ఒకప్పటి యాక్షన్ హీరో సుమన్ బర్త్ డే స్పెషల్

ఎనభయవ దశకంలో అన్ని ఇండస్ట్రీస్ లోకి సరికొత్త టాలెంట్ ఎంటర్ అయింది. కొత్త హీరోలు, దర్శకులు, హీరోయిన్లతో పాటు నిర్మాతలు కూడా చాలామంది కొత్తవాళ్లు వచ్చేశారు. అలా వచ్చిన వారిలో తెలుగువాడు కాకపోయినా మనం ఓన్ చేసుకున్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సుమన్ ఒకరు. కళ్లు తిప్పుకోనివ్వలేని అందంతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం వల్ల.. సుమన్ హీరో కావాలని అనుకోకపోయినా అయ్యేలా చేసింది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుని ఫ్యామిలీ స్టార్ గా మారి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న సుమన్ పుట్టిన రోజు(సోమవారం) ఇవాళ. ఈ సందర్భంగా ఆయన సినిమా ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం.

సుమన్.. ఏ నటనానుభవం లేకుండా వెండితెరపై ప్రవేశించాడు. స్వయంకృషి, ప్రతిభతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 80వ దశకంలో టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపూ తెచ్చుకున్నాడు. ఓ దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ కు గట్టి పోటీ ఇచ్చినా.. అనూహ్యమైన మలుపులతో ఆయన కెరీర్ అంత వేగంగా సాగలేకపోయింది. యాక్షన్ హీరోగా పేరున్నా.. అన్ని రకాల సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించిన సుమన్.. ఎన్టీఆర్ తర్వాత దేవుడు పాత్రలతో ఆశ్చర్యపరిచాడు. అందగాడుగా ఎంట్రీ ఇచ్చినా.. ప్రతిభతోనే రాణించిన నటుడు సుమన్.


కర్ణాటక స్వస్థలమైనా తమిళనాడులో స్థిరపడ్డ కుటుంబం సుమన్ ది. డిగ్రీ తర్వాత కరాటే ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్న అతన్ని ఓ మిత్రుడు కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన టిఆర్ రామన్నకు పరిచయం చేశాడు. స్వతహాగా అందగాడు కావడంతో వెంటనే తను తీస్తున్న నీచల్ కులమ్ అనే సినిమాలో పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర ఇచ్చారు రామన్న. తర్వాత కూడా తమిళంలోనే మరో రెండు మూడు సినిమాలు చేశాడు. తెలుగులో కోడి రామకృష్ణ తరంగిణి సినిమాలో ఓ హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. తరంగిణి పెద్ద హిట్ కావడంతో సుమన్ కు ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది.


అప్పటి వరకూ తెలుగు తెరపై శోభన్ బాబే అందగాడు అనుకున్న వారికి సుమన్ లో కొత్త కోణం కనిపించింది. పైగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్ కావడంతో అతని ఫైట్స్ కూడా మనవారిని ఆకట్టుకున్నాయి. ఆ ఆకర్షణకు దర్శకుడు వంశీ కూడా పడిపోయాడు. అందుకే సితార సినిమాలో హీరోగా తీసుకున్నాడు. పల్లెటూళ్లలో నాటకాల కుర్రాడి పాత్రలో సుమన్ సూపర్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతనికి వరుసగా అవకాశాలు వచ్చాయి.. మరికొన్ని సినిమాల తర్వాత హీరోగా సుమన్ బిజీ అయిపోయాడు. దీంతో తను పరిచయమైన తమిళ పరిశ్రమను పక్కనబెట్టి తెలుగులోనే కంటిన్యూస్ గా మూవీస్ చేయడం ప్రారంభించాడు. సుమన్ యాక్షన్ సీన్స్ కు మనోళ్లు ఫిదా అయిపోయారు. అతని ఫైట్స్ చాలా నేచురల్ గా ఉండేవి. దీంతో అభిమానులూ పెరిగారు. అంతేకాదు.. అతన్ని ఇన్స్ స్పిరేషన్ గా తీసుకున్న ఎందరో యువకులు అప్పట్లో కరాటే కూడా నేర్చేసుకున్నారు..


