నట్టికుమార్ ను పట్టించుకుంటారా..

సీనియర్ నిర్మాతగా నట్టికుమార్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. తీసేవన్నీ చిన్న సినిమాలే. అయినా ఓ పెద్దరికం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ మేరకు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ప్రస్తుతం కొన్నాళ్లుగా ఆయన తీరు చూస్తే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు అర్థం అవుతుంది. అలాంటి నట్టి కుమార్ సడెన్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. పైగా తను అనారోగ్యంతో ఉన్నానని.. అయినా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం చూసి బాధపడుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాను అన్నాడు.

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సినిమా పరిశ్రమతో చాలా దగ్గర సంబంధాలు నెరిపాడు. ఇండస్ట్రీలోని చాలామందిఆర్టిస్టులను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకున్నాడు. కొందరికి పదవులు ఇచ్చాడు. ఇంకొందరికి ఎమ్మెల్యే సీట్స్ ఆఫర్ చేశాడు. బాబూమోహన్ లాంటి వాళ్లు మినిస్టర్స్ కూడా అయ్యారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడటం లేదంటూ ఘాటుగా స్పందించాడు నట్టి కుమార్.


తాను తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకి అయినా.. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం నచ్చలేదు అన్నాడు. అలాంటిది.. మాట్లాడితే మా ఎన్టీఆర్ అని చెప్పుకునే వైవిఎస్ చౌదరి, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమర్ లాంటి వాళ్లు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించాడు. అల్లు రామలింగయ్య చనిపోతే ఆ రోజంతా చంద్రబాబు ఉన్నాడని గుర్తు చేశాడు. దీనర్థం అరవింద్ స్పందించలేదనే కదా. ఇక ఎన్టీఆర్ పై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు తను ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం వల్ల మిగతా వాళ్లు కూడా ముందుకు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడతారని ఆశిస్తున్నా అన్నాడు.


అయితే నట్టికుమార్ స్పందన ఆయన వ్యక్తిగతం. అలాగే అందరూ స్పందించాలనడం అత్యుత్సాహం. నిజానికి ఇది పొలిటికల్ వ్యవహారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సినిమా వారిని జగన్ మోహన్ రెడ్డి బాగా ఇబ్బంది పెట్టాడు. పెడుతున్నాడు కూడా. ఇలాంటి టైమ్ లో స్పందిస్తే రాబోయే రోజుల్లో వీరి సినిమాలపై అతనూ ఓ కన్నేస్తాడు. అది తమకే నష్టం. ఇక నట్టికుమార్ మాటలే చూస్తే ఎన్టీఆర్ ను ఇష్టపడి, అభిమానించిన వాళ్లంతా చంద్రబాబును కూడా అభిమానించాలనేం లేదు కదా. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు కాబట్టి.. ఎన్టీఆర్ పై అభిమానాన్ని ప్రశ్నించడం అసంబద్దం అవుతుంది. పైగా విషయం కోర్ట్ లో ఉంది. చంద్రబాబు దోషా, నిర్దోషా అనేది ఆయనే కోర్ట్ లో నిరూపించుకుంటాడు. అంతే కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్లు వచ్చిన చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే అది కోర్ట్ తీర్పుపై ప్రభావం చూపిస్తుందా అంటే అస్సలు చూపించదు.

కాకపోతే ఒకప్పుడు చంద్రబాబు వల్ల లబ్ది పొందిన వాళ్లు కూడా స్పందించలేదు అన్నాడు. అది కొంత వరకూ కరెక్ట్. ఏదేమైనా నట్టికుమార్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. ఆయనకు చంద్రబాబుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. కానీ అందరూ తనలానే స్పందించాలి అనడంపై నట్టికుమార్ ను ఇండస్ట్రీ పట్టించుకుంటుందా అంటే కష్టమే అని చెప్పాలి.

Related Posts