నేటితరం కథానాయకుల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. పోయినేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్.. ఈ ఏడాది తన మూడో చిత్రంగా ‘రూల్స్ రంజన్‘ని రిలీజ్ చేశాడు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‘ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘రూల్స్ రంజన్‘.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. 20 ఏళ్ల క్రితమే తరుణ్, త్రిష కాంబోలో ‘నీ మనసు నాకు తెలుసు‘ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రత్నం కృష్ణ. అయితే అప్పట్లో ఇతని పేరు జ్యోతి కృష్ణ అని ఉండేది. ఆ తర్వాత తమిళంలో మరో రెండు సినిమాలు చేసి.. తెలుగులో గోపీచంద్ తో ‘ఆక్సిజన్‘ సినిమా తీశాడు. ఇప్పుడు తన పేరును రత్నం కృష్ణ గా మార్చుకుని ‘రూల్స్ రంజన్‘ తెరకెక్కించాడు.
ఎ.ఎమ్.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా ‘రూల్స్ రంజన్‘ చిత్రాన్ని నిర్మించారు. కథ విషయానికొస్తే తిరుపతికి చెందిన ఓ మధ్యతరగతి కుర్రాడు మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం పొంది ముంబయి వెళతాడు. అక్కడ హిందీ రాకపోవడం వల్ల ఆరంభంలో ఇబ్బందులు పడతాడు. అయితే ఆ తర్వాత అవన్నీ అధిగమించి తానే టీమ్ లీడరై అందరికీ రూల్స్ పెట్టి శాసించే రూల్స్ రంజన్ గా మారతాడు. ఇక కాలేజ్ రోజుల్లోనే తను గాఢంగా ప్రేమించి చెప్పలేకపోయిన సనా (నేహా శెట్టి) ముంబైకి ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ పాత ప్రేమ చిగురిస్తుంది. సనా తనకు దగ్గరవుతోంది అనే సమయంలో ఆమె మాయమవ్వడం. ఆమెకు కోసం మళ్లీ తిరుపతి రావడం. చివరకు మనో రంజన్, సనాని కలుసుకున్నాడా? ఆమెను పెళ్లి చేసుకునేందుకు మనో రంజన్ వేసిన ఎత్తులేంటి? అనేది మిగతా స్టోరీ.
మనో రంజన్ పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో నటించాడు. కామెడీ టైమింగ్ లోనూ కిరణ్ ఫర్వాలేదనిపించాడు. సనా గా నేహా శెట్టి అందంగా కనిపించింది. ‘సమ్మోహనుడా‘ పాటలో రొమాంటిక్ గా తన ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. ప్లేబాయ్ గా వెన్నెల కిషోర్ వినోదం మధ్యలో రిలీఫ్. హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ లు కూడా తమ పాత్రలతో కామెడీని పంచారు. ఇంకా.. సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, నాగినీడు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే దర్శకుడు ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం.. ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్ పేలవంగా ఉండడంతో ‘రూల్స్ రంజన్‘ ఓ రొటీన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.