మసాలా కంటెంట్ తో కూడిన థ్రిల్లర్ ‘మంగళవారం‘

నటీనటులు: పాయల్‌ రాజ్‌ పుత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు
రచన, దర్శకత్వం: అజయ్‌ భూపతి
నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్
సంగీతం : అజనీష్ లోకనాథ్‌
ఛాయాగ్రహణం : శివేంద్ర దాశరథి
విడుదల తేదీ: నవంబర్ 17, 2023

ఆర్.ఎక్స్.100‘ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అజయ్ భూపతి. ఇదే సినిమాతో పరిచయమైన పాయల్ రాజ్ పుత్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన చిత్రం ‘మంగళవారం‘. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంగళవారం‘ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమైందా? ఈ విశ్లేషణలో చూద్దాం.

కథ
మహాలక్ష్మిపురం గ్రామంలో జంట హత్యలు జరుగుతుంటాయి. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్యక్తి ఊరి గోడల‌పై రాసిన రాత‌ల వ‌ల్లే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటార‌ని గ్రామ‌స్తులంతా న‌మ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్తగా వ‌చ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత‌) మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని బ‌లంగా న‌మ్ముతుంది. మ‌రి ఊర్లో జ‌రిగిన‌వి ఆత్మహత్యలా? హత్యలా? ఈ చావుల వెన‌కున్న ల‌క్ష్యం ఏంటి? వీటికి ఆ ఊరి నుంచి వెలివేయ‌బ‌డ్డ శైల‌జ అలియాస్ శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ
ఈమధ్య తెలుగులో మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీస్ కి ప్రాధాన్యత పెరిగింది. ఈకోవలోనే వచ్చిన ‘విరూపాక్ష, పొలిమేర 2‘ మంచి విజయాలు సాధించాయి. ఇదే జానర్ లో ‘మంగళవారం‘ సినిమా రూపొందింది. ఇక.. ఈ సినిమాలో కొత్తదనం గురించి చెప్పాలంటే సెక్సువ‌ల్ డిజార్డర్ ప్రధానంగా మంగ‌ళ‌వారం క‌థ‌ను రాసుకున్నాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. తెలుగు సినిమాల వరకు ఇది పెద్ద ప్రయోగమే అని చెప్పాలి. అయితే మామూలు రివెంజ్ డ్రామాగా క‌నిపించే ఈ క‌థ‌ను కొత్తగా మార్చింది ఈ కథాంశమే.

శైలు (పాయల్ రాజ్ పుత్) చిన్ననాటి ఎపిసోడ్‌ తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం.. తండ్రి మరోపెళ్లి చేసుకోవడం.. అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్‌ క్యారెక్టర్‌ పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. అయితే ప్రథ‌మార్థంలో పాయ‌ల్ రాజ్‌ పుత్ క్యారెక్టర్ ను చూపించ‌కుండా స‌స్పెన్స్‌ను మెయింటెయిన్ చేయడం సాహసమనే చెప్పాలి. సెకండాఫ్ లో పాయ‌ల్ ఎంట్రీతో సినిమా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్‌గా చూపిస్తూనే.. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్‌ భూపతి. ‘మంగళవారం‘ స్క్రీన్ ప్లే సాగిన విధానం.. ఊరు.. అక్కడ వ‌రుస హత్యలు.. కొంద‌రు అనుమానితులు.. వాటి చుట్టూ జ‌రిగే నేర ప‌రిశోధ‌న‌ విధానాన్ని చూస్తే.. వంశీ ‘అన్వేషణ‘ గుర్తుకురాక మానదు.

నటీనట, సాంకేతిక వర్గం
ఈ సినిమాలోని శైలు పాత్ర పాయల్ కి కొత్తనే చెప్పాలి. పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న ఈ రోల్ లో పాయల్ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇంకా.. అజయ్ ఘోష్ – లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ.. గతంలో కోట – బాబుమోహన్ కామెడీ కాంబోని గుర్తు చేస్తోంది. ఇతర నటీనటుల విషయానికొస్తే జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళై, ఆర్‌.ఎం.పీ డాక్టర్‌ గా రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి వంటి వారు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం. ‘కాంతార, విరూపాక్ష‘ సినిమాల విజయాలలో అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో కీలక పాత్ర పోషించింది. ‘మంగళవారం‘ సినిమాకి కూడా అంజనీష్ సంగీతం, నేపథ్య సంగీతం బలాన్ని చేకూర్చాయి. శివేంద్ర దాశరథి విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

మొత్తంమీద.. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉంది. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్ట్ లు బాగున్నాయి. అజయ్ ఘోష్ – లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. మసాలా కంటెంట్ తో కూడిన ఈ థ్రిల్లర్ ఫర్వాలేదనిపిస్తుంది.

Related Posts