బాలీవుడ్ నుంచి బడా లైనప్

గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ బాగా కుదేలయ్యింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా పరాజయాలు పాలయ్యాయి. అయితే.. ఈ ఏడాది ‘పఠాన్, జవాన్‘లతో బాలీవుడ్ కి మంచి బూస్టప్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద వెయ్యేసి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దాంతో బాలీవుడ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందనే ఆశలు చిగురించాయి. ఇదే ఊపులో రాబోయే మూడు నెలల్లో మరో నాలుగు సినిమాలు బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వస్తున్నాయి.

వైవిధ్యభరితమైన యాక్షన్‌ కథలతో అభిమానుల్ని అలరిస్తుంటాడు బాలీవుడ్ యూత్ స్టార్ టైగర్ ష్రాఫ్‌. ‘వార్‘ సినిమాతో యాక్షన్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు టైగర్. మళ్లీ అలాంటి ఫుల్ లెన్త్ యాక్షన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో ‘గణపత్‘ మూవీ వస్తోంది. ‘ఎ హీరో ఈజ్ బార్న్‘ అనే ట్యాగ్ లైన్ తో వికాష్ బెహ్ల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కృతి సనన్ కూడా ఉన్నారు. లేటెస్ట్ గా రిలీజైన ‘గణపత్‘ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘గణపత్‘ రిలీజవుతోంది.

నవంబర్ లో దివాళి కానుకగా మరో క్రేజీయెస్ట్ బాలీవుడ్ మూవీ ‘టైగర్ 3‘ వస్తోంది. ఇప్పటికే టైగర్ సిరీస్ లో ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై‘ వంటి విజయాలందుకున్న సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ఇది. మనీష్ శర్మ డైరెక్షన్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. సల్మాన్ కి జోడీగా కత్రిన కైఫ్ నటించింది. విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడు. ‘టైగర్ 3‘తో సల్మాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రణ్ బీర్ కపూర్ ‘యానిమల్‘. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో తెలుగులోనూ.. ‘కబీర్ సింగ్‘తో బాలీవుడ్ లోనూ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో రణ్ బీర్ కి జోడీగా రష్మిక నటించింది. ఇతర కీ రోల్స్ లో అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించారు. ఈ చిత్రంలో సందీప్ రెడ్డి.. హీరో రణ్ బీర్ ను నెవర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేసినట్టు ఇప్పటికే టీజర్ లో కనిపించింది.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ‘డంకీ‘. ఎన్నాళ్లగానో సరైన హిట్ కోసం ఎదురుచూసిన బాలీవుడ్ కి బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్స్ అందించిన కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న సినిమా ఇది. డిసెంబర్ 22న క్రిస్టమస్ కానుకగా ‘డంకీ‘ రిలీజవుతోంది. హిందీ చిత్ర సీమలో అపజయమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

రాజ్ కుమార్ హిరాణి తో కలిసి షారుఖ్ తన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. తాప్సీ, దియా మీర్జా, బోమన్ ఇరానీ లు మిగతా పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం రెండు బడా హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుఖ్.. ‘డంకీ‘తో హ్యాట్రిక్ కొడతాడనే ఆశాభావంతో ఉన్నారు ఫ్యాన్స్.

Related Posts