నాయకుడు

రివ్యూ : నాయకుడు
తారాగణం: వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్‌, ఉదయనిధి స్టాలిన్, లాల్ తదితరులు
ఎడిటింగ్: సెల్వ ఆర్కే
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
నిర్మాత:ఉదయనిధి స్టాలిన్
రచన, దర్శకత్వం: మారిసెల్వరాజ్

తమిళనాట కొన్ని కథలు కొందరు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అణగారిన వర్గాల వారి కథలు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన దర్శకులే చెబుతుండటం వల్ల వీటిలో వాస్తవికతతో పాటు మిగతా వర్గాల నుంచి ఒక అంగీకారం కూడా దక్కుతోంది. అందుకే ఈ చిత్రాలు కమర్షియల్ గానూ పెద్ద విజయాలు సాదిస్తున్నాయి. ముఖ్యంగా పా రంజిత్ ను అనుసరిస్తూ మరికొంతమంది దర్శకులు వస్తున్నారు. అలా వచ్చిన వాడే మారి సెల్వరాజ్. ఇతను తొలి సినిమాగా పరియేరుమ్ పెరుమాళ్ అనే సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యాడు. అత్యంత వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అది నచ్చే ధనుష్ అవకాశం ఇచ్చాడు. రెండో సినిమా కర్ణన్ వంద కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు బెస్ట్ కాస్టింగ్ తో మరోసారి మామన్నన్ అంటూ వచ్చాడు. అంటే చక్రవర్తి అని అర్థం. ఈ చిత్రాన్ని నాయకుడు పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ శుక్రవారం విడుదల చేశారు. మరి ఈ నాయకుడు ఎలా ఉందో చూద్దాం.

