‘ఖైదీ’ వచ్చిన వారానికి ‘మంత్రిగారి వియ్యంకుడు’

అప్పట్లో మన కథానాయకులు ఏడాదికి ఈజీగా ఐదారు సినిమాలను విడుదల చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒకే ఏడాది 18 సినిమాలను విడుదల చేసిన రికార్డు కూడా ఉంది. ఇక.. 80లలో కృష్ణతో పాటు పోటీగా సినిమాలను విడుదల చేసిన ఘనత చిరంజీవిది.

చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా 1983, అక్టోబర్ 28న విడుదలైతే.. ఈ చిత్రం వచ్చిన వారానికి అంటే 1983, నవంబర్ 4న విడుదలైంది ‘మంత్రిగారి వియ్యంకుడు’. చిరంజీవి నటుడిగా మొదలైన కొత్తలో బాపు దర్శకత్వంలో ‘మనవూరి పాండవులు’ సినిమాలో నటించాడు. అయితే.. ఆ చిత్రంలో ఐదుగురు కథానాయకుల్లో ఒకడిగా చేస్తే.. చిరంజీవి సోలో హీరోగా బాపు దర్శకత్వం వహించిన సినిమా ‘మంత్రి గారి వియ్యంకుడు’. ‘మనవూరి పాండవులు’ సినిమాని నిర్మించిన జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాపు అనగానే మనము ముందుగా గుర్తొచ్చే మరోపేరు ముళ్లపూడి వెంకటరమణ. ఈ సినిమాలో ముళ్లపూడి మార్క్ డైలాగ్స్ ప్రతి క్యారెక్టర్ లోనూ ప్రతిబింబిస్తాయి. ఇళయరాజా స్వరపరిచిన పాటలు కూడా ‘మంత్రిగారి వియ్యంకుడు’ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పూర్ణిమ జయరామ్ నటిస్తే.. ఇతర ప్రధాన పాత్రల్లో అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ నటించారు. పేరుకు చిరంజీవి హీరో అయినా.. మంత్రి, వియ్యంకుడు పాత్రల్లో నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య అదరగొట్టారు. ఇంకా.. నూతన్ ప్రసాద్, రావి కొండలరావు, శుభలేఖ సుధాకర్, తులసి, రాళ్లపల్లి పాత్రలు ఆకట్టుకుంటాయి. నటుల విషయానికొస్తే ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి వెంకట్రావు కూడా ఓ కేమియోలో మురిపించడం విశేషం. ఈరోజు (నవంబర్ 4)కి ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా విడుదలై నలభై ఏళ్లు పూర్తయ్యింది.

Related Posts