ఎనభైల ఆరంభంలో మొదలైన సుమన్ హవా ఏకధాటిగా సాగింది. అన్నీ విజయాలే కాకపోయినా ఎన్నో విజయాలు అందుకున్నాడు. మనవాడు కాకపోయినా తెలుగు హీరోగానే సెటిల్ అయిపోయాడు. అతనికి ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. అయితే కేవలం యాక్షన్ సినిమాలే కాకుండా అన్ని రకాల సినిమాలతో దూసుకపోయాడు. క్లాస్ మాస్ మిక్స్ అయిన అతని సినిమాలకు మహిళా ప్రేక్షకులూ పెరిగారు. కానీ ఇంతలోనే ఓ ఊహించని సంఘటన సుమన్ కెరీర్ ను కుదిపేసింది. నీలి చిత్రాల్లో నటించాడంటూ సుమన్ ను అనూహ్యంగా అరెస్ట్ చేశారు.. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. టాప్ హీరో రేంజ్ కు గట్టి పోటీ ఇస్తోన్న సుమన్ లాంటి హీరోకు అది షాకింగ్ న్యూస్.. కానీ అభిమానులెవ్వరూ అతనలాంటి పని చేశాడంటే నమ్మకలేకపోయారు. అయినా కొన్నాళ్లు జైలు జీవితం తప్పలేదు.

అయితే జైలు నుంచి విడుదల కాగానే అతను చేసిన బందిపోటు, ఉక్కు సంకెళ్లు, ఉగ్రనేత్రుడు, నేరం నాది కాదు, రావుగారింట్లో రౌడీ.. ఇలా వరుసగా అన్నీ సూపర్ హిట్ అయి మళ్లీ సుమన్ ను ఫామ్ లోకి తెచ్చాయి. నిజానికి సుమన్ జైలుకు వెళ్లిన తర్వాత ఇక అతని పని ఐయిపోయిందనుకున్నారు. జైలు తర్వాత సుమన్ తో ఇక ఎవరూ సినిమాలు చేయరేమో అనుకన్నారు.. కానీ కాట్రగడ్డ మురారి డేర్ చేసి అతనితో వరుసగా సినిమాలు చేసి మరీ హిట్లు కొట్టాడు.. అతను మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈసారి మరింత ఉత్సాహంగా సినిమాలు చేశాడు. దీంతో అతని డిప్రెషన్ కూడా దూరమైంది.


తను కష్టాల్లో ఉండగా ఆదుకుని ఓ తెలుగు నిర్మాతే మళ్లీ తనతో సినిమాలు చేశాడు అన్న కారణంగా పెళ్లంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆనాటి అగ్రరచయిత డివి నరసరాజుగారి మనవరాలును పెళ్లి చేసుకున్నారు.


అటుపై తనను హీరోగా పరిచయం చేసిన కోడి రామకృష్ణ డైరెక్షన్ లోనే చేసిన 20వ శతాబ్ధం సుమన్ కెరీర్ ను మరో రేంజ్ కు తీసుకువెళ్లింది. ఓ స్మగ్లర్ గా అతను చేసిన పాత్ర ఎంతో మందిని ఆకట్టుకుంది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పట్లో టాప్ చైర్ కు గట్టి పోటీ ఇచ్చాడు సుమన్. ఇంకా చెప్పాలంటే చాలామంది స్టార్ హీరోల కంటే కాస్త ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.. అయినా ఎందుకో సుమన్ కెరీర్ అనుకున్నట్టుగా సాగలేదు..

90ల తర్వాత యాక్షన్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు సుమన్. అడపాదడపా యాక్షన్ సినిమాలు చేసినా పెద్దింటల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు, భలే మావయ్య, ఖైదీ ఇన్స్ పెక్టర్ లాంటి సినిమాలతో అటు మహిళల్లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా న్యాయం మీరే చెప్పాలి సినిమాలో సుమన్ కు జంటగా నటించిన జయసుధకు తమ్ముడిగా బావ బావమరిదిలో అద్బుతమైన నటన చూపించాడు.. 25యేళ్ల కిందట సుమన్ అమ్మాయిలకు హాట్ ఫేవరెట్.. మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా అతనంటే పడిచచ్చిన వారు చాలామందే ఉన్నారు. అందుకే అతను ఫ్యామిలీ హీరోగా మారిన తర్వాత అభిమానుల సంఖ్య మరింత పెరిగిపోయింది. సుమన్ అద్భుతమైన నటుడైతే కాకపోవచ్చు. కానీ తను చేసిన ప్రతి సినిమాలోనూ గొప్ప నటనే చూపించాడు.. టాప్ హీరోగా ఎదుగుతాడనుకున్న సుమన్.. ఓ స్థాయి వరకూ వచ్చి ఆగిపోయాడు. అయితే నాటి టాప్ హీరోయిన్లందరూ సుమన్ తో సినిమాలు చేసిన వారే. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా ఎదిగిన నగ్మా, సిమ్రన్ వంటి బ్యూటీస్ అతని సినిమాలతో పరిచయమైనవారే..