కథ :
మహారాజు(వడివేలు) దళిత వర్గం నుంచి రిజర్వ్ డ్ స్థానంలో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. అతని కొడుకు రఘువీరా(ఉదయనిధి స్టాలిన్) ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడిపిస్తుంటాడు. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల పదిహేనేళ్లుగా తండ్రితో మాట్లాడడు. అదే ఊరిలో అధికార పార్టీ అధ్యక్షుడు వేలు(ఫహాద్ ఫాజిల్) అగ్రవర్ణ అహంకారంతో విర్రవీగుతుంటాడు. మరోవైపు పేదవారికి ఉచితంగా కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉంటుంది లీల(కీర్తి సురేష్‌). స్నేహితులతో కలిసి లీల నడుపుతోన్న ఈ కోచింగ్ సెంటర్ ను మూసేయాలని బెదిరించి.. తను వినకపోవడంతో సెంటర్ పై దాడి చేస్తారు దుండగులు. తన క్లాస్మేట్ కూడా అయిన వీరా అతని స్కూల్ లో కోచింగ్ సెంటర్ నడుపుకోవచ్చు అని చెబుతాడు. కొన్నాళ్ల తర్వాత ఆ సెంటర్ ను కూడా ధ్వంసం చేస్తారు ఆ దుండగులు. అలా చేసింది ఎవరో తెలుసుకుని.. వీరా, లీల తమ ఫ్రెండ్స్ తో కలిసి ఆ కాలేజ్ పై దాడి చేస్తారు. అది వేలు అన్న నడిపించే కాలేజ్. దీంతో సంధి చేద్దామని ఎమ్మెల్యేతో పాటు అతని కొడుకును కూడా పిలుస్తాడు. తండ్రి తర్వాత అక్కడికి వెళ్లిన వీరాకు తన తండ్రిపై వాళ్లు చూపించిన సామాజిక అసమానత నచ్చదు. ఇదే విషయంలో కొంత వాగ్వాదం జరిగితే.. వేలు .. ‘మీరింతే.. మీరు ఇక్కడే ఉండాలి’ అని తేలుస్తాడు. దీంతో వీరా తిరగబడి వేలుతో పాటు అతని అన్న, అనుచరులను కూడా కొట్టి ఇంటికి వస్తాడు.. మరి ఆ తర్వాత ఏమైంది..? వేలు వారిపై పగ తీర్చుకున్నాడా..? ఈ విషయంలో పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది..? మహారాజు మళ్లీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
మారి సెల్వరాజ్ గత రెండు సినిమాలు కులం కోణంలోనే సాగుతాయి. అయితే అవన్నీ గ్రామీణ స్థాయిలో కనిపిస్తాయి. కానీ ఏ స్థాయికి వెళ్లినా సామాజిక అణచివేత ఎలా ఉంటుందనేది రాజకీయ కోణంలో చూపించాడు ఈ సారి. ఓ దళితుడు ఎమ్మెల్యే అయినా.. పార్టీ అధ్యక్ష పదవి అగ్రవర్ణాల చేతుల్లో ఉంటే అతను చేతులు కట్టుకుని ఉండాల్సిందే అనే పాయింట్ ను నిష్కర్షగా చూపించాడు. అనేక సన్నివేశాలు చాలామందికి చెంపపెట్టులా ఉంటాయి. అంతెందుకు.. ఇప్పటికీ గ్రామాల్లో దళిత సర్పంచికి కుర్చీ కూడా వేయలేదు అనే వార్తలు ఎన్ని చూస్తున్నాం..? ఆ వివక్ష ఇంకాపై స్థాయికి వెళ్లినా ఉంటుందని కుండబద్ధలు కొట్టాడు దర్శకుడు మారి సెల్వరాజ్. ఎంచుకున్న కథేంటనేది ఇంటర్వెల్ కు ముందు కానీ తెలియదు. అయినాఅప్పటి వరకూ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది కథనం.
కథనం పరంగా మారి సెల్వరాజ్ మెస్మరైజ్ చేశాడు. రఘువీరా చిన్నప్పటి పాత్రలో బావిలో ఈతకొడుతున్న నలుగురు పిల్లలపై ఆధిపత్య కులాల వాళ్లు రాళ్లు వేస్తూ చంపాలనిచూస్తారు. వీరా ఒక్కడేతప్పించుకుంటారు. ఆ ముగ్గురు పిల్లలు రాళ్లదాడిలో చినపోతాడు. అప్పటికే మహారాజు రాజకీయాల్లో ఉన్నా ఏం చేయలేకపోతాడు. ఈ కారణంగానే వీరాకు తండ్రి అంటే నచ్చదు. అలాగే కీర్తి సురేష్‌, ఉదయనిధి మధ్య కోచింగ్ సెంటర్ కోణంలో సాగే సన్నివేశాలుమాస్ ను అట్రాక్ట్ చేస్తాయి. ఆ క్రమంలో వచ్చే ఒక పాట నిరాశపరుస్తుంది. ఇక ఇంటర్వెల్ సీన్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ. ఓ రేంజ్ ఎలివేషన్ లో ఉంటుందీ సీన్. ఉదయనిధి హీరోయిజానికి విజిల్స్ పడతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌ కాస్త నెమ్మదించినట్టు అనిపించినా.. ఎలక్షన్ క్యాంపెయిన్, సిఎమ్ తో మీటింగ్ సీన్, అలాగే ఫహాద్ ఫాజిల్ తండ్రి కొడుకులకు రోడ్ పైనే వార్నింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్లే తిరిగి వార్నింగ్ ఇవ్వడం.. రత్నవేలు పార్టీ మారి మహారాజును ఓడిస్తానని చాలెంజ్ చేయడం.. ఆ తర్వాత క్యాంపెయినింగ్ సీన్స్ అన్నీ చకచకా సాగిపోతుంటాయి. మహారాజు గెలివడం ఊహించేదే అయినా.. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం ఓ క్యూరిసిటీని క్రియేట్ చేస్తాయి. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తనకు కనీసం కుర్చీ కూడా ఇవ్వని రత్నవేలు అహంకారాన్ని దించేలా మహారాజు రాష్ట్రంలోనే అత్యున్నతమైన ‘స్పీకర్ చైర్” లో కూర్చెబెట్టడం ద్వారా అతని అహంకారాన్ని దెబ్బతీయడం అనేది దర్శకుడి ఎంచుకున్న మంచి ఎత్తుగడ. అందుకు తగ్గట్టుగా సాగే కథనం ఎక్కడా డీవియేట్ కాకుండా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా అదిరిపోతుంది.
నాయకుడు ఓ మంచి కథ, కథనాలతో వచ్చిన సినిమా అని ఎంత చెప్పుకుంటామో.. గొప్ప నటనతో కనిపించే సినిమా అని కూడా అంతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగాఇప్పటి వరకూ టాప్ కమెడియన్ గా ఉన్న వడివేలు ఒక్క ఫ్రేమ్ లో కూడా తన గత ఇమేజ్ ను చూపించలేదు. ఓ సీరియస్ దళిత ఎమ్మెల్యే పాత్రలో అచ్చంగా ఒదిగిపోయాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం చూస్తే అతను ఓ మాజీ మాస్ హీరోనా అన్నంత గొప్పగా కనిపిస్తాడు. తర్వాత చెప్పుకోవాల్సింది ఫహాద్ ఫాజిల్ గురించి. అగ్రవర్ణ అహంకారం అణువణువునా నింపుకున్న వ్యక్తి పాత్రలో అద్భుతంగా నటించాడు. అతన్ని చూస్తే ఓ దశలో పిచ్చి కోపం వస్తుంది. అంత గొప్పగా నటించాడు. ఈ సినిమాకు వడివేలు తర్వాత అంత గొప్పపాత్ర, నటన అతనిదే. కీర్తి సురేష్ కు ఇది కొత్త పాత్ర. పూర్తిగా రాడికల్ గా ఉంటుందీ రోల్. తను ఎలాగూ మంచినటే కాబట్టి అదరగొట్టింది. ఇక ఉదయనిధి ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తు. ఇది ఒకెత్తు. అలా ఉంది అతని పాత్ర. తండ్రిలా తలవంచని నైజం.. పెద్దలంటే గౌరవం.. అణచివేతపై తిరగబడే ధోరణి ఈ పాత్రలో కనిపిస్తాయి. అవన్నీ బాగా పలికించాడు స్టాలిన్. ఒరిజినల్ గా అతను ముఖ్యమంత్రి కొడుకు, స్వయంగా మంత్రి.. అయినా పందుల పెంపకం దారు పాత్రలో నటించడం చూస్తే అతను ఈ పాత్రను ఎంత ప్రేమించాడో అర్థం అవుతుంది.

