ఎన్టీఆర్ కు భారతరత్న?

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటడమే కాకుండా.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగు వారు వెండితెర ఇలవేల్పుగా కొలిచే నటరత్న నందమూరి రామారావు వెండితెరపై చేయని పాత్రంటూ లేదు. దేవుళ్ల పాత్రలకు యావత్ భారతదేశంలోనే తిరుగులేని నటుడు అనిపించుకున్న నటదిగ్గజం ఎన్టీఆర్.

కేవలం నటనలోనే కాదు దర్శక నిర్మాతగానూ ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. సినీ పరిశ్రమకు విశేష సేవలందించినందుకు 1968లోనే ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ సహ నటుడు ఏఎన్నార్ కి పద్మశ్రీ అవార్డును అందించింది భారత ప్రభుత్వం. అయితే.. ఎన్టీఆర్ తన జీవితకాలం పద్మశ్రీతోనే సరిపెట్టుకుంటే ఏఎన్నార్ మాత్రం పద్మభూషణ్, పద్మవిభూషణ్, సినీ ఇండస్ట్రీలో అత్యుత్తమ అవార్డుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే వంటి పురస్కారాలను పొందారు.

ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రాకపోవడానికి కారణం.. ఆయన రాజకీయాలతో బిజీ అవ్వడమే అంటారు. ఒక పార్టీకి అధినేత అయిన ఎన్టీఆర్ ను.. కేంద్రంలో అధికార పార్టీలు అవార్డుల విషయంలో చిన్న చూపు చూశాయనే అభిప్రాయాలున్నాయి. ఇక.. ఆయన జీవించి ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ మినహా మిగతా పద్మ అవార్డులు రాకపోయినా.. ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నదే.

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఎలాంటి వారో.. తమిళులకు అలాంటి ఆరాధ్యుడు ఎమ్జీఆర్. ఎమ్.జి.రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈమధ్య మరింత జోరందుకుంది. ఈమధ్య కేంద్రప్రభుత్వం వరుసగా భారతరత్న పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈకోవలో ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ప్రకటించబోతున్నారనే వార్త చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈరోజో, రేపు అధికారికంగా ప్రకటించనున్నారట

Related Posts