రివ్యూ : బేబీ
తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష తదితరులు
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : ఎమ్.ఎన్ బాల్ రెడ్డి
నిర్మాత: ఎస్కేఎన్
దర్శకత్వం: సాయి రాజేష్‌

ఒకప్పుడు హృదయ కాలేయం అనే సెటైరికల్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్‌. ఆ తర్వాత చాలాకాలానికి కొబ్బరిమట్ట అనే సినిమా తీశాడు. బట్ ఇదేమంత ఆకట్టుకోలేదు. మధ్యలో కలర్ ఫోటో అనే సినిమా నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గతంలో టాక్సీవాలా సినిమా నిర్మించి విజయం అందుకున్న నిర్మాత ఎస్కేఎన్ తో కలిసి ఈ సారి బేబీ అనే సినిమాతో వచ్చాడు. పాటలు, టీజర్, ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ వేసిన బేబీ ఎలా ఉంది..? రిలీజ్ కు ముందు ఉన్న అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం..

కథ :
ఆనంద్(ఆనంద్ దేవరకొండ) వైష్ణవి(వైష్ణవి చైతన్య) టెన్త్ క్లాస్ నుంచి ప్రేమించుకుంటారు. ఆనంద్ పదిలో ఫెయిల్ అవుతాడు. వైష్ణవి కాలేజ్ కు వెళుతుంది. తర్వాత ఇంజినీరింగ్ లో కూడా జాయిన్ అవుతుంది. అప్పటి వరకూ వీరి ప్రేమ సజావుగానే ఉంటుంది. వైష్ణవి డొనేషన్ తో ఓ పెద్ద కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అప్పటి వరకూ తను చూసిన ప్రపంచానికి భిన్నంగా ఈ కాలేజ్ ప్రపంచం కనిపిస్తుంది. మెల్లగా ఆ మాయల్లో పడిపోతుంది. చెడు స్నేహాలు మొదలవుతాయి. వాటితో పాటు తన ప్రేమకథలో ఒడిదుడుకులూ మొదలవుతాయి. అదే కాలేజ్ లో ఆమెకు అండగా నిలుస్తున్నట్టు కనిపిస్తాడు విరాజ్(విరాజ్ అశ్విన్). తను అతన్ని బెస్ట్ ఫ్రెండ్ అనే అంటుంది. అతను మాత్రం ఆమెను ప్రేమిస్తాడు. ఓ సారి ఆనంద్ తో గొడవపడి పబ్ కు వెళ్లి బాగా తాగేసిన వైష్ణవి ఆ మత్తులో విరాజ్ కు లిప్ లాక్ ఇస్తుంది. దాన్ని వీడియో తీసిన విరాజ్ కొత్త కథకు తెరతీస్తాడు. అదేంటీ..? ఆ తర్వాత ఏం జరిగింది. ఆనంద్ ప్రేమ గెలిచిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కొన్నిసార్లు ట్రైలర్ చూసి ఓ అద్భుతమైన సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ కు వస్తాం. బేబీ విషయంలోనూ అదే కలిగింది. కానీ సినిమాగా మాత్రం వందశాతం అద్భుతం అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పలేం కానీ .. ఓ బోల్డ్ అటెంప్ట్ అని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటి వరకూ వచ్చిన ట్రైయాంగిల్ సినిమాల్లోని కోణానికి భిన్నమైన కోణంలో ఈ కథనం సాగుతుంది. అనుకోకుండా లిప్ లాక్ చేసినా.. ఆ విషయంలో పశ్చాత్తాప పడుతూ.. తన వల్ల తను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి లైఫ్‌ పాడు కాకూడదు అని.. అతనితో నెల రోజులు డేటింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ నెల చివరి రోజు తను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న వ్యక్తి ‘అసలు’ రూపం తెలుస్తుంది. ఆ తర్వాత తను పూర్తిగా ఓ నిస్సహాయ స్థితికి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో తను మంచి ఫ్రెండ్ అనుకుంటోన్న మరో అమ్మాయి ఇచ్చిన చీప్ అడ్వైజ్ తో లైఫ్‌ లో చేయకూడని తప్పు చేస్తుంది. ఆ తప్పు చేస్తున్నప్పుడు కూడా తన మనసులో తను ప్రేమించిన వ్యక్తే ఉంటాడు. అయినా దీనితో తనకు తన మిడిల్ క్లాస్ బస్తీ లైఫ్ తో పాటు పేరెంట్స్ కూ, ఆ తర్వాత తన ప్రేమకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటుంది. ఇక్కడే ఆమె ఆలోచన తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది. అటు తనను మోసం చేసిన వాడు ప్రేమ అంటూ వెంటపడుతూ తనే మోసపోయాను అనే ఫీలింగ్ లోకి వెళ్లడం.. దర్శకత్వ లోపమే. ఇటు తనను చిన్నప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా తనను దూరం చేయడం.. ఆ పాత్ర కోణంలో బానే ఉంటుంది. పైగా తనూ అందర్లాంటి ఓ సాధారణమైనవాడినే.. నేనేమీ హీరోను కాదు అని చెప్పడంతో అతని నిర్ణయానికి ఓ కన్విన్సింగ్ వస్తుంది. బట్ రెండో వాడు ఆమె జీవితాన్ని ఇబ్బందికి గురి చేయడమే కాక.. తను మోసపోయానని ఫీలవడం.. దాన్ని దర్శకత్వ పరంగా సమర్థించుకోవడం మైనస్ గానే చెప్పాలి. ఒక వైష్ణవి పాత్ర పూర్తిగా నిస్సహాయ స్థితికి వెళ్లిపోతుంది. అఫ్‌ కోర్స్ ఇందులో తన అమెచ్యూర్ నిర్ణయాలు.. కాలేజ్ లోని తళుకు బెళుకులు చూసి ఆ మాయలో పడిపోవడం.. ఆ పాత్ర కోణంలో కొంత వరకూ కరెక్ట్ గానే అనిపిస్తాయి. కానీ ఈ పాత్రను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు కూడా ఆపాదించి.. ఆమె తల్లిని కూడా అలాగే చూపించడం దర్శకుడి దారుణమైన ఆలోచనకు నిదర్శనం. మొత్తంగా మొదటి ప్రేమ గొప్పదనాన్ని చెప్పేందుకు అమ్మాయి క్యారెక్టర్ ను ఏకపక్షంగా బ్యాడ్ చేయడం గొప్ప రైటింగ్ అనిపించుకోదు. బట్ సినిమాగా, కథనం పరంగా ప్రేక్షకులను కట్టిపడేసేలా రాసుకున్నాడు. మూడు గంటల సినిమా అయినా ఫస్ట్ హాఫ్‌ లో చకచకా వెళ్లిపోతుంది. వైష్ణవి, ఆనంద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కాలేజ్ లో తను ట్రాక్ తప్పుతుంది అనిపించినప్పుడు ప్రేక్షకులకు తనపై కోపం వస్తుంది. అది దర్శకుడి విజయం. పాత్రతో ప్రేక్షకులూ ప్రయాణించేలా చేయడం మంచి రైటప్ అనే చెప్పాలి. ఆ విషయంలో ఈ సినిమాలో అనేక సన్నివేశాల్లో ప్రేక్షకులు ఆ పాత్రలతో ట్రావెల్ అవుతారు. వారి ఎమోషన్ తో ఎమోషనల్ గా ఫీలవుతారు. వైష్ణవి పబ్ లో విరాజ్ కు ముద్దుపెడుతున్నప్పుడు.. ఆనంద్ ఫోన్ లో ఆమె ఫోటోకు ముద్దుప ఎట్టే సీన్ .. దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు. ఇక ఆ తర్వాత జరిగేవి కొంత వరకూ ఊహించేవే కావడంతో.. కాస్త సాగదీతగా అనిపిస్తుంది. బట్.. ఎప్పుడైతే ఆమెను తన లైఫ్‌ లో వద్దు అని ఆనంద్.. వైష్ణవి కాళ్లపై పడతాడో.. అప్పుడే ఈ కథ ముగిసిపోతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ అలాగే ఓపెనింగ్స్ సీన్స్ అతను చెప్పాలనుకున్న కథకు అవసరం లేనివి. తను ప్రేమించిన అమ్మాయి లేకున్నా.. జీవితాంతం తనను ప్రేమిస్తూనే ఉంటా అన్నప్పుడు అతని లైఫ్ లో అతను.. ఆమె జీవితంలో ఆమె మూవ్ ఆన్ కావడమే ఏ నిజ జీవిత కథలో అయినా కనిపిస్తుంది. అందుకే మొదటి, చివరి సన్నివేశాలు అనవసరం అనే అనిపిస్తాయి.

