సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోగ్రఫీ

రామ్ గోపాల్ వర్మ .. ఇండియన్ సినిమాకు పాత్ బ్రేకింగ్ ఈ పేరు. ఓ ఫిల్మ్ మేకర్ గా వర్మ లాంటి పర్సన్ ను ఇండియన్ సినిమా అంతకు ముందు చూడలేదు.. ఇకపై చూస్తుందన్న నమ్మకమూ లేదు. ఆరంభంలో అద్భుతమైన టాలెంటెడ్ అనిపించుకుని.. ప్రస్తుతం ఆ వర్మేనా ఇతను అని ఆశ్చర్యపోయేలా రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తున్నాడు. కాంట్రవర్శీస్ లో కింగ్ అనిపించుకుని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. ఏ విషయం పై అయినా తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయడంలో వర్మను మించిన వారు లేరు. ఈరోజు (ఏప్రిల్ 7) రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు.

రామ్ గోపాల్ వర్మది సినిమా ఫ్యామిలీనే. వర్మ ఫాదర్ పేరు కృష్ణంరాజు. అప్పట్లో సౌండ్ రికార్టిస్టు. వర్మ విజయవాడ సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నాడు. అయితే తను ఫిలిం టెక్నీషియన్ కావాలనేది యాంబిషన్. దానికి ఇంకా టైముందనుకున్నప్పుడు హైద్రాబాద్ లోనే వీడియో పార్లర్ పెట్టాడు. చాలా టాక్టికల్ గా అన్నపూర్ణ వారి సంస్ధకు దగ్గరయ్యాడు. యార్లగడ్డ సురేంద్ర తో స్నేహం ‘రావుగారిల్లు’కి అసిస్టెంట్ డైరక్టర్ ని చేసింది. అసిస్టెంట్ గా ఎక్కువ కాలం లేకున్నా.. అతి తక్కువ టైమ్ లోనే తెలుగు సినిమా గతిని మార్చిన ‘శివ’ సినిమాకు దర్శకుడయ్యాడు.

రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పట్నించి సంచలనమే. తెలుగు సినిమా కన్నా కాస్త ముందున్న వాడు వర్మ. అదే అతని విజయం అదే అతని వైఫల్యం. తెలుగు సినిమా కీర్తి పతాకను బాలీవుడ్ లోనూ సగర్వంగా ఎగరేసిన చరిత్ర వర్మది. వర్మ తెలుగు సినిమాకు ఓ కిక్కు. తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు. ఎంత డిజాస్టర్ సినిమా తీసినా ఇప్పటికీ అతనిపై అభిమానం తగ్గని ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అది వర్మ అదృష్టం కూడా.

తెలుగు అనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ‘శివ’ ప్రస్థావన లేకుండా పూర్తి కాదు. ఈ సినిమా తర్వాత ఎంతమంది దర్శకులు కావాలని అనుకున్నారో లేక్కేలేదు. శిష్యరికం చేసిన వారికంటే ఏకలవ్య శిష్యుల సంఖ్య లెక్కలేనిది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ధం పాటు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం చూపించినా ఓ సంచలనమే అయింది.

రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాస్ అంటూ ఒక మూసలో ఉన్న బాలీవుడ్ కు గ్యాంగ్ స్టర్ సినిమాలను పరిచయం చేసింది వర్మే. ‘సత్య, కంపెనీ’ అంటూ అతను సృష్టించిన సంచనాలకు బాలీవుడ్ సైతం తన పంథా మార్చుకుని వర్మ రూట్ లోకి రాక తప్పలేదు. సినిమాను విపరీతంగా ప్రేమించిన దర్శకుడు వర్మ. ఇండస్ట్రీలో సాధారణంగా ఉండే లొంగుబాటు తత్వం వర్మలో కనిపించదు. అందుకే తను స్టార్ సినిమాలకు దూరంగా ఉంటాడు. అదీ కేవలం తెలుగులోనే. బాలీవుడ్ లో అమితాబ్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ వరకు అందరితోనూ వర్క్ చేశాడు. తెలుగులో చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందోసారి వర్మకు. అయితే కేవలం తన కారణంగానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తీపి గుర్తుగా ఓ పాట మాత్రం మిగిలిపోయింది.

