ఎవర్ గ్రీన్ మన్మథుడు.. కింగ్ నాగ్ బర్త్ డే స్పెషల్

అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చినా.. పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. తండ్రిలా రొమాంటిక్ హీరోగా అలరించాడు.. భక్తి చిత్రాల్లో సత్తా చాటాడు. తెలుగులో తనదైన పేజ్ రాసుకున్న హీరో. ఇమేజ్ కు భిన్నమైన కథలతో వహ్వా అనిపించాడు. కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఎంతో ప్రతిభను పరిశ్రమకు అందించాడు. ఆ నలుగురిలో ఒకడిగా.. ఇప్పటికీ యంగ్ స్టర్స్ కు పోటీ ఇస్తూ తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా, హోస్ట్ గానూ ఆకట్టుకుంటోన్న కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఇవాళ(మంగళవారం).

నాగేశ్వరరావు గారి వారసుడిగా వచ్చిన నాగార్జున 1959 ఆగస్ట్ 29న జన్మించారు. నటుడుగా తొలినాళ్లలలో తడబడ్డాడు. దీంతోచాలామంది తండ్రి పేరు చెడగొతాడేమో.. అసలు హీరోగా నిలవలేడేమో అని అనుమానాలూ వ్యక్తం చేశారు. కానీ విమర్శలను స్వీకరించి.. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ మెల్లగా తండ్రి స్థానాన్ని భర్తీ చేశాడు.

మొదట్లో విమర్శించిన వాళ్లే.. తర్వాత వాహ్ నాగ్ అనేలా చేశాడు. నాగ్ కెరీర్ దశాబ్ధానికో మలుపు తీసుకుని నడవడం విశేషం. నిర్మాతగానూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు అందించాడు. అలా అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ కొత్త అధ్యాయం సృష్టించుకున్నాడు నాగ్.

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా .. ఈ విక్రమ్ కు వెంటనే హిట్ దక్కలేదు. మొదట్లో చూడ్డానికి సన్నగా పీల గొంతుతో కనిపించిన నాగ్ ను అసలు ఇతనేం హీరో అనుకున్నారు. కానీ అతనే వెండితెరకు ఎవర్ గ్రీన్ మన్మథుడు అవుతాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు. విక్రమ్ తర్వాత వరుసగా సినిమాలన్నీ పోయాయి. ఆఖరుకి శ్రీదేవితో చేసిన ఆఖరి పోరాటం ఆదుకుంది. అది మంచి విజయం సాధించింది. ఇదే నాగ్ కు తొలి కమర్షియల్ హిట్. తర్వాత జానకి రాముడు, విజయ్, విక్కీ దాదా హిట్..


కుర్రాడు బాగా డెవలప్ అయ్యాడు.. తండ్రి పేరు నిలిపే ఛాన్సుంది అనుకుంటున్న టైమ్ లో చేశాడు.. ప్రయోగం.. అనొచ్చో లేదో తెలియదు కానీ, అప్పటికి హీరో అంటే ఉన్న కాలిక్యులేషన్స్ కు క్రాస్ చేసి కాలేజ్ గోయింగ్ కుర్రాడిగా ఉన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డవాడిగా పాత్ర. పైగా క్యాన్సర్ తో ప్రేమకథ. ఇంకెవరికైనా చెబితే ఎలా రియాక్ట్ అయ్యేవారో కానీ, నాగ్ కు అందులో ప్రేమే కనిపించింది. అందుకే గీతాంజలి అతని కెరీర్ లో ది బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మణిరత్నం తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. ఆ సినిమాకు నాగార్జునను ఎంచుకోవాలని ఎందుకనుకున్నాడో కానీ, గీతాంజలి లాంటి కథతో ఓ ప్రేమకథ చేయొచ్చని మణిరత్నం చేసిన ప్రయత్నం అద్భుతమనే చెప్పాలి. ఇక ఇళయరాజా సంగీతం, పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, రాజశ్రీ సంభాషణలతో పాటు నాగార్జున, గిరిజ సహజ నటన గీతాంజలిని ఓ ప్రేమకావ్యంగా మలిచాయి.


హీరో అంటే పేజీల కొద్దీ డైలాగులు చెప్పడం.. ఇస్త్రీ నలక్కుండా పదిమందిని మడతబెట్టడం.. అదిరిపోయే స్టెప్పులేయడం అనే రొటీన్ ఫార్ములాకు చెక్ పెట్టాడు..నాగ్. సైకిల్ చైను లాగి కూడా కొట్టొచ్చని.. అరుపులు, కేకలు లేకుండా సైలెంట్ గా విలన్ ని బెదిరించవచ్చని శివతో నిరూపించాడు. తెలుగు సినిమా గమనాన్ని ఉలిక్కిపడేలా చేసిన సినిమా శివ.