ఇక టెక్నికల్ గా ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రాణం పోసింది. నాయకుడు సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువ. అందుకే ఆర్ఆర్ కు ఎక్కువ పని పడింది. ఆ విషయంలో అద్భుతం అనిపించాడు రెహ్మాన్. అతను లేకుండా నాయకుడు లేదు అనేలా ఈ చిత్రానికి నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. పాటలు తమిళ్ లోఉన్నంత సహజంగా తెలుగులో కుదరలేదు. ముఖ్యంగా సినిమా అంతా వినిపించే ఓ మాంటేజ్ సాంగ్ తమిళ్ లో వడివేలు పాడాడు. అది తెలుగులో ఆర్టిఫిషియల్ గా మారింది. ఎడిటింగ్ తప్పులు లేవు కానీ.. సినిమా స్లో నెరేషన్ లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైలాగ్స్ మెప్పిస్తాయి. దర్శకుడుగా మారి సెల్వరాజ్ మరోమెట్టు పైకి ఎక్కాడు అనే చెప్పాలి.
అన్ని వర్గాల ప్రేక్షకులూ ఖచ్చితంగాచూడాల్సిన సినిమా ఇది.

ఫైనల్ గా : మనుషులు అందరూ సమానమే అని చాటి చెప్పిన నాయకుడు

రేటింగ్ : 3.25/5

                        - బాబురావు. కామళ్ల

Related Posts