సుమన్ కెరీర్ లో మరో పెద్ద మలుపు అన్నమయ్య. హ్యాండ్సమ్ హీరోగా.. రాణిస్తోన్న సుమన్ కు రాఘవేంద్రరావు నుంచి పిలుపు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరుడి పాత్ర. రాఘవేంద్రరావు, నాగార్జునలకు ఉన్న ఇమేజ్ కు అలాంటి సినిమా తీయడం సాహసమైతే.. సుమన్ ను ఈ పాత్రలో తీసుకోవడం మరో సాహసం. కానీ వారి సాహసం ఫలించింది.. అన్నమయ్య సుమన్ ను సిల్వర్ స్క్రీన్ శ్రీనివాసుడిగా మార్చివేసింది. ఆరడుగుల ఆజానుబాహుడు, అందమైన వాడు కావడంతో వెంకటేశ్వరుడిగా ఇట్టే ఒదిగిపోయాడు సుమన్. సుమన్ ను చూసిన తర్వాత ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకోలేకపోయారు. ఆ తర్వాత రాఘవేంద్రరావే శ్రీ రామదాసులో శ్రీరాముడి పాత్ర చేయించాడు. అందులోనూ అంతే ఈజీగా ఒదిగిపోయాడు. తర్వాత మరికొన్ని సినిమాల్లో దేవుడిగా కనిపించి శభాష్ అనిపించుకుని.. అన్నగారి తర్వాత దేవుడి పాత్రల్లో అంత అందంగా ఒదిగిపోయిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.


కానీ అన్నమయ్య తర్వాత హీరోగా సుమన్ కెరీర్ మందగించింది. వరుసగా కొన్ని ఫ్లాపులు కూడా వచ్చాయి. దీంతో 2000తర్వాత పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యాడు. అన్నమయ్య తర్వాత మూడేళ్లలో ఏడు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ విజయాలు అంతంతమాత్రమే. మరోవైపు పరిశ్రమలో వస్తున్న కొత్త మార్పులు కూడా సుమన్ పరాజయాల కెరీర్ పై ప్రభావం చూపించాయి.


అయితే ఇప్పటి వరకూ హీరోగా, పాజిటివ్ పాత్రల్లోనే కనిపించిన సుమన్ సడెన్ గా విలన్ గా మారాడు. రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీలో విలన్ గా సుమన్ సూపర్ అనిపించుకున్నాడు. తర్వాత తమిళంలో మరికొన్ని సినిమాల్లోనూ విలన్ గా కనిపించినా.. తెలుగులో మాత్రం సుమన్ తో విలనీ చేయించే సాహసం చేయలేకపోతున్నారు మన దర్శకులు.

ఏదేమైనా సుమన్ లాంటి ఆర్టిస్ట్ ను తెలుగువారు ముందు నుంచీ సరిగా వాడుకోలేదనే చెప్పాలి.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నా అతని సత్తాకు తగ్గ పాత్రలు రావడం లేదు. లేదంటే అతనూ ఆచితూచి ఒప్పుకోవడం కాకుండా వచ్చిన ప్రతి సినిమాను చేస్తున్నాడు. ఓ రకంగా సుమన్ నుంచి అతని అభిమానులు ఆశించే సినిమాలు రాకపోవడానికి ఇదీ ఓ కారణంగా చెప్పొచ్చు.

అందుకే ఒకప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన వాడు కాస్తా.. ఇప్పుడు లెక్క కోసమే సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని అభిమానులూ ఫీలవుతున్నారు. ఆ మధ్య బాలీవుడ్ లోనూ ఎంటర్ అయ్యాడు. గబ్బర్ సినిమాలో విలన్ గా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో సుమన్ కు కలిసొచ్చిందేం లేకపోయింది. సుమన్ త్వరలోనే మళ్లీ హీరోగా చేస్తానని ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. చేస్తే చాలామంచిదే.

ఇప్పటి పరిస్థితులు, తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. కానీ హీరోగా కాకపోయినా.. తన స్థాయికి తగ్గట్టుగా కాస్త లేట్ అయినామంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుని ఆనందపెట్టాలని కోరుకుంటున్నారు సుమన్ అభిమానులు. మరి ఆదిశగా సుమన్ కూడా ఆలోచించాలని కోరుకుంటూ మరోసారి సుమన్ కు తెలుగు 70ఎమ్ఎమ్ తరఫున బర్త్ డే విషెస్ చెబుదాం..

                                                                            - బాబురావు. కామళ్ల

Related Posts