దీని అసలు రూపకర్త రామ్ గోపాల్ వర్మ అయినా.. అతని ఆలోచిన ఆడియన్స్ వరకూ రావడానికి కారణం నాగార్జున నమ్మకం. అది లేకపోతే వర్మ లేడూ, శివా లేదు. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ అద్భుత సృష్టికి నాగార్జున పర్ఫార్మెన్స్ తోడై శివను ట్రెండ్ సెట్టింగ్ మూవీని చేశాయి. శివ నాగార్జున సినీ జీవితాన్నే కాదు.. తెలుగు సినిమా గమనాన్నీ మార్చివేసింది. దర్శకుల్లో సరికొత్త ఆలోచనలకు పునాది అయింది. కొత్తవారిని ప్రోత్సహించడం రిస్క్ కాదు.. విజయాలూ ఉంటాయని నిరూపించింది. నాగ్ ముందు నుంచీ కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి కారణం ఇదే.

శివ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా కొన్ని ప్రయోగాలూ చేశాడు.. కానీ తేడా వచ్చింది. ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్థ, శాంతి క్రాంతి, కిల్లర్, ద్రోహి, హిందీలో ఖుదాగవా, రక్షణ లాంటి సినిమాలు చేశాడు.. వీటిలో ఇద్దరూ ఇద్దరేలో తొలిసారి తండ్రితో కలిసి నటించాడు. కానీ మాగ్జిమం మిక్స్ డ్ రిజల్ట్స్ నే చూశాడు. దీంతో పంథాను పూర్తి స్థాయిలో కమర్షియల్ సినిమావైపు మళ్లించాడు.


కమర్షియల్ సినిమాలు చేసినప్పుడూ కాలిక్యులేషన్స్ ను దాటలేదు నాగ్. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అల్లరి అల్లుడు, హలోబ్రదర్, ఘరానాబుల్లోడు లాంటి ఊర మాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. హలో బ్రదర్ ఇప్పటికీ అన్నదమ్ముల కథకు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంది. అలాగే ఇవన్నీ కమర్షియల్ సినిమాలే అయినా వీటిలే సిమిలారిటీస్ చాలా తక్కువ. ఫ్యామిలీ కథ అంటే భారమైన కథ, కథనాలన్న ట్రెండ్ మార్చివేసి నాగ్ తీసుకున్న మరో డేరింగ డెసిషన్ నిన్నే పెళ్లాడతా.. కుటుంబ కథా చిత్రమ్ అంటే అప్పటి వరకూ ఏడుపులూ, సమస్యలే. కానీ కృష్ణవంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయిన నాగార్జున తీసుకున్న నిర్ణయం.. ఫ్యామిలీ సినిమాల మీనింగ్ నే మార్చివేసింది. నిన్నేపెళ్లాడుతా తర్వాత తెలుగులో ఆ ట్రెండ్ సినిమాలే చాలా వచ్చాయి. వస్తున్నాయి. ఆ ట్రెండ్ కు బీజం వేసింది నాగ్..

తెలుగులో నాగార్జున ఇమేజ్ కాస్త భిన్నం. క్లాస్ లో క్లాస్ గా మాస్ లో మాసివ్ గా కనిపిస్తాడు. వీటన్నిటికీ మించి ఏ సినిమా చేసినా అందులో తనదైన రొమాంటిక్ ట్యాగ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి నాగార్జున భక్తి సినిమాలో నటిస్తే.. ? అది కూడా రక్తి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో..? అందుకే వీరి కాంబినేషన్ లో అన్నమయ్య అనౌన్స్ అయినప్పుడు అన్నీ విమర్శలే వచ్చాయి. అన్ని విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పాడు నాగార్జున. అన్నమయ్యగా ఆ పాత్రకు ప్రాణం పోసి.. భక్తి పాత్రలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు.. కొన్ని సినిమాల ప్రభావం కెరీర్ పైనే పడుతుంది. అందుకే అన్నమయ్య తర్వాత నాగార్జున చేసిన ఏడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఏ నటుడికైనా ఇది ఓ సంకట స్థితే.

కానీ నువ్వు వస్తావనితో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అది కూడా సూపర్ హిట్ కాదు.. కానీ ఉపశమనం.. మళ్లీ నువ్వు వస్తావని తర్వాత సంతోషం వరకూ అన్నీ యావరేజ్ సినిమాలే వచ్చాయి.. సంతోషం.. నాగార్జునను మన్మథుడిలా తెలుగు తెరకు చూపించిన సినిమా. తన సినిమాల ట్రెండ్ కు భిన్నంగా.. ఇమేజ్ కు కాస్త దూరంగా చేసిన ప్రయత్నం. అది కూడా ఓ కొత్త దర్శకుడిని నమ్మి.. మళ్లీ అతని నమ్మకం ఫలించింది. సంతోషం సూపర్ హిట్.. ఆ వెంటనే మన్మథుడు.. మరో సూపర్ హిట్. దీంతో నాగ్ కెరీర్ కొత్త టర్నింగిచ్చుకుంది.. ఇక హీరోలను ఊర మాస్ గా చూపించడంలో ఎక్స్ పర్ట్ అయిన పూరీతో చేసిన శివమణి మరో కొత్తదనం. నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగులు అమ్మాయిలకూ నచ్చాయి. తర్వాత నేనున్నాను, మాస్.. మళ్లీ హిట్ బాట పట్టాడు నాగ్..