‘శివ’ సినిమా అన్ డివైడెడ్ టాక్ తో రికార్టుబ్రేకులు చేసేసింది. వర్మ ఓ భారీ యాక్షన్ సినిమా అద్భుతంగా తీస్తాడని జనం అపార్ధం చేసుకున్నారు. వర్మ అంటే ఏమిటో ‘శివ’ చూసిన ప్రేక్షకులకు చాలా మందికి అర్ధం కూడా తెలీదు. అలాంటి పరిస్ధితుల్లో తన నెక్ట్స్ వెంచర్ ‘క్షణ క్షణం’. వెంకటేశ్, శ్రీదేవిలతో ప్రారంభించి విడుదల చేశాడు. ‘శివ’ రేంజ్ లో లేదనేశారు జనం. ఎందుకుండాలని వర్మ ప్రశ్న. ప్రతి సినిమా ఒక్కలాగే ఉండాల్సిన అవసరం లేదనేశాడు.

వర్మ ఎప్పుడూ చెప్పినట్టుగా తను రెగ్యులర్ గా ఒకే తరహా సినిమాలతో ఇబ్బంది పడలేదెప్పుడూ. పైగా తనకు నచ్చిన సినిమాలనే ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. అందులో ‘శివ’ తర్వాత ఆ స్థాయి కంటే ఎక్కువగా ఆశించిన ప్రేక్షకులను ‘రాత్రి, అంతం, ద్రోహి, గోవిందా గోవిందా’ అంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. బట్ మళ్లీ ‘గాయం’ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ స్పైర్ అయి తీసిన సినిమాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.

‘శివ’ తర్వాత వరుస ఫ్లాపులు చూశాడు వర్మ. అదే టైమ్ లో ‘గాయం’ చిత్రానికి సహ నిర్మాత అయిన మణిరత్నంతో కలిసి నిర్మాణ భాగస్వామిగా ‘దొంగ దొంగా’ అనే సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. తర్వాత బాలీవుడ్ ను మరోసారి ‘రంగీలా’తో షేక్ చేశాడు. ఊర్మిళను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేశాడు. అటుపై ‘సత్య’ సినిమాతో బాలీవుడ్ పంథానే మార్చేశాడు. సాధారణమైన నటులతో అసాధారణమైన విజయం సాధించింది ‘సత్య’. ‘సత్య’తో బాలీవుడ్ మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

రామ్ గోపాల్ వర్మ సాధారణ జనం ఆలోచించే దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. అంతకన్నా విభిన్నమైన టేస్ట్ తనది. తీసేది కమర్షియల్ సినిమానే అయినా అది రియలిస్టిక్ గా ఉండాలనేది వర్మ సిద్దాంతం. ఆ థీయరీ బలంగా ఉండడం వల్లే…తన సినిమాలు డిఫరెంట్ జానర్ లో నడుస్తాయి. రియలిస్టిక్ గా అనిపిస్తూనే…కొత్త విషయాలు అర్ధం చేయించడం.. వర్మ స్టైల్. రెగ్యులర్ గా దయ్యాలు మాఫియాల చుట్టూ తిరిగే వర్మలో బోల్డు హ్యూమర్ సెన్సు ఉంది. ‘మనీ, మనీమనీ, అనగగనా ఒక రోజు’ లాంటి సినిమాల్లో కనిపించే కనిపించే కామెడీ అంతా వర్మ సృష్టే.

వర్మ హిట్ ను నిలబెట్టుకోవాలి.. ఫ్లాప్ ను రిపీట్ కాకుండా చూసుకోవాలి అని ఆలోచించే టైప్ కాదని చాలా త్వరగానే అర్థమైంది అందరికీ. కానీ అతని కేపబిలిటీ వల్ల ఏ సినిమా కూడా కమర్షియల్ గా లాస్ అనిపించుకోలేదు. తనూ నిర్మాతగా కొన్ని సినిమాలు చేశాడు. మరికొన్ని సినిమాలతో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేశాడు. బట్.. ‘సత్య’ తర్వాత కొన్ని వెరీ యావరేజ్ సినిమాలతో మళ్లీ ఇబ్బంది పెట్టాడు.

వరుస ఫ్లాపుల తర్వాత మరోసారి తన స్క్రిప్ట్ ల పొది నుంచి గ్యాంగ్ స్టర్ స్టోరీస్ ను తీశాడు. ‘కంపెనీ, డి, సర్కార్’ అంటూ మరోసారి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ తరహా కథలే అయినా వేటికవే ప్రత్యేకంగా నిలవడానికి కారణం వర్మ టేకింగ్. మేకింగ్ పై వర్మకు ఉన్న కమాండ్ మరో దర్శకుడిలో కనిపించదు. అతనికే సొంతమైన ప్రతిభ అది. అయితే ఇలాంటి సినిమాలన్నీ వర్మ హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ నుంచే ఇన్ స్పైర్ అయ్యే తీశాడు.

