మంచు మోహన్ బాబు’ నట ప్రస్థానానికి 48 ఏళ్ళు

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మంచు మోహన్ బాబు నట ప్రస్థానానికి విజయవంతంగా 48 ఏళ్ళు (2023) పూర్తయ్యాయి. మంచు భక్తవత్సలం నాయుడు అసలు పేరైతే సినిమాలలోకి మోహన్ బాబుగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా మొదటి సినిమా స్వర్గం నరక. కానీ, ఇంతకన్నా ముందే ఆయన 1974 లో ‘అల్లూరి సీతారామ‌రాజు’ ఆ త‌ర్వాత ‘క‌న్న‌వారి క‌ల‌లు’ అనే చిత్రాలలో న‌టించారు. ఈ సినిమాల్లో మోహ‌న్ బాబు చేసిన పాత్రలకి అంతగా గుర్తింపు రాలేదు.

అయితే, ‘స్వ‌ర్గం న‌ర‌కం’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకొని అక్కడ నుంచి ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విలన్ గా ఎన్నో సినిమాలు చేసిన మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే, మోహన్ బాబుని కలెక్షన్ కింగ్ అంటారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణ రావు గారిని గురువుగా భావిస్తారనే అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ మోహన్ బాబుకి అత్యంత సన్నిహితులు. ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగులు చెప్పడంలో మోహన్ బాబే అని ఇండస్ట్రీలో చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ లోని మిగతా ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయనకి మంచి అనుబంధం ఉంది. సిన్సియారిటీకి మారుపేరుగా నిలిచారు మోహన్ బాబు.

సొంతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించి 1982లో ప్రతిజ్ఞ అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్ళాం, బ్రహ్మ, కుంతీపుత్రుడు, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, అడవిలో అన్న, కలెక్టర్ గారు, రాయుడు, ఝుమ్మందినాదం, పాండవులు పాండవులు తుమ్మెద, మామ మంచు అల్లుడు కంచు వంటి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. మోహ‌న్ బాబు చేస్తున్న సామాజిక సేవ‌లకు గానూ ఇప్పటికే ఎన్నో అవార్డుల‌..రివార్డులు అందుకున్నారు.

గౌరవ డాక్టరేట్.. ‘పద్మశ్రీ’ తోనూ ఆయ‌నను స‌త్కరించారు. 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు. ఇక విద్యారంగంలో అడుగుపెట్టి 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. మోహన్ బాబు ప్ర‌స్తుతం తనయుడు విష్ణు హీరోగా తెర‌కెక్కుతోన్న ‘క‌న్న‌ప్ప’ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తూ.. ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Related Posts