అన్నమయ్య తర్వాత మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని ఎప్పుడూ అడిగేవారు నాగ్ ను. దీనికి సమాధానం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. మళ్లీ రాఘవేంద్రరావు కాంబినేషనే. కానీ ఈ సారి ఎవరికీ డౌట్స్ లేవు. అంచనాలకు తగ్గట్టుగా శ్రీరామదాసు సూపర్ హిట్. నాగార్జున నటనా హైలెట్.. అలాగే చాన్నాళ్ల తర్వాత తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాంబినేషన్ పరంగానూ ఆకట్టుకున్న రామదాసుకు ప్రేక్షకులు విజయరథం పట్టారు. కాకపోతే ఇదే కాంబోలో భక్తి మార్గంలో వచ్చిన శిరిడీ సాయి, నమోవేంకటేశాయ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

శ్రీరామదాసు తర్వాత నాగార్జున కెరీర్ అనుకున్నంత బాగా సాగలేదు. కొన్ని సినిమాలు నిరాశపరిస్తే.. మరికొన్ని సినిమాలు నాగ్ ఎందుకు చేశాడా అనుకున్నారు. తన పరిధిలో తను చేసిన ప్రయత్నాలన్నీ కొత్తగానే ఉన్నా.. ప్రేక్షకులను రుచించలేదు. ఒక్క హిట్ కోసం కింగ్ లాంటి కామెడీ సినిమా.. గగనం లాంటి పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రమూ చేశాడు.. కానీ ఫలితం ఆయన స్థాయిలో రాలేదు..


అయితే ఈ సారి చాలా పెద్ద ప్రయోగం మొదలుపెట్టాడు. మనం అంటూ కుటుంబమంతా కలిసి నటించే సినిమా. అలాగని అదేదో తమ కోసం తీస్తున్నది కాదు.. కథనే నమ్మి నాగ్ చేసిన ప్రయత్నం. కానీ అంతలోనే దుర్వార్త. నాగేశ్వరరావు గారికి క్యాన్సర్. అయినా బాధను దిగమింగుకుని కుటుంబమంతా కలిసి చేసిన మనం.. సూపర్ హిట్ అయింది. కాకపోతే ఆ విజయాన్ని చూడ్డానికి నాగేశ్వరరావు గారు లేరు. కాకపోతే చివరి క్షణం వరకూ నటించాలన్న ఆయన కోరిక మాత్రం తీరింది.. అలాగే మనం.. కమల్ హాసన్ కు నచ్చిన ది బెస్ట్ మూవీస్ లిస్ట్ లోనూ చోటు సంపాదించుకుంది.


కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.అయినా నాగ్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. సరికదా ఇంకా యంగ్ గా కనిపిస్తున్నాడు. అదే ఓ దర్శకుడిని అట్రాక్ట్ చేసింది. దీంతో మన్మథుడిని సోగ్గాడుగా మార్చి సోగ్గాడే చిన్నినాయనా అంటూ సూపర్ హిట్ కొట్టాడు. ఇందులో రెండు పాత్రల్లో నాగ్ లుక్స్ కు యంగ్ హీరోస్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తర్వాత మళ్లీ మంచి విజయం పడలేదు నాగ్ కు. లేటెస్ట్ గా వచ్చిన మన్మథుడు -2 సైతం నిరాశపరిచింది. అయినా తన లుక్ అండ్ ఫిజిక్ కు పర్ఫెక్ట్ గా మెయిన్టేన్ చేస్తూ ఎప్పటికప్పుడు యంగ్ స్టర్స్ కు పోటీగా నిలుస్తున్నాడు నాగ్.


నాగార్జున బిజినెస్ లోనూ ఎక్స్ పర్ట్.. స్వీట్ పర్సన్ అంటారు. ఆడంబరాలుండవు.. డౌన్ టు ఎర్త్. ఒకవేళ ఆయనే గొప్ప ఇంటి కుర్రవాణ్ని.. అక్కినేని అంతటోన్ని అంటూ కాలర్ ఎగరేసుకుని ఉంటే.. ఈ రోజు అంత సాధించి ఉండేవారు కాదు..

ప్రస్తుతం తనయులిద్దరినీ హీరోలుగా నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తనూ ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తూ కెరీర్ లో 99వ సినిమా అనే మైలురాయిని చేరుకున్నాడు. 100వ సినిమా అనే అందమైన అరుదైన మైలురాయిని మెమరబుల్ గా మార్చుకునే ముందు ఈ సినిమా విజయంతో ఆ మూవీ మొదలుపెట్టాలనుకుంటోన్న కింగ్ నాగ్ కు తెలుగు 70ఎమ్ఎమ్ తరఫు నుంచి బర్త్ డే విషెస్ చెబుదాం..

                                                                                - బాబురావు. కామళ్ల

Related Posts