నటన పరంగా ఆర్టిస్టుల నుంచి బ్రిలియంట్ పర్ఫార్మన్స్ తీసుకున్నాడు సాయి రాజేష్‌. ముఖ్యంగా వైష్ణవి ఇంకా ఎన్ని గొప్ప పాత్రలు చేసినా.. ఇదే తన బెస్ట్ పర్ఫార్మన్స్ అవుతుంది. అద్భుతంగా నటించింది. ఇద్దరి మధ్య నలిగిపోవడం.. తన నిజమైన ప్రేమను వదల్లేకపోవడం, కోపం, చిరాకు, నిస్సహాయ స్థితి, తన తాహతకు మించి పొందుతున్న ఆనందాలు వీటన్నిటినీ అద్భుతంగా నటించింది. తర్వాత ఆనంద్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ది బెస్ట పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతన్లో ఇంత పొటెన్షియల్ ఉందన్న విషయం మొదటిసారి ఆడియన్స్ కు తెలుస్తుంది. విరాజ్ కూడా బాగా చేశాడు. నాగబాబు, అతని వైఫ్‌ పాత్రలో నటించినావిడా ఓకే. వైవా హర్షతో పాటు మరో ఫ్రెండ్ క్యారెక్టర్ ను ఇంకాస్త పొడిగించాల్సింది అనిపిస్తుంది.


టెక్నికల్ గా డౌట్ లేకుండా సంగీతం సినిమాకు బ్యాక్ బోన్. పాటలన్నీ బావున్నాయి. నేపథ్య సంగీతం ఆయువుపట్టులా ఉంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ పరంగా కనీసం ఓ పావుగంట అయినా తీసేయొచ్చు. బట్ అది దర్శకుడి నిర్ణయం కదా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా, ఈ కథకు రచయితగా సాయి రాజేష్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తను ఏం రాసుకున్నాడో అది పూర్తిగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొంత ల్యాగ్ అనిపించినా.. అతను ఈ కథను పూర్తిగా విశ్లేషించి చెప్పాలనుకున్నట్టు అర్థం అవుతుంది. నిడివి పరంగా కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ ఎక్స్ పీరియన్స్ వచ్చి ఉండేది.

ప్లస్ పాయింట్స్

వైష్ణవి చైతన్య
ఆనంద్ దేవరకొండ
సంగీతం
సినిమాటోగ్రఫీ
పాటలు
దర్శకత్వం

మైనస్ పాయింట్స్

లెంగ్త్
హీరోయిన్ పాత్రపై ఏకపక్ష వైఖరి
మొదటి 5, చివరి 10 నిమిషాలు

ఫైనల్ గా : అమ్మాయిల చేతిలో చితికిపోవద్దన్న బేబీ

రేటింగ్ : 3/5

                - బాబురావు. కామళ్ల

Related Posts