంతో వీరికి బాగా సింక్ అయింది. ముఖ్యంగా రాజమౌళి తరహా భావోద్వేగాలకు కీరవాణి అందించే ఆర్ ఆర్ ఆయా సన్నివేశాలను శిఖర స్థాయిలో ఎలివేట్ చేస్తూ వస్తోంది.. ఇక అటు రాఘవేంద్రరావు వందో సినిమా అల్లు అర్జున్ తొలి సినిమాగా వచ్చిన గంగోత్రితో మరోసారి వీరి జంట ప్రేక్షకులకు శ్రవణానందం కలిగించింది. గంగోత్రిలోని పాటలన్నీ సూపర్ హిట్సే కదా.. అలాగే మళ్లీ ఈ రసరాఘవేంద్రుడు చేసిన భక్తి చిత్రం రామదాసుతో మళ్లీ ఓ అద్భుత సంగీతం ఆవిర్భవించింది.. తర్వాత పాండురంగడుతోనూ పాటలతో అదరగొట్టాడు కీరవాణి..


కొన్నేళ్లుగా సెలెక్టెడ్ సినిమాలే చేస్తోన్న కీరవాణి.. రాజమౌళితో బంధాన్ని వదల్లేదు.. మగధీర తర్వాత ఆడియో పరంగా చాలా సినిమాలు హిట్ అయినా.. కమర్షియల్ గా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కీరవాణి సంగీతం కూడా కాస్త వెనకబడింది.. మరోవైపు రాజమౌళికి మాత్రమే మంచి సంగీతం ఇస్తాడు అనే విమర్శలూ రాకపోలేదు.. దీనికి ఆయన సమాధానం..” తెలిసిన వారికి సంగీతం ఇవ్వడం సులువు కదా.. సంగీతం గురించి ఏమీ తెలియని వారికి ఏ సంగీతం ఇవ్వాలో మనకెలా అర్థమౌతుంది..” కాస్త అసంబద్ధంగా ఉన్నా.. ఇది ఆయన వెర్షన్. తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలిసిన వారికి కీరవాణి ఎలాంటి సంగీతం ఇస్తాడో అందరికీ తెలుసు.. అందుకు రాజన్న సినిమా మరో ఉదాహరణ.. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకూ ఇందులోని పాటలను ఎంత ఇష్టపడ్డారో అందరికీ తెలిసిందే.. అంటే సంగీతం పై అవగాహన ఉన్న వారికి కీరవాణి నుంచి సంగీతం పూర్తి స్థాయిలో వస్తుందన్నమాట..


బాహుబలి సంగీతంతో కీరవాణి ప్రతిభ ఎల్లలు దాటింది. సినిమాకెంత పేరు వచ్చిందో ఆయన సంగీతానికీ అంతే పేరొచ్చింది. కీరవాణి సంగీతం లేని బాహుబలిని ఊహించలేం అన్నంతగా ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు. రాజమౌళికి ఏం కావాలో.. ఆయనకంటే బాగా తెలిసినవాడిలా కీరవాణి బాహుబలి సంగీతంతో ఒక్కసారిగా ఎన్నో శిఖరాలకు చేరాడు.

బాహుబలి తర్వాత సినిమా సంగీతం నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశాడు. కానీ అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. కొన్ని చిన్న సినిమాలూ చేశాడు. అలాగే బాహుబలి ద కంక్లూషన్ తో మరోసారి ఆకాశమంత ఎదిగాడు. ఈ సినిమాలో ప్రతి బీట్, ప్రతి సాంగ్ ఓ అద్భుతం. ఫస్ట్ పార్ట్ ను మించిన మ్యాజిక్ ఏదో ఈ భాగంలో చేశాడు. అందుకే ఈ కంక్లూషన్ పార్ట్ బిగినెంట్ పార్ట్ కంటే బిగ్గెస్ట్ హిట్ అయింది.


రాజమౌళి డైరెక్షన్ లోనే రూపొందిన ఆర్ఆర్ఆర్ అతని ప్రతిభను శిఖరాగ్రంలో నిలిపింది. పాటలు బాహుబలి రేంజ్ లో లేకపోయినా.. ఈ చిత్రానికి వచ్చిన అప్లాజ్ అనంతమైనది.కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఏకంగా ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఆస్కార్ ను అందుకుని తన ప్రతిభను ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. ఈ పురస్కారంతో ప్రతి తెలుగువాడిదే కాదు.. మొత్తం భారతీయుల హృదయం పులకించిపోయింది. మొత్తంగా కీరవాణి అంటే తెలుగు సినిమా సంగీతానికి దొరికిన ఓ మరకతమణి. ఆ మణి పూసలు మరిన్ని మన సినిమాకు అందించాలని కోరుకుంటూ కీరవాణికి తెలుగు 70 ఎమ్ఎమ్ తరఫున మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

                    - బాబురావు. కామళ్ల
Telugu 70mm

Recent Posts

‘సత్య‘ మూవీ రివ్యూ

నటీనటులు: హమరేష్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులుసినిమాటోగ్రఫి: ఐ. మరుదనాయగంసంగీతం: సుందరమూర్తి కె.యస్ఎడిటింగ్‌: ఆర్‌.సత్యనారాయణనిర్మాత: శివ…

28 mins ago

The teaser of ‘MaayaOne’ in trending

'Project Z' is one of Sandeep Kishan's hit movies list. This is the Telugu translation…

1 hour ago

‘Rayan’ song written and composed by Oscar winners

'Rayan' is the second film under the direction of veteran actor Dhanush. The first single…

1 hour ago

‘కృష్ణమ్మ‘ సినిమా రివ్యూ

నటీనటులు: సత్యదేవ్, లక్ష్మణ్‌ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచె, నంద గోపాల్, తారక్,…

1 hour ago

‘Gangs of Godavari’ to come on the date of ‘Falaknuma Das’

Mass Ka Das Vishwak Sen is in good form among the young actors of today.…

2 hours ago

The first single from ‘Devara’ is coming

Man of masses NTR upcoming movie 'Devara'. The team is going to start the campaign…

2 hours ago