వర్మ ఒక రకంగా గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినదాన్ని ఆచరిస్తాడనిపిస్తుంటుంది. ఎందుకంటే…సినిమా తీయడం వరకే.. తనకు అధికారం కలదు కానీ…దాని విజయం మీద లేదు. వర్మ తీసిన ప్రతి సినిమా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. తనకు అనిపించింది తీస్తాడు. ఈ విషయంలో మొహమాట పడడు. తీసిన తర్వాత జనం చూస్తే వాళ్ల అదృష్టం అనుకుంటాడు. చూడకపోతే వాళ్ల ఖర్మం అని తిట్టుకోడు. అందుకే ‘అప్పలరాజు, దొంగల ముఠా’ లాంటి సినిమాలు తీయగలిగాడు.

తనకు నచ్చని దాన్ని తనకు ఇబ్బంది కలిగించిన అంశాన్ని బలంగా ఎదుటి వారికి అర్ధం చేయించడం కూడా వర్మకి బాగా తెలుసు. వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను వర్మ చర్చించినంత విపులంగానూ.. బలంగానూ చర్చకు పెట్టిన వాళ్లు తక్కువే. ‘రక్త చరిత్ర’, ముంబై ఉగ్ర దాడుల నేపధ్యంలో తీసిన చిత్రం ఇవన్నీ వర్మ లోని ఆలోచనాపరుణ్ణి చూపిస్తాయి. వర్మతో ఆర్గ్యూ చేయాలన్నా కొంచెం కష్టమే. వాదనలో తనని గెలవడం అంత ఈజీ కాదు. కారణం తను ప్రిపేర్ అవుతాడు.

మాపియానే కాదు…ఉగ్రవాదపు ఆలోచనలనూ విశ్లేషించి సినిమాలు తీసి సక్సస్ కొట్టారు వర్మ. ముంబై దాడుల్లో పాల్గొన్న వారి ఆలోచనా విధానం ఏ విధంగా ఉండి ఉంటుందనే కోణంలోనే స్క్రిప్ట్ సాగుతుంది. జనరల్ గా ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారి వైపు నుంచి సినిమా ఓపెనై…ప్రభుత్వ వాదన ప్రకారం ముగియాలి. అయితే వర్మ సినిమా రివర్స్ లో నడుస్తుంది. కథనానికి సంబంధించి ఇది ఓ ప్రక్రియ. కళ్లకు కనపడేవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు అనే కోణంలో కొంత స్వతంత్రించినా.. వర్మ సినిమా మాత్రం జనాలకు నచ్చింది.

గత కొంతకాలంగా వర్మ తీస్తోన్న సినిమాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఈ సినిమా ఇలా ఎందుకు తీశావు అంటేనా ఇష్టం అంటాడు. ఆ సినిమా ఎందుకు హిట్ అయిందీ అంటే నాకేం తెలుసూ అంటాడు. వాదనలో వర్మతో నెగ్గలేరు.. అందుకు కారణం.. అతను గొప్ప చదువరి. సామాజిక అవగాహన పుష్కలంగా ఉన్నవాడూ కావడమే. కానీ ఒక్కసారెందుకో ఇంటెలిజెంట్ ఫూల్ లా కనిపిస్తాడు. అయినా వర్మ అందరికీ నచ్చుతాడు.

జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ.. తన సినిమాలతో ఎంతోమంది యువ దర్శకులను ప్రభావితం చేశాడు.. చేస్తున్నాడు. ఇక.. ఇప్పటికే వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ, పూరి జగన్నాథ్ వంటి వారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులుగా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్లే కాకుండా.. బాలీవుడ్ లోనూ ఎంతోమంది దర్శకులు.. వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారున్నారు.

‘థింక్ అవుటాఫ్ ది బాక్స్’ అన్నదే మ్యావరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫార్ములా. ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచించాలన్నదే వర్మ నమ్మిన సిద్ధాంతం. అదే ఆయనను వివాదాల వర్మగా మార్చింది. అయితే.. ఇప్పుడైతే రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు కానీ.. ఒకప్పుడు వర్మ సినిమా ఎప్పుడు వస్తుందా? అందులో రాము ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాడు? కథను ఏ తీరున నడిపాడు? అన్న అంశాల కోసం సినీ అభిమానులు ఆత్రంగా ఎదురుచూసేవారు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అలాగే ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు కొదవే లేదు. కొన్నేళ్లుగా వర్మ సినిమాల ఎంపిక తీరు చూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మళ్లీ రామ్ గోపాల్ వర్మకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ.. ఈ సంచలన దర్శకుడికి బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts