మెగా 156 షూటింగ్ మొదలయ్యింది

‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం మెగా 156. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ సినిమా బుధవారం (నవంబర్ 22) నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. అందుకు సంబంధించిన ఓ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. చుట్టూ అడవి నేపథ్యం.. మధ్యలో క్లాప్ బోర్డ్ పెట్టి ఉన్న ఈ ఫోటోని బట్టి చూస్తుంటే.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ షెడ్యూల్ మొదలైనట్టు తెలుస్తోంది.

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహాలో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మారేడుమిల్లిలో మొదలుపెడతారనే ప్రచారం జరిగింది. అయితే.. షూటింగ్ లొకేషన్ విషయంలో మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఐదుగురు కథానాయికలకు అవకాశం ఉందట. వీరిలో అనుష్క, మృణాల్ ఠాకూర్ లను ఇద్దరు నాయికలుగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

యు.వి.క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మూడు దశాబ్దాల తర్వాత మెగాస్టార్ తో మరకతమణి సంగీతాన్నందిస్తున్న చిత్రమిది. గతంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన చోటా కె.నాయుడు ఈ చిత్రానికి కెమెరామేన్. ఇంకా.. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ ఈ మూవీకి మరో అదనపు ఆకర్షణ